అమెరికన్ ట్యాక్సీ కంపెనీ వింత ప్రకటన.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2021-08-07T18:08:22+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో గత కొన్ని రోజులుగా మళ్లీ మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు నాలుగు రోజులుగా కొత్త కేసుల సంఖ్య లక్షకు పైగానే నమోదవుతోంది.

అమెరికన్ ట్యాక్సీ కంపెనీ వింత ప్రకటన.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు!

మిస్సౌరీ: అగ్రరాజ్యం అమెరికాలో గత కొన్ని రోజులుగా మళ్లీ మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు నాలుగు రోజులుగా కొత్త కేసుల సంఖ్య లక్షకు పైగానే నమోదవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల మందగించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరుగులు పెట్టించేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఇలా ఒకవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఊతమిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే.. మరోవైపు టీకాలను వ్యతిరేకించే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. వివిధ కారణాలతో వ్యాక్సిన్లు తీసుకోవడానికి అక్కడి ప్రజలు విముఖత చూపిస్తున్నారు. 


ఇలా టీకాలపై ఆసక్తి చూపించని వారికోసమే అన్నట్టుగా యూఎస్‌లోని ఓ రెస్టారెంట్‌ ఇటీవల సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. టీకా వేసుకోని, మాస్క్‌లు ధరించని వారికి మాత్రమే తమ రెస్టారెంట్లోకి అనుమతి అంటూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది. దీంతో ఈ రెస్టారెంట్ న్యూస్ వైరల్ అయింది. ఇదే కోవలో తాజాగా మిస్సౌరీలోని ఓ ట్యాక్సీ సంస్థ కూడా సంచలన ప్రకటన చేసింది. తమ ట్యాక్సీ ఎక్కాలంటే ప్రయాణికులు టీకా వేసుకుని ఉండకూడదు, అలాగే మాస్క్ ధరించకూడదని ప్రకటించింది. ‘యో’ అనే అమెరికన్ ట్యాక్సీ కంపెనీ ఇలా సంచలన ప్రకటన చేసింది.


‘యో’ యజమాని చార్లీ బెల్లింగ్టన్‌ మాట్లాడుతూ.. తమ సంస్థ వ్యాక్సినేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బహిరంగంగా ప్రకటించారు. తమ ప్రయాణికులు టీకా తీసుకున్నారా లేదా అని ముందుగానే చెక్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మాస్క్‌ ధరించమని చెబితేనే ట్యాక్సీ ఎక్కనిస్తామని అన్నారు. అంతేగాక అగ్రరాజ్యంలో టీకా ప్రక్రియలో వెనుకబడిన టాప్‌ 3 రాష్ట్రాల్లో మిస్సౌరీ కూడా ఉండడం సంతోషాన్ని ఇచ్చిందని చార్లీ చెప్పడం గమనార్హం. ఇక కరోనా విజృంభిస్తున్న వేళ ‘యో’ కంపెనీ చేసిన ఈ వింత ప్రకటన.. నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేస్తోంది.    

Updated Date - 2021-08-07T18:08:22+05:30 IST