పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం

ABN , First Publish Date - 2020-07-06T10:51:55+05:30 IST

పంచాయతీలకు నేరుగా అందిస్తున్న నిధులను స్థానిక ప్రజాప్రతినిధులు అత్యవసరాల పేరిట అనవసర ఖర్చులకు డ్రా చేస్తూ నిధులను ఫలహారం చేస్తున్నారు.

పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం

అత్యవసర ఖర్చుల పేరిట తీర్మానాలు లేకుండానే నిధులు డ్రా

ప్రహసనంగా మారిన ఇంటర్నల్‌ ఆడిటింగ్‌

సాలీన జిల్లాకు వంద కోట్ల నిధులు కేటాయింపు


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

పంచాయతీలకు నేరుగా అందిస్తున్న నిధులను స్థానిక ప్రజాప్రతినిధులు అత్యవసరాల పేరిట అనవసర ఖర్చులకు డ్రా చేస్తూ నిధులను ఫలహారం చేస్తున్నారు. ఇందుకు కార్యదర్శులు కూడా తోడవడంతో పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం యథేచ్ఛగా సాగిపోతోంది. జిల్లాలోని పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి యేటా వంద కోట్లకు పైగా నిధులు విడుదలవుతున్నాయి. ఈ నిధులను గ్రామ పంచాయతీల జనాభా ప్రతిపాదికన విభజించి తలసరి 168 నుంచి 180 రూపాయిల వరకు లెక్క కట్టి నిధులు ప్రతి నెలా విడుదల చేస్తున్నారు. 500 జనాభా కలిగిన ప్రతి గ్రామ పంచాయతీకి సగటున రూ.84,000 మొత్తం నిధులు సమకూరుతున్నాయి. ఈ నిధులను పంచాయతీలు ప్రాధాన్యతల ప్రాతిపదికన ఖర్చు చేయాల్సి ఉండగా సర్పంచులు, కార్యదర్శులు కుమ్మక్కై   పాలక వర్గం ఆమోదం లేకుండానే నిధులు డ్రా చేసి మింగేస్తున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున విన్పిస్తున్నాయి. 


కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 335 జీపీలకు గాను ప్రతి నెల సగటున 7-8 కోట్ల రూపాయిలు విడుదల చేస్తుండగా ఇందులో 60 శాతం నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగం అవుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా పంచాయతీల్లో పాలకవర్గం తీర్మానం మేరకు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోవడం లేదు. అత్యవసరం పేరిట నిధులు డ్రా చేసి ఆ తర్వాత వార్డు సభ్యులతో అనధి కారికంగా సంతకాలు తీసుకొని తీర్మానాలు చేసినట్టు మినిట్స్‌బుక్స్‌లో నమోదు చేస్తున్నట్టు చెబుతు న్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ జరపాల్సిన జిల్లా పంచాయతీరాజ్‌ అధికా రులు పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో సర్పం చుల ఆడిందే ఆట, పాడిందే పాట వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాలోని పంచాయతీలకు ప్రస్తుతం స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో పాటు 14వ ఆర్థిక సంఘం (కేంద్రం ద్వారా) నిధులు కూడా వస్తున్నాయి. దాంతో పాటు స్థానిక పన్నుల వసూళ్ల వంటి ఆదాయం కలుపుకుంటే గ్రామ పంచాయతీలకు మూడు రకాల నిధులు అందు బాటులో ఉన్నాయి. 


వీధి దీపాలు, శానిటేషన్‌ పేరిట..

గ్రామాల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధుల దుర్వినియోగంలో సింహభాగం అత్యవసర పనులు పేరిట సాగుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల పేరిట ప్రతీ నెల తప్పుడు బిల్లులు సృష్టించి నిధులు కాజేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాల్లోని 335 గ్రామాల్లో అత్యధికంగా వీధి దీపాల మరమ్మతులు నిర్వహణ పేరిట నిధులు డ్రా అవుతున్నాయి. వాస్తవంగా గ్రామ పంచాయతీల్లో అత్యఽధిక కాలం మన్నే నాణ్యత కలిగి వీధి దీపాలను ఏర్పాటు చేయాలన్న నిబంధలున్నాయి. అతి తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునే ఎల్‌ఈడీ బల్బులు వినియోగించాల్సి ఉంది.


వీటి కాల పరిమితి సగటున 12 నుంచి 18 నెలల మన్నికగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మర మ్మతులు, లైట్లు కాలిపోయే పరిస్థితి ఉండదు. అయినా సర్పంచులు మరమ్మతుల పేరిట నిధులు డ్రా చేయ డంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ నెలకు ఒక్కసారి కూడా జరగకపోయి ప్రతీ నెల దాని పేరుతో చిన్న పంచాయతీలో సగటున రూ.30వేల నుంచి 50 వేలు డ్రా చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే 5వేల జనాభా పైబడిన గ్రామ పంచాయతీల్లో ప్రతి నెల రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షలు పారిశుధ్య నిర్వ హణ పేరిట డ్రా చేస్తున్నట్టు తెలుస్తోంది. 


కరువైన పర్యవేక్షణ

గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఏటా నిర్వహిస్తున్న అంతర్గత ఆడిటింగ్‌ ప్రక్రియ ప్రహసనంగా మారిం దన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసన వెంటనే ప్రతి పంచాయ తీల్లో నిధులెన్ని? జరిగిన ఖర్చు ఎంత? చేపట్టిన అన్ని పనులకు తీర్మానాలు ఉన్నాయా? లేవా? ప్రాధాన్యత పరంగా పనులు చేపట్టారా? పంచాయతీలో కొనుగోలు చేసిన వాటిలో పారదర్శకత ఎంత అనే అంశాలను పరిశీలించి నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. అయితే సర్పంచులు, కార్యదర్శులు మండల స్థాయి ఆడిటింగ్‌ అధికారులను మచ్చిక చేసుకొని అక్రమాలు బయటకు రాకుండా ముడుపులు ముప్ప చెప్పి ఆడి టింగ్‌ను మమ అన్పించేస్తున్నారని, పంచాయతీ రాజ్‌ శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు ఆంధ్రజ్యోతికి వెల్లడించాయి.


ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిటింగ్‌ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ప్రక్రియను డిసెంబరు 31లోపు పూర్తి చేయాల్సి ఉన్నట్టు ఆ శాఖ వర్గాలు చెబు తున్నాయి. ఈసారి మాత్రం ఆడిటింగ్‌ పారదర్శకంగా నిర్వహించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికపే పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించి గతానికి భిన్నంగా ప్రతీ నెల నిధులు విడుదల చేస్తున్నందున ఆడిటింగ్‌పె సీరి యస్‌గా దృష్టి సారించిందని అంటున్నారు. 


జిల్లాలో ఇంకా కొలిక్కి రాని శానిటేషన్‌ ప్రక్రియ

ప్రస్తుతం వర్షాకాలం మొదలై జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  అంటు వ్యాధులు ప్రమాదం పొంచి ఉన్న దరిమిలా గ్రామాల్లో శానిటేషన్‌ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.  కానీ ఇప్పటికీ సగానికి పైగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రహసనంగానే మారినట్టు అధికారులే చెబుతున్నారు. ప్రతి రోజు దీనిపై కలెక్టర్‌తో పాటు పంచాయతీ అధికారులు, సర్పంచులను అప్రమత్తం చేస్తున్నా   పనులు మందకొడిగా సాగుతున్నాయి. వాస్తవానికి వర్షాకాలం ఆరంభంకంటే ముందే గ్రామాల్లో మురికి కాల్వల పూడికతీత, సాగునీటి వనరుల క్లోరినేషన్‌, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మట్టి పోసి చదును చేయటం వంటి పనులు జరగాలి. ఇప్పటి వరకు కొన్ని గ్రామా ల్లోనే ఈ ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-07-06T10:51:55+05:30 IST