Abn logo
Sep 25 2021 @ 03:30AM

పోరాడి ఓడిన మిథాలీ సేన

ఆఖరి బంతికి నెగ్గిన ఆసీస్‌

2-0తో సిరీస్‌ కైవసం 

మాకే (క్వీన్స్‌లాండ్‌): ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టుతో మిథాలీ సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పర్యాటక భారత్‌ 5 వికెట్లతో పోరాడి ఓడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి గెలిచిన ఆతిథ్య ఆసీస్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకొంది. తొలుత ఓపెనర్‌ స్మృతి మంధాన (86) అర్ధ సెంచరీతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు సాధించింది. రిచా ఘోష్‌ (44), పూజా వస్ర్తాకర్‌ (29), జులన్‌ గోస్వామి (28 నాటౌట్‌) రాణించారు. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (8) నిరాశ పర్చింది. అనంతరం భారీ ఛేదనలో ఓపెనర్‌ బెత్‌ మూనీ (133 బంతుల్లో 12 ఫోర్లతో 125 నాటౌట్‌) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో కంగారూలు ఓవర్లన్నీ ఆడి 275/5 స్కోరు చేసి నెగ్గారు. 


ఆఖర్లో ఉత్కంఠ:

చివరి ఓవర్లో ఆసీస్‌ విజయానికి 13 రన్స్‌ అవసరమయ్యాయి. వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి బౌలింగ్‌కు దిగింది. తొలి రెండు బంతుల్లో కంగారూలు 5 పరుగులు సాధించారు. మూడో బంతిని గోస్వామి నోబ్‌గా వేసింది. తర్వాత రెండు బైస్‌ వచ్చాయి. ఐదో బంతికి క్యారీ 2 రన్స్‌ చేసింది. ఇక ఆఖరి బంతికి 3 పరుగులు అవసరమయ్యాయి. నికొలస్‌ క్యారీకి....జులన్‌ విసిరిన ఫుల్‌టాస్‌ బంతి నేరుగా ఫీల్డర్‌ చేతుల్లో పడగా, భారత ఫీల్డర్లు సంబరాలు చేసుకున్నారు. అయితే టీవీ అంపైర్‌ దాన్ని నోబాల్‌గా ప్రకటించడంతో భారత్‌ ఉసూరుమంది. తర్వాత బంతికి క్యారీ-మూనీ వేగంగా 2 రన్స్‌ చేసి విజయం అందించారు.


సంక్షిప్త స్కోర్లు

భారత్‌: 50 ఓవర్లలో 274/7 (స్మృతి మంధాన 86, రిచా ఘోష్‌ 44, పూజా వస్ర్తాకర్‌ 29, జులన్‌ గోస్వామి 28 నాటౌట్‌, దీప్తీ శర్మ 23, షఫాలీ వర్మ 22; తహ్లియా మెక్‌గ్రాత్‌ 3/45, సోఫీ మొలినిక్స్‌ 2/28); ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 275/5 (బెత్‌ మూనీ 125 నాటౌట్‌, తహ్లియా74, నికోలా క్యారీ 39 నాటౌట్‌).