మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ పరోటా

ABN , First Publish Date - 2020-06-20T17:56:12+05:30 IST

ట్విట్టర్‌లో ‘హ్యాండ్స్‌ ఆఫ్‌ పరోటా’ హ్యాష్‌ట్యాగ్‌ కొద్దిరోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. సోషల్‌ మీడియాలో పరోటా మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కారణమేంటో తెలుసా? జీఎస్‌టీ. రోటీలపై 5 శాతం జీఎస్‌టీ ఉంటే, పరోటాలపై 18 శాతం జీఎస్‌టీని విధిస్తున్నారు. అందుకే పరోటా

మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ పరోటా

పరోటా పసందు

ట్విట్టర్‌లో ‘హ్యాండ్స్‌ ఆఫ్‌ పరోటా’ హ్యాష్‌ట్యాగ్‌ కొద్దిరోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. సోషల్‌ మీడియాలో పరోటా మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కారణమేంటో తెలుసా? జీఎస్‌టీ. రోటీలపై 5 శాతం జీఎస్‌టీ ఉంటే, పరోటాలపై 18 శాతం జీఎస్‌టీని విధిస్తున్నారు. అందుకే పరోటా తినాలనిపిస్తే ఇంట్లోనే కానిచ్చేయండి. రకరకాల పసందైన పరోటా రుచులు ఆస్వాదించండి.


కావలసినవి: గోధుమ పిండి - రెండున్నర కప్పులు, పనీర్‌ - 100 గ్రాములు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, బంగాళదుంపలు - రెండు, క్యారెట్‌ - ఒకటి, క్యాలీఫ్లవర్‌ - ఒకటి(చిన్నది), బీన్స్‌ - ఐదారు, పచ్చి బఠాణీ - అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, గరంమసాలా - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, మామిడికాయ పొడి - అర టీస్పూన్‌, దంచిన ధనియాలు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ: ఒక బౌల్‌లో గోధుమపిండి తీసుకొని అందులో ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. కాస్త నూనె పూసి అరగంట పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలను పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేయాలి. క్యారెట్‌, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌ను కట్‌ చేయాలి. కుక్కర్‌లో బంగాళదుంపలు, క్యారెట్‌, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌, పచ్చిబఠాణీ వేసి, కాస్త ఉప్పు వేసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. మెత్తగా ఉడికిన వెజిటబుల్స్‌ను ఒక పాత్రలోకి తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కాస్త నూనె వేసి వేడి అయ్యాక అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత గరంమసాలా, ధనియాలు, మామిడికాయ పొడి, జీలకర్రపొడి, ఇంగువ వేసి కలుపుతూ మరి కాసేపు వేగించాలి. పనీర్‌ను సన్నగా తరిగి వేసి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఉడికించి, మెత్తగా చేసి పెట్టుకున్న వెజిటిబుల్‌ స్టఫ్‌  వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. మరో రెండు నిమిషాలపాటు వేగనిచ్చి, కొత్తిమీర వేసి కలిపి దింపాలి. మెత్తగా చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వెడల్పాటి చపాతీలా చేసుకోవాలి. మధ్యలో వెజిటబుల్‌ స్టఫ్‌ పెట్టి నాలుగు వైపులా చపాతీని దగ్గరకు తీసుకుని మూయాలి. తరువాత మళ్లీ చపాతీ కర్రతో నెమ్మదిగా వెడల్పు చేయాలి. పాన్‌పై వీటిని నూనె వేస్తూ పరోటాను రెండు వైపులా కాల్చాలి. అంతే... వేడి వేడి మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ పరోటా రెడీ.

Updated Date - 2020-06-20T17:56:12+05:30 IST