కేటుగాళ్లు ఎక్కడ?

ABN , First Publish Date - 2021-06-13T04:55:38+05:30 IST

కేటుగాళ్లు ఎక్కడ?

కేటుగాళ్లు ఎక్కడ?
పట్నాల శ్రీనివాసరావు

ఆచూకీ లభించని ఎంకే గ్రూపు ప్రతినిధులు

వాట్సాప్‌ స్టేటస్‌ల్లో బెదిరింపు వ్యాఖ్యలు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ‘దమ్ము.. దమ్ము ఉండాలి.. కొన్ని పనులు చేయడానికి..’ ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ఏర్పాటుకు కీలక సూత్రధారి పట్నాల శ్రీనివాసరావు వాట్సాప్‌ స్టేటస్‌ ఇది. రియల్‌ మోసంలో దోచుకున్న సొత్తుతో పరారైన ఈయన ప్రస్తుతం ఏజెంట్లను బెదిరించేలా వాట్సాప్‌ స్టేటస్‌లు పెడుతున్నాడు. పట్నాల శ్రీనివాసరావుతో పాటు ఆయన భాగస్వాములు మనోజ్‌కుమార్‌, రవితేజ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసరావు ఏడెనిమిది సెల్‌ఫోన్‌ నెంబర్లు ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఒక్కో ప్రాంతానికి వెళ్లినప్పుడు ఒక్కో నెంబర్‌ను వాడుకలోకి తీసుకొస్తాడు. కాగా, విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి వసూలు చేసిన అడ్వాన్సులే రూ.6కోట్ల వరకు ఉంటే, ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వీరంతా ఇంకెంత వసూలు చేశారో అన్నది ప్రశ్న. 

నేర చరిత్ర

పట్నాల శ్రీనివాసరావుకు ఇంతకుముందు నేరచరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. రియల్‌ మోసాలకు దిగడంతో రాజమండ్రి, విశాఖపట్నంలోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మన జిల్లాలో రియల్‌ మోసానికి తెగబడిన అనంతరం మే రెండో తేదీ నుంచి ఈ ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, తాజాగా మనోజ్‌కుమార్‌ కుటుంబీకులు కొత్త నాటకానికి తెర తీశారు. కొన్ని రోజులుగా మనోజ్‌ కనిపించడం లేదని, ఎంకే గ్రూపునకు చెందిన ఏజెంట్లపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోపక్క ఎంకే గ్రూపులో పనిచేస్తున్న 20 మంది ఏజెంట్లు ఒక్కొక్కరుగా శనివారం పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోపక్క రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉంటూనే పట్నాల శ్రీనివాస రావు ఓ రాజకీయ పార్టీలో కొనసాగు తున్నాడు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

పి.శ్రీనివాసరావు

Updated Date - 2021-06-13T04:55:38+05:30 IST