నూతన విద్యావిధానంపై స్టాలిన్ నిప్పులు

ABN , First Publish Date - 2020-08-02T03:57:19+05:30 IST

కేంద్రం ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020కి వ్యతిరేకంగా దాడిని ముమ్మరం చేసిన డీఎంకే

నూతన విద్యావిధానంపై స్టాలిన్ నిప్పులు

చెన్నై: కేంద్రం ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020కి వ్యతిరేకంగా దాడిని ముమ్మరం చేసిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శనివారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇది హిందీ, సంస్కృతాన్ని బలవంతంగా రుద్దడమేనని అన్నారు. కలిసి వచ్చే పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి దీనికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. సంస్కరణల పేరుతో పాత అణచివేత మనుస్మృతికి ఇది నిగనిగలాడే కోటులాంటిదని అభివర్ణించారు. ఈ మేరకు పార్టీ నేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


ప్రభుత్వం తీసుకొచ్చే ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. మెడికల్ అడ్మిషన్లలో ఆలిండియా కోటా (ఏఐక్యూ)లో ఓబీసీ రిజర్వేషన్ సమస్యపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టుకు వెళ్లినట్టు స్టాలిన్ గుర్తు చేశారు.


జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచడాన్ని గుర్తు చేస్తూ దేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందన్నారు.  ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న 10+2 విధానాన్ని 5+3+3+4గా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పిల్లలకు వృత్తివిద్య అంటే అది వారిపై మానసికంగా దాడిచేయడమేనని  స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-02T03:57:19+05:30 IST