ఎమ్మెల్యే అనుచరుల.. అరాచకాలు..

ABN , First Publish Date - 2021-09-17T15:19:44+05:30 IST

ఆ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు, అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వారు చెప్పిందే వేదం.. చేసిందే రాజ్యం.. అన్నట్లుగా మారింది. వారిని ఎవరైనా అడ్డుకుంటే అంతే సంగతులు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యులపైన,

ఎమ్మెల్యే అనుచరుల.. అరాచకాలు..

సమస్యలపై ప్రశ్నిస్తే.. చితకబాదుతున్న వైనం..

ఎవరికి చెప్పుకోవాలో తెలీక.. ప్రజల ఆందోళన..


ఆ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు, అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వారు చెప్పిందే వేదం.. చేసిందే రాజ్యం.. అన్నట్లుగా మారింది. వారిని ఎవరైనా అడ్డుకుంటే అంతే సంగతులు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యులపైన, ప్రభుత్వ ఉద్యోగులపైనా ప్రతాపం చూపిస్తున్నారు. పచ్చని పల్లెల్లో రక్తం పారిస్తున్నారు. ఇంతకీ ఈ పరిస్థితి ఎక్కడ? ఆ నాయకులు ఎవరు? ఆ వివరాలు.. ఇవాల్టి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడర్‌లో చూద్దాం...


పేకాట ఆడించలేదనే కారణంతో..

నాయకులేమో సైలెంట్‌గా ఉంటారు. కానీ వారి అనుచరులే వయోలెంట్‌గా మారి అన్నెంపున్నెం ఎరుగని అమాయక జనంపై విలన్లుగా విరుచుకుపడుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే  సాయిప్రసాద్‌రెడ్డి అనుచరులు.. తమను ఇంట్లో పేకాట ఆడించేందుకు ఒప్పుకోలేదని రెచ్చిపోయారు. దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి మాజీ అధ్యక్షులు ఎంజీ తిమ్మారెడ్డిపై దాడి చేశారు. తిరుమలనగర్‌లోని తిమ్మారెడ్డి ఇంటి దగ్గరకు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అనుచరులు వెళ్లి పేకాట ఆడాలని అడిగారు. ఇంట్లో మహిళలు, పిల్లలు ఉన్నారని  పేకాట ఆడటం కుదరదని తిమ్మారెడ్డి ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆయన్ను కట్టెలు, రాడ్లతో కొట్టి కాలు విరిగిపోయేలా దాడి చేశారు.


బలవంతంగా స్థలాల కబ్జా..

ఇదొక్కటే కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలానే చోటుచేసుకున్నాయి. రోడ్లు మరమ్మత్తులు చేయాలని అడిగిన ఆటోడ్రైవర్ రవిని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అనుచరులు రోడ్డుపైనే విచక్షణా రహితంగా కొట్టారు. అలాగే ఆదోని మండగేరిలో అధికార పార్టీకి చెందిన పోతుల సురేష్, తాను చెప్పినట్లు పని చేయరా... అంటూ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేసే ఉద్యోగస్తుడిని బండ బూతులు తిట్టి, అతన్ని చెంప పగులగొట్టాడు. ఆదోనిలోని వాల్మీకి నగర్‌లో ఇంటిపక్కల ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు స్థానిక వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దాన్ని అడ్డుకోబోయిన స్థల యజమానురాలు అయిన మహిళను చితకబాదారు.


సీసీ రోడ్లు లేక ఇబ్బందులు..

ఇక శ్రీశైలం నియోజకవర్గంలోనూ వైసీపీ అరాచకాలు అన్నీఇన్నీ కావు. మహానంది మండలం ఆర్.ఎస్.గాజులపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో కొన్నేళ్లుగా సీసీ రోడ్లు లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని దళితులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులు గ్రామంలో పలు చోట్ల సీసీ రోడ్లు వేస్తున్నారు. అయితే ఎస్సీ కాలనీకి మంజూరైన సీసీ రోడ్డును మరో కాలనీకి మార్పు చేశారు. దీన్ని దళితులు తీవ్రంగా ఖండించారు. తమ కాలనీలో రోడ్డు ఎందుకు వేయరు..? అంటూ దళితులు స్థానిక వైసీపీ నాయకులను నిలదీశారు. దీంతో వైసీపీ నాయకులు దళిత మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు.


 వృద్ధురాలని కూడా చూడకుండా..

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రిలో వైసీపీ నాయకుడు ఓ వృద్ధురాలిపై దాష్టీకం ప్రదర్శించాడు. ఎస్సీ కాలనీలోని వార్డు మెంబర్ కొళాయి నీటిని కాలనీలోకి వదిలారు. తన ఇంటి వైపునకు ఎందుకు నీళ్లు వదిలారు? అని బోడొల్ల నరసమ్మ అనే వృద్ధురాలు ప్రశ్నించింది. దీంతో వార్డు మెంబర్ భర్త ఆవేశంతో రెచ్చిపోయాడు. వృద్ధురాలు అనే కనికరం కూడా లేకుండా ఇనుపరాడ్‌తో తల పగులగొట్టాడు.


పార్టీకి చెడ్డపేరు వస్తున్నా..

ఇలా చెప్పుకొంటూ పోతే కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకుల దాష్టీకాలు అన్నీఇన్నీ కావు. ఎమ్మెల్యేల అనుచరుల అరాచకాల వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతున్నా.. వారు డోంట్ కేర్ అంటున్నారు. ఇదంతా ఎమ్మెల్యేలకు తెలిసి జరుగుతుందో.. లేక తెలియక జరుగుతుందో తెలీదు కానీ.. మొత్తానికి అధికార పార్టీ నాయకుల ఆగడాలను చూసి జనం విసుగు చెందుతున్నారు.

Updated Date - 2021-09-17T15:19:44+05:30 IST