Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్‌ను.. వెంటాడుతున్న అనర్హత కేసు!

గిరి గెలుపు అక్రమమని రెండేళ్ల క్రితం ఏసురత్నం హైకోర్టులో కేసు

వాదనల దశకు చేరిన వ్యాజ్యం

ఇద్దరి మధ్య పెద్దల రాజీ యత్నాలు విఫలం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ తరఫునగెలిచి వైసీపీలోకి మారిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్‌కు ఏమాత్రం ఊరట లభించడం లేదు. అదే పార్టీకి చెందిన చంద్రగిరి ఏసురత్నం దాఖలు చేసిన హైకోర్టు కేసు విషయంలో ఏమవుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది. ఎన్నికల్లో గిరిధర్‌ గెలుపు అసంబద్ధమని రెండేళ్ల క్రితం ఏసుతర్నం హైకోర్టులో దాఖలు చేసిన కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకొంది. ఎన్నికల సంఘానికి గిరిధర్‌ తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారని తాను చేసిన ఫిర్యాదు నుంచి ఏసురత్నం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. హైకోర్టు కేసులో తాను గెలుపొందితే అది వడ్డెర సామాజికవర్గం విజయంగా ఆయన బుధవారం పాత్రికేయుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వాదనలు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో వైసీపీలో చిచ్చు రగులుకొంటోంది. 


2019 సార్వత్రిక ఎన్నికల్లో గిరిధర్‌ గెలుపొందారు. అయితే ఎన్నికల సంఘానికి గిరిధర్‌ నివేదించిన అఫిడవిట్లు, ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన దానికి మధ్యన చాలా వ్యత్యాసం ఉందదని, అప్పులు, ఆస్తులు దాచి పెట్టారని గిరిధర్‌పై ఏసురత్నం హైకోర్టులో కేసు వేశారు. కాగా గిరిధర్‌ 2020 ప్రారంభంలోనే సీఎం జగన్‌ వద్దకు వెళ్లి వైసీపీ కండువా వేసుకొన్నారు. కాగా వైసీపీలో గిరిధర్‌, ఏసురత్నం మధ్యన విభేదాలు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ ఇరువర్గాల మధ్యన మాటల యుద్ధం జరిగిన సందర్భాలు ఉన్నాయి. గిరిధర్‌కి వైసీపీలో కొంతమంది నాయకులు అండగా ఉంటే ఏసురత్నంకి కొందరు బాసటగా ఉన్నారు.


కాగా నగరపాలకసంస్థ స్టాండింగ్‌ కమిటీ, కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక విషయంలోనూ వీరి అభిప్రాయానికి పెద్దగా విలువ ఇవ్వలేదన్న గుసగుసలు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్యన అధిష్టానం చేసిన రాజీ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఇందుకు హైకోర్టు కేసు ఊతమిస్తోంది. తాజాగా ఈ కేసులో గెలిస్తే అది వడ్డెర సామాజికవర్గం గెలుపు అవుతుందని ఏసురత్నం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గిరిధర్‌కి ఏమాత్రం ఊరట లభించలేదు. అదే టీడీపీలో కొనసాగి ఉంటే ఆయనకు అండగా పార్టీ నిలిచేదన్న అభిప్రాయం రాజకీయవర్గాలు వ్యక్తపరుస్తున్నాయి. 

Advertisement
Advertisement