కరోనా కాలంలో.... అడవుల్లో..

ABN , First Publish Date - 2020-07-13T18:34:34+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తుండగా అధికార అనధికారులు హడలిపోతూ నివాస గృహాలకే పరిమితమవుతుండగా ఆదివారం ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ ఇల్లెందు మండలం మామిడిగుండాల అటవీ

కరోనా కాలంలో.... అడవుల్లో..

ఆదివాసీ గిరిజనులకు భరోసానిచ్చిన ఎమ్మెల్యే హరిప్రియ


ఇల్లెందు (ఖమ్మం): కరోనా వైరస్‌ విజృంభిస్తుండగా అధికార అనధికారులు హడలిపోతూ నివాస గృహాలకే పరిమితమవుతుండగా ఆదివారం ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ ఇల్లెందు మండలం మామిడిగుండాల అటవీ ప్రాంతంలో వివాదాస్పదంగా మారిన సీలింగ్‌ భూములను స్వయంగా పరిశీలించి ఆదివాసీ గిరిజనులకు భరోసానిచ్చారు. గత నాలుగు దశాబ్దాలుగా మామిడిగుండాల అటవీ ప్రాంతాల భూముల్లో లెటరైట్‌ ఖనిజ నిక్షేపాలు వెలుగు చూడటంతో సీలింగ్‌ వారసులుగా పలువురు తమకు పట్టాలు ఉన్నాయంటూ ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న భూములను స్వాదీనం చేసుకోడానికి యత్నించడం, ఘర్షణలు జరగడం విధితమే. ఈ నేపథ్యంలో ఖనిజ భూములపై బడా కన్ను శీర్షికన ఆంద్రజ్యోతిలో ప్రత్యేక కథనాలు వెలువడటంతో భూస్వాములు కొంత మేర వెనకడుగు వేశారు. కాగా ఆదివాసీ గిరిజనులు నాలుగు దశాబ్దాలుగా నిత్యం భూమి కోసం సాగిస్తున్న పోరు, ఆంద్రజ్యోతి కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే హరిప్రియ మామిడిగుండాల సీలింగ్‌ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న నిర్ణయానికి రావడం గమనార్హం. 


ఈ మేరకు సీలింగ్‌ భూముల సమస్యలు ఎదుర్కొంటున్న మామిడిగుండాల, మేడికుంట, సువర్ణపురం, రాజ్యాతండా, బొటిగుంపు తదితర గ్రామాల గిరిజన రైతులను, వారు సాగు చేస్తున్న భూములను ఆదివారం అటవీ ప్రాంతాల్లో స్వయంగా సందర్శించి పరిశీలించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను ఆడిగితెలుసుకున్నారు. అక్కడి నుండే జిల్లా అదికార యంత్రాంగాలతో సమస్య తీవ్రతను వివరించారు. భూ వివాదాల పరిష్కారానికి అధికారులు ఆదివాసీ గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల్లో సర్వేలు నిర్వహించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేక పోవడం, పట్టాలు ఉన్నవారికి సరిహద్దులు లేకపోవడంతో ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొనడంతో సీలింగ్‌ వారసులుగా పట్టాలు కలిగివున్న భూస్వాములతో గిరిజనులు తీవ్ర స్థాయిలో ఘర్షణలకు పాల్పడుతున్న పరిణామాల మూలంగా శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో గిరిజన గ్రామాలకు చెందిన ఆదివాసీ నాయకులు ఎమ్మెల్యే హరిప్రియకు తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడంతో సీలింగ్‌ భూముల వివాదాల పరిష్కారానికి ఎమ్మెల్యే హరిప్రియ స్వయంగా భూములు పరిశీలించి గిరిజన రైతులతో సమస్యలు చర్చించడం మూలంగా దశాబ్దాల నాటి వివాదాల పరిష్కారానికి తొలి అడుగు పడినట్లయింది.

Updated Date - 2020-07-13T18:34:34+05:30 IST