సంగారెడ్డి డంపింగ్‌ యార్డు కోసం 5 ఎకరాలు కొనాలి

ABN , First Publish Date - 2020-09-16T09:33:15+05:30 IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డంపింగ్‌ యార్డు ఇంతవరకు లేదని, నాలుగేండ్ల నుంచి ప్రజలు ఇబ్బందులు ..

సంగారెడ్డి డంపింగ్‌ యార్డు కోసం 5 ఎకరాలు కొనాలి

ప్రభుత్వ, అసైన్డ్‌ భూమి అందుబాటులో లేదు

8అసెంబ్లీ జీరో అవర్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి


హైదరాబాద్‌/సంగారెడ్డి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డంపింగ్‌ యార్డు ఇంతవరకు లేదని, నాలుగేండ్ల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే  తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) అసెంబ్లీలో ప్రస్తావించారు. మంగళవారం ఉదయం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కలిసి ప్రభుత్వ భూమికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రభుత్వ భూమికానీ, అసైన్డ్‌ భూమి కానీ దొరకటంలేదని ఆయన తెలిపారు. అధికారులు ప్రయత్నం చేస్తున్నా.. పట్టణ శివారుల్లో ఎస్టీ కాలనీలు, లంబాడా తండాలు ఉండటంతో, వారు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. అందుకే 5 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వం కొనుగోలుచేసి డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. సంగారెడ్డిలో డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


కాగా, సంగారెడ్డిలో డంపుయార్డు నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం రూ.1.20 కోట్లు విడుదల అయినప్పటికీ స్థల సేకరణ యంత్రాంగానికి సవాలుగా మారింది.  సంగారెడ్డి సమీపంలోని గ్రామాల శివార్లలో ప్రభుత్వ స్థలం గుర్తించినప్పటికీ, స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో డంపుయార్డు నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌ శివారులోని 25 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏడాది క్రితం గుర్తించినప్పటికీ.. ఫలితం లేకుండాపోయింది. డంప్‌యార్డు కోసం ఎలాగైనా ఈ స్థలాన్ని సేకరింంచాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించి నెలలు గడుస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు.

Updated Date - 2020-09-16T09:33:15+05:30 IST