Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ ఇద్దరు నేతల మధ్య విబేధాలు..క్లాస్ పీకిన జగన్

ఎంపీపీ పదవులు ఆ ఇద్దరు నేతల మధ్య విభేధాలను మరింతగా పెంచాయా? ఆ నియోజకవర్గంలోని పంచాయితీ హైకమాండ్ దగ్గరకు ఎందుకు చేరింది..? సీఎం పీకిన క్లాస్ తో అయినా ఆ నేతలు సెట్ అవుతారా.. లేక తమ స్టైల్ లో గ్రూప్ పాలిటిక్స్ ను కొనసాగిస్తారా? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం. 


ఒకరు ఎమ్మెల్యే. మరోకరు మాజీ ఎమ్మెల్యే

వాళ్లిద్దరూ అధికార పార్టీ నేతలు. ఒకరు ఎమ్మెల్యే. మరోకరు మాజీ ఎమ్మెల్యే. అయితే నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారట. తమ వర్గం నేతల్ని ఎంపీపీలుగా చేసేందుకు వీరిద్దరు బహిరంగంగా పోటీ పడుతున్నారట. ఎంపీపీ ఎన్నికలు సమీపించడంతో తమ వర్గాని చెందిన నేతలకు పదవులు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యిందట. దీంతో ఇద్దరు నేతల్ని పిలిచి సీఎం జగన్ క్లాస్ పీకి పంపారని తెలుస్తోంది. 

జిల్లాలో హాట్ టాపిక్‌గా.. అధికార పార్టీ నేతల పాలిటిక్స్

ప్రకాశం జిల్లా దర్శిలో అధికార పార్టీ నేతల పాలిటిక్స్ జిల్లాలో హాట్ టాపిక్  గా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో తమ అనుచరులకు ఎంపీపీ పదవులను కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు అధికార పార్టీ ముఖ్య నేతలకు కాస్త తలనొప్పిగా మారాయి. 2019 ఎన్నికల సమయంలో దర్శి నియోజక వర్గంలో సిట్టింగ్ స్థానం నుంచి బూచేపల్లి తప్పుకున్నారు. అదే సమయంలో మద్దిశెట్టి వేణుగోపాల్ కి పార్టీ అధిష్టానం దర్శి టిక్కెట్  కేటాయించింది. ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు  కలిసికట్టుగా పని చేశారు. అయితే ఎన్నికల అనంతరం మద్దిశెట్టి, బూచేపల్లి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అప్పటి నుండి నేతలు ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. 

ఎంపీపీ పదవుల కోసం పోటాపోటీగా

దర్శి నియోజక వర్గంలో పట్టు పెంచుకునేందుకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రయత్నిస్తుండగా.. తనకున్న బలం చేజారి పోకుండా చూసుకునేందుకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ట్రై చేస్తున్నారు. అదే సమయంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు  నేతలు ఎవరికి వారు తమ అనుచరుల్ని ఎన్నికల బరిలో నిలిపారు. విపక్షం లేకుండా ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో కొన్ని మండలాల్లో మద్దిశెట్టి అనుచరులు, మరికొన్ని మండలాల్లో బూచేపల్లి అనుచరులు గెలుపొందారు. ఇంకొన్ని మండలాల్లో ఇరు వర్గాలకు చెందిన వారు గెలుపొందారు. దీంతో తమ వర్గానికి చెందిన వారికి ఎంపీపీ పదవులు కట్టబెట్టాలని ఈ ఇరువురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 


ఎంపీపీలను ఎన్నుకోవాల్సి సమయం దగ్గరపడటంతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. ఎవరికి వారు తమ వర్గానికి చెందిన వారిని ఎంపీపీలుగా గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు పోటీపడి తమ అనుచరులకు పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నించడంతో.. వైసీపీ ముఖ్య నాయకులకు తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు జిల్లా మంత్రి బాలినేని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో దర్శి పంచాయితీ  రాజధానికి చేరింది. 

ఇద్దరికీ క్లాస్ పీకిన సీఎం జగన్

ప్రకాశం జిల్లా పార్టీ పరిశీలకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదుట.. మద్దిశెట్టి, బూచేపల్లి తమ అనుచరులతో మోహరించారు. సాయంత్రానికి ఇద్దరు నేతల్ని పిలిపించుకున్న  సీఎం జగన్ ఇద్దరికీ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎవరికి వారు గ్రూపులు కట్టి.. బజారుకెక్కితే పార్టీ పరువు పోవడంతో పాటు.. పార్టీకి నష్టం కలుగుతుందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ఎంపీపీలుగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన వారికి ఇద్దరు నేతలు మద్దతు తెలపాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఇద్దరు  నేతలు పని చేస్తారా.. లేక గ్రూపులు రాజకీయాలను కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.

Advertisement
Advertisement