వెయ్యికోట్ల అభివృద్ధి ఎక్కడ?

ABN , First Publish Date - 2022-01-20T16:43:14+05:30 IST

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో మూడేళ్లలో వెయ్యి కోట్లతో పలు అభివృద్ది పనులు చేశామని చేబుతున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అభివృద్ధి పనులపై ప్రభుత్వంద్వారా..

వెయ్యికోట్ల అభివృద్ధి ఎక్కడ?

ఎమ్మెల్యే గోపాల్‌ శ్వేతపత్రం విడుదల చేయించాలి: బీజేపీ కార్పొరేటర్లు

ముషీరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌ నియోజకవర్గంలో మూడేళ్లలో వెయ్యి కోట్లతో పలు అభివృద్ది పనులు చేశామని చేబుతున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అభివృద్ధి పనులపై ప్రభుత్వంద్వారా శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. బుధవారం అడిక్‌మెట్‌లోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు సునీతాప్రకా్‌షగౌడ్‌, సుప్రియానవీన్‌గౌడ్‌, పావని వినయ్‌కుమార్‌, జి. రచనశ్రీ మాట్లాడారు. 


వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే ప్రజలు ఇంకా ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకూ కేటాయించని నిధులు ముఠా గోపాల్‌కు ఎలా వచ్చాయనీ.. వాటిని ఎక్కడ అభివృద్ధి పనులు చేశారో వెల్లడించాలని వారు డిమాండ్‌ చేశారు. స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం, నాలా రిటర్నింగ్‌ వాల్‌ నిధులు జీహెచ్‌ఎంసీకి సంబంధించిన నిఽఽధులని, వాటిని కూడా ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకుని చెప్పడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. అంబేడ్కర్‌నగర్‌ లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనులు కూడా నేటికీ అసంపూర్తిగా ఉన్నాయన్నారు. గత సంవత్సరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పనులు నేటికీ పూర్తి కాలేదని, మరి ఆయన ఎక్కడ అభివృద్ధి పూర్తి చేశారో వెల్లడించాలని వారు డిమాండ్‌ చేశారు. హుస్సేన్‌సాగర్‌ నాలా పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజల ఇళ్లకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకున్నామని సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నాయకులు గత రెండు రోజుల నుంచి అధికారులు నాలా పరివాహక ప్రాంతాల ప్రజలకు నోటీసులు జారీ చేస్తున్నారని, బాధితులకు ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నాయకులు సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-01-20T16:43:14+05:30 IST