లోకేష్‌పై పాత గుంటూరు పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే నాగార్జున ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-08-18T01:48:59+05:30 IST

టీడీపీ నేత నారా లోకేష్‌పై పాత గుంటూరు స్టేషన్‌లో వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మంగళవారం ఫిర్యాదు చేశారు.

లోకేష్‌పై పాత గుంటూరు పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే నాగార్జున ఫిర్యాదు

గుంటూరు: టీడీపీ నేత నారా లోకేష్‌పై పాత గుంటూరు పోలీసుస్టేషన్‌లో వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రెండు రోజుల క్రితం దళిత విద్యార్థి రమ్య హత్య జరిగిందని సీఎం జగన్మో‌హన్‌రెడ్డి వెంటనే స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పారన్నారు. రమ్య మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేయించి ఆ కుటుంబానికి చెక్ కూడా అందించామని తెలిపారు. 


రమ్య మృతదేహాన్ని తీసుకెళ్తుంటే టీడీపీ జెండాలతో వచ్చి లోకేష్ వచ్చే వరకూ ఉంచాలని ఆ పార్టీ నాయకులు సభ్య సమాజం తల దించుకునేలా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇంటి దగ్గర గంటసేపు టీడీపీ నేతలు హడావుడి చేశారన్నారు. వాళ్ల ఇంటికి వెళ్తుంటే తనను చూసి వైసీపీ రౌడీల్లారా అంటూ భయపెట్టే విధంగా లోకేష్ హెచ్చరించారన్నారు. దళిత ఎమ్మెల్యేని పట్టుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర మనోవ్యధకు గురి చేశాయన్నారు. చంద్రబాబు కూడా ఇదే విధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.నిన్నటి నుంచి ఆయన వ్యాఖ్యలను జీర్ణించుకులేకపోయానని చెప్పారు.లోకేష్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.తనకు జరిగిన అవమానం దళితులకు జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే నాగార్జున తెలిపారు. 

Updated Date - 2021-08-18T01:48:59+05:30 IST