నీపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు..?

ABN , First Publish Date - 2021-01-20T05:15:28+05:30 IST

నీ మీద దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.

నీపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు..?
టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతున్న కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి

ప్రసన్నకుమార్‌రెడ్డికి పోలంరెడ్డి సూటి ప్రశ్న


బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 19: నీ మీద దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. మంగళవారం ఆయన బుచ్చిరెడ్డిపాళెంలోని టీడీపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎంవీ. శేషయ్య అధ్యక్షతన ఆ పార్టీ నాయకులతో పోలంరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సోమవారం కోవూరు ఎమ్మెల్యే  ప్రసన్నకుమార్‌రెడ్డి జిల్లా ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బీహారీ వాసులు భారతీయులు కాదా అని ప్రశ్నించారు. దేశంలో ప్రతి ఒక్క ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ముందు భారతీయులే. ఆ తర్వాతే రాష్ట్ర వాసులుగా తెలుసుకోవాలని ఆయన ఎమ్మెల్యేనుద్దేశించి అన్నారు. రాజకీయ లబ్ధికోసం జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ను నీ అంతు చూస్తాను.. నేను తలచుకుంటే ఏమైనా చేస్తా, నాతో పెట్టుకోవద్దని అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని పూర్తిగా మాఫియాకు అడ్డాగా మార్చారన్నారు. ఓ వైపు ఇసుక, మరోవైపు గ్రావెల్‌, మద్యం, పేకాట మాఫియాలకు అడ్డాగా చేశారన్నారు. పర్యాటక కేంద్రమైన పెనుబల్లి తిప్ప నుంచి ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ అమ్ముకుంటున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మాఫియాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన జిల్లా ఎస్పీపై అసభ్యకరంగా మాట్లాడడంపై ఆ పార్టీలో వాళ్లు కూడా హర్షించరన్నారు. దీనిపై సీఎం,  పోలీసు సంఘాలు కూడా ఖండించాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో  టీడీపీ నాయకులు దేవళ్ల కమలాకర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంనాయుడు, చైతన్య, హరనాథ్‌, రామానాయుడు, దళిత నాయకులు విల్సిన్‌, ప్రసాద్‌, కోటి, వి.శ్రీనివాసులు, బాలాకుమార్‌, నాగరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

ఎమ్మెల్యే ప్రసన్న తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి

పొదలకూరు  : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి జిల్లా ఎస్పీపై చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం ఆందోళనకరమని, ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా తన మాటలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తాటిపర్తి, పొదలకూరు గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులతో బూత్‌ స్థాయిలో విస్తృత పర్యటన చేసి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి  ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. సర్వేపల్లి  నియోజకవర్గంలో అధికారులు  ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు.  కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు దేవరం విజయలక్ష్మి, నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, బుధవరపు పెంచలయ్య,  మాముడూరు రవీంద్ర, అంకిరెడ్డి,  దాసరి సురేంద్ర, ముక్కు రామయ్య,  రఘు, పర్చూరి ధనుంజయ, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T05:15:28+05:30 IST