Abn logo
Sep 5 2021 @ 03:15AM

సీబీఐ ముందుకు సీఎం వైఎస్ జగన్ మేనమామ

  • వివేకా హత్య కేసులో గంటసేపు విచారణ 
  • మరో ముగ్గురినీ విచారించిన అధికారులు 


కడప క్రైం, సెప్టెంబరు 4: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు శనివారం కమలాపురం ఎమ్మెల్యే, సీఎం జగన్‌ మేనమామ రవీంద్రనాథరెడ్డిని విచారించారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సాయంత్రం ఆయన్ను గంట పాటు విచారించినట్లు తెలుస్తోంది. అలాగే పులివెందులకు చెందిన వెంకటరమణ అనే వృద్ధుడిని విచారించారు. పులివెందులలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌‌లో చెప్పుల దుకాణం యజమాని మున్నా, ఆయన సతీమణి రజియాను కూడా  విచారించినట్లు తెలుస్తోంది.

 త్వరగా తేల్చమన్నాం: ఎమ్మెల్యే 

సీబీఐ విచారణ అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అక్కడున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వివేకానందరెడ్డితో సంబంధాల గురించి అడిగారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధా నం చెప్పానన్నారు. వివేకా బంధువును, రాజకీయ నాయకుడిని కాబట్టే విచారణకు పిలిచారన్నారు. వివేకా హత్యకేసును త్వరగా తేల్చాలని, ఇది తమకు నిజంగా అవమానకరంగా ఉందని సీబీఐ అధికారులను కోరామన్నారు. అయితే అందరినీ ప్రశ్నించడం ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందనే భావనతో విచారణకు పిలిపిస్తున్నారన్నారు. కేసు త్వరగా తేల్చడానికి ప్రయత్నిస్తామని అధికారులు చెప్పారన్నారు.