దేశంలో ఇంకా దొరలదే నడుస్తోంది.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-05-12T16:36:51+05:30 IST

‘దేశంలో మానుకోట మిర్చి నంబర్‌ వన్‌ అన్నారు... కానీ ఎవనికి వాడే రాజ్యం... దొరలదే ఇంకా నడుస్తోంది.. భారతదేశంలో మరి ఇది ఎన్ని రోజులు నడుస్తుందో నాకర్థం కావడంలేదు...

దేశంలో ఇంకా దొరలదే నడుస్తోంది.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

మహబూబాబాద్‌/వరంగల్ (ఆంధ్రజ్యోతి) : ‘దేశంలో మానుకోట మిర్చి నంబర్‌ వన్‌ అన్నారు... కానీ ఎవనికి వాడే రాజ్యం... దొరలదే ఇంకా నడుస్తోంది.. భారతదేశంలో మరి ఇది ఎన్ని రోజులు నడుస్తుందో నాకర్థం కావడంలేదు... ఏదన్నా మాట్లాడితే శంకర్‌నాయక్‌ ఇట్ల మాట్లాడింటరు... అన్నింటికీ ఆ దేవుడే ఉన్నడు’ అంటూ మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ వ్యాఖ్యానించారు. సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడిపండ్ల ప్రదర్శనను సోమవారం మహబూబాబాద్‌ గాంధీపార్క్‌ కమ్యూనిటీ హాల్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్‌ నాయక్‌ పలు వ్యాఖ్యలు చేశారు. 


‘ఇయ్యాల గుండు పిన్ను తయారు చేసేటోనికి.. వానికి గల్లా ఎగరేసి అమ్ముకుంటడు నా గుండుపిన్ను ఇంత అని, చెప్పులు తయారు చేసేటోడు గూడ నా చెప్పులకింత అని, దేనికైనా ఉంది భారత దేశంలో కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా వారు చేసుకునే హక్కు నిర్ణయించుకునే హక్కు... కానీ అన్నంపెట్టే రైతుకు మాత్రం ఆ భగవంతుడు ఎందుకని ఈ హక్కు ఇయ్యలేదో నాకర్థం కావడంలేదు. ఇప్పుడు  అన్నమో రామచంద్రా.. అని ఎక్కడ అమ్ముకోవాల్నో మా మ్యాంగో ఫార్మర్స్‌ వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎక్కడ అమ్ముకున్నామో అని చెప్పి మా రైతు సోదరులు పాపం అక్కడక్కడ కింద పడేస్తున్నారు. ఎందీ దౌర్భాగ్యం, ఇదెందుకో నాకర్థం కావడంలేదు. ఏదైనా ఇంకా రైతులు చాలా దెబ్బతింటూనే ఉన్నారు. ఇంకో దురదృష్టకరం, ఇప్పుడు ఇలా ఉంటే మానవులు ఇలా ఉంటే నేచర్‌... నేచర్‌ కూడా ఒక్కొక్కసారి భగవంతుడు.. ఎప్పుడు గాలిదుమారం వస్తుందో.. ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు ఏం కొట్టుకుపోతుందో కూడా అర్థం కానీ పరిస్థితి. మా మానుకోట ఇప్పుడు జైపాల్‌రెడ్డి గారు మహబూబాబాద్‌ డిస్ట్రిక్టే నెంబర్‌వన్‌గా ఉందన్నారు. నిజంగా మిర్చి ఫ్యాక్టరీ మన డైనమిక్‌ అండ్‌ డేరింగ్‌ గౌరవ పెద్దలు మన కేటీఆర్‌ గారు ఇక్కడ 200 ఎకరాలు తీసుకొని పెట్టడం జరిగింది అని విన్నాను. మన దేశంలో ఇక్కడే నెంబర్‌ వన్‌ మన మానుకోట అన్నారు... కానీ ఎవనికి వాడే రాజ్యం...దొరలు ఇంకా నడుస్తోంది భారతదేశంలో మరి ఇది ఎన్ని రోజులు నడుస్తుందో నాకర్థం కావడంలేదు... ఏదన్నా మాట్లాడితే శంకర్‌నాయక్‌ ఇట్ల మాట్లాడింటరు... అన్నింటికీ ఆ దేవుడే ఉన్నడు’ అన్నారు. గతంలో కేసముద్రంలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఇదే రీతిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘దొరలు’ అంటూ మళ్లీ సభావేదికపైనే మాట్లాడడం కలకలం రేపింది. అదే ఫ్లోలో చివరిగా తాను మాట్లాడితే ఎమ్మెల్యే ఏదో మాట్లాడడని అంటారని ముక్తాయించారు. ఈ సమయంలో వేదికపైనున్న వారు ముసిముసిగా నవ్వుకున్నారు. కొసమెరుపేమిటంటే.. సభలో వేదికపైనున్న మామిడి రైతుల్లో అధికంగా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారున్నారు.

Updated Date - 2020-05-12T16:36:51+05:30 IST