ఎమ్మెల్యే వర్సెస్‌ జడ్పీటీసీ

ABN , First Publish Date - 2022-01-26T05:04:22+05:30 IST

కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు, వైసీపీకే చెందిన హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణయాదవ్‌కు మధ్య నెలకొన్న వివాదం తారస్థాయికి చేరింది.

ఎమ్మెల్యే వర్సెస్‌ జడ్పీటీసీ
సంఘటనా స్థలం వద్ద జడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్‌

కనిగిరిలో కొనసాగుతున్న వివాదం

వెంచర్‌ విషయంలో జడ్పీటీసీని ఇరికించే ప్రయత్నం

కొలతలు వేసిన తహసీల్దార్‌

అక్కడికి చేరుకున్న దద్దాల, అనుచరులు

నోటీసులు ఇవ్వకపోవడంపై అభ్యంతరం

పోలీసుల రంగ ప్రవేశం 


కనిగిరి, జనవరి 25 : కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు, వైసీపీకే చెందిన హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణయాదవ్‌కు మధ్య నెలకొన్న వివాదం తారస్థాయికి చేరింది. ఇప్పటి వరకూ నడుస్తున్న కోల్డ్‌వార్‌ బహిరంగ వార్‌గా మారింది. ఎమ్మెల్యే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నారాయణ యాదవ్‌ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఆయన ఆర్థిక మూలాలను దెబ్బగొట్టే చర్యలు ప్రారంభమయ్యాయి. 12 ఏళ్ల క్రితం ఆయన కొనుగోలు చేసినట్లు చెప్తున్న స్థలంలో మంగళవారం తహసీల్దార్‌ పుల్లారావు కొలతలు వేయడం వివాదాస్పదమైంది. స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. 


కొనసాగుతున్న వివాదం

పామూరు రోడ్డులోని 517 సర్వే నెంబర్‌లో హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు  దద్దాల నారాయణ యాదవ్‌ 12 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు చెప్తున్న స్థలం విషయమై వివాదం నడుస్తోంది. అందులో మంగళవారం తహసీల్దార్‌ పుల్లారావు ఆధ్వర్యంలో కొలతలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న  జడ్పీటీసీ సభ్యుడు నారాయణ యాదవ్‌, అనుచరులు అక్కడికి వెళ్లారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కొలతలు చేపడతారని తహసీల్దార్‌ను నిలదీశాడు. తమకు దరఖాస్తు రావడంతో కొలతలు వేస్తున్నామని తహసీల్దార్‌ తెలిపారు. ఈ క్రమంలోనే తహసీల్దార్‌కు, జడ్పీటీసీకి కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో మూడు మండలాలకు చెందిన 15 మంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జడ్పీటీసీతోపాటు అక్కడ ఉన్న వారందరినీ పంపించేశారు. 


ఎమ్మెల్యేపై జడ్పీటీసీ ఆరోపణలు

తన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకే ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడని జడ్పీటీసీ నారాయణయాదవ్‌ విమర్శించారు. తనవద్ద రూ.60 లక్షల తీసుకొని ఆమొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ఈ కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. తనపై వైసీపీకి, ఆ పార్టీ కార్యకర్తలకు ఆపార విశ్వాసం ఉందన్నారు. ఆ  పార్టీ నుంచే జడ్పీటీసీగా ఎన్నికల్లో గెలిచానని,  తన బాబాయి మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌గా ఉన్నారన్నారు. ఇక ఎమ్మెల్యే విషయంలో తాను వెనకడుగు వేసేది లేదన్నారు. పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిని కలిసి ఎమ్మెల్యే కనిగిరిలో చేస్తున్న నిర్వాకాన్ని బయట పెడతానన్నాడు.


Updated Date - 2022-01-26T05:04:22+05:30 IST