జూబ్లిహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు.. : నిందితుడి తరఫున ఏకంగా MLAనే పోలీస్‌ స్టేషన్‌కు..!

ABN , First Publish Date - 2021-12-08T16:23:46+05:30 IST

జూబ్లిహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు.. : నిందితుడి తరఫున ఏకంగా MLAనే పోలీస్‌ స్టేషన్‌కు..!

జూబ్లిహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు.. : నిందితుడి తరఫున ఏకంగా MLAనే పోలీస్‌ స్టేషన్‌కు..!

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయగా, కానిస్టేబుల్‌, హోంగార్డ్‌ సమయస్ఫూర్తే పట్టించింది. ప్రమాదం తర్వాత నిందితులు కారు ఆపకుండా, రోడ్డు నంబరు 5లో రాంగ్‌రూట్‌లో ప్రయాణించారు. కారు ముందు భాగం ధ్వంసం అయి ఉండటంతో జూబ్లీహిల్స్‌ బ్లూ కోట్స్‌ కానిస్టేబుల్‌ సతీష్‌, హోంగార్డు జితేందర్‌ సింగ్‌కు అనుమానం వచ్చింది. వారు కారును వెంబడించారు. నిందితులు పద్మావతి అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కారు పార్క్‌ చేశారు. పోలీసులు కారు ఫొటోలు తీసుకుని వచ్చేశారు. తర్వాత ప్రమాదం విషయం తెలిసింది. వెంటనే ఆ ఫొటోలను జూబ్లీహిల్స్‌ నైట్‌ డ్యూటీలో ఉన్న డీఎస్‌ఐ హరీశ్వర్‌రెడ్డికి పంపించారు. 


ఆయన బంజారాహిల్స్‌ పోలీసులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన కారు, ఈ ఫొటోలు ఒకటే కావడంతో గంట తర్వాత హోం గార్డు జితేందర్‌సింగ్‌ అక్కడికి వెళ్లాడు. అప్పటికే నిందితులు బీఎండబ్ల్యూ కారులో అక్కడి నుంచి వెళ్లేందుకు బయలు దేరుతున్నారు. విషయాన్ని డీఎస్‌ఐ హరీశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చి నిందితులను అడ్డుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్న రోహిత్‌.. తాను ప్రమాదం చేయలేద ని, డ్రైవర్‌ నడిపాడని తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ, చివరకు విషయం బయటకు వచ్చింది. సమయస్పూర్తిగా వ్యవహరించిన సతీష్‌, జితేందర్‌సింగ్‌లను బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుదర్శన్‌ అభినందించారు.


కారులో మూడో వ్యక్తి..?

నిందితుడి తరఫున ఏకంగా ఓ ఎమ్మెల్యే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిసింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు సమాచారం. కారులో మూడో వ్యక్తి ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అతని కోసమే ఆ ఎమ్మెల్యే ఠాణాకు వచ్చాడని ఓ వాదన వినిపిస్తోంది. పోలీసులు మాత్రం ఇద్దరే ఉన్నారని చెబుతున్నారు. 

Updated Date - 2021-12-08T16:23:46+05:30 IST