Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

నియమావళిని తప్పనిసరిగా అనుసరించాలి

ఎన్నికల అధికారి, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌


మెదక్‌ రూరల్‌, డిసెంబరు 2: స్థానికసంస్థల శాసనమండలి మెదక్‌ నియోజకవర్గ ఎన్నిక ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా వ్యవహరించాలని ఎన్నికల అధికారి, మెదక్‌ జిల్లా కలెక్టర్‌  హరీశ్‌ పేర్కొన్నారు. మెదక్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం ఆయన జోనల్‌ అధికారులు, ప్రిసైడింగ్‌ అధికారుల శిక్షణలో మాట్లాడారు. నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, నిబంధనల మేరకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉంటారని, ఎక్కువ సంఖ్యలో అక్షరాస్యులు, నిబంధనలు తెలిసినవారే ఉంటారని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడులకు  గురికాకుండా పకడ్బందీగా విధులు నిర్వహించవచ్చన్నారు. 


ఉమ్మడి జిల్లాలో 1,026 మంది ఓటర్లు

ఎమ్మెల్సీ ఎన్నికలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,026 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్‌ తెలిపారు. మెదక్‌ జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 2 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఒక్కో పోలింగ్‌  కేంద్రానికి ఒక జోనల్‌ అధికారి, మైక్రో పరిశీలకుడు, నలుగురు పోలింగ్‌ అధికారుల చొప్పున నియమించినట్టు తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వివరించారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నిక జరుగుతుందని, చేతివేలికి సిరా పెట్టిన అనంతరం బ్యాలెట్‌ పేపర్‌ కౌంటర్‌ ఫైల్‌పై ఓటరు  సంతకం తీసుకోవాలని సూచించారు. ఓటరు తమ ఓటును పాధ్రాన్యతా క్రమంలో అంకెల రూపంలో వయోలెట్‌ కలర్‌ పెన్‌తో వేయాల్సి ఉంటుందని, ఓటు వేసిన అనంతరం బ్యాలెట్‌ పేపర్‌ను మడిచి బాక్సులో వేసేలా చూడాలని పోలింగ్‌ అధికారులకు సూచించారు. ఓటింగ్‌ రహస్యంగా జరిగేవిధంగా కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్‌బూత్‌ బయట అభ్యర్థుల జాబితా, ఓటర్ల వివరాలు, పోలింగ్‌ కేంద్రం సంఖ్య, లోపలికి, వెలుపలికి దారి, అభ్యర్థుల ఏజెంట్లు తతదితర వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఓటరు కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్లే వరకు పోలింగ్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నెల 9న రిసెప్షన్‌ కౌంటర్‌ నుంచి మెటీరియల్‌ను తీసుకుని, ప్రత్యేక వాహనంలో విధులు కేటాయించిన చోటికి వెళ్లాలని చేరుకోవాలని నిర్దేశించారు. పోలింగ్‌ విధులు నిర్వహించిన అనంతరం అనంతరం అదే వాహనంలో నేరుగా రిసెప్షన్‌ కౌంటర్‌కు చేరుకుని బ్యాలట్‌బాక్సులు, పోలింగ్‌ అధికారి డైరీ, నివేదికలు, మెటీరియల్‌ అప్పగించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. ఈ నెల 8న మరోసారి శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సమావేశ ంలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్‌ ప్రతిమసింగ్‌, ఎన్నికల సహాయ అధికారి రమేష్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీపీవో తరుణ్‌కుమార్‌, జిల్లా స్వీప్‌నోడల్‌ అధికారి రాజీరెడ్డి, కలెక్టరేట్‌ ఏవో యూసుఫ్‌, జోనల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement