‘గొంతు చించుకుని అరిస్తే ఎవరూ భయపడరు..’

ABN , First Publish Date - 2020-06-02T14:42:55+05:30 IST

ఇక్కడ మీరు గొంతు చించుకుని మాట్లాడితే భయపడేవారెవరూ లేరు..

‘గొంతు చించుకుని అరిస్తే ఎవరూ భయపడరు..’

అవధులు దాటొద్దు

ఎమ్మెల్సీ నాగజగదీశ్‌పై విజయసాయిరెడ్డి ఆగ్రహం!


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ఇక్కడ మీరు గొంతు చించుకుని మాట్లాడితే భయపడేవారెవరూ లేరు.. చెప్పాల్సింది ప్రజాస్వామ్య విధానంలోనే చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావును ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఇష్టానుసారంగా మాట్లాడొద్దు... ఇదేమీ కౌన్సిల్‌ కాదు... అవధులు దాటొద్దు అంటూ మరింత ఘాటుగా స్పందించడం కలకలం రేపింది. సోమవారం విశాఖ వుడా చిల్డ్రన్స్‌ ఎరీనాలో ఇళ్ల స్థలాలు, తాగునీటిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు మాట్లాడుతూ నగరంలో హుద్‌హుద్‌ బాధితులకు నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని కోరారు. ఆ వెంటనే ఎమ్మెల్సీ నాగజగదీశ్‌ మాట్లాడుతూ అనకాపల్లిలో ఏడాదిన్నర కిందట హుద్‌హుద్‌ ఇళ్లను అర్హులకు కేటాయించినా ఇంతవరకు అప్పగించలేదన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కన్నబాబు జీవీఎంసీ పరిధిలో 43,843 మంది దరఖాస్తుచేస్తే 7,148 మంది అర్హులుగా తేలారని, మిగిలినవారంతా అనర్హులన్నారు. 


ఈ దశలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎలమంచిలిలో నిర్మించిన ఇళ్లలో 280 ఇళ్లు అనర్హులకు ఇచ్చారని వ్యాఖ్యానించారు. దీనిపై నాగజగదీశ్‌ అభ్యంతరం వ్యక్తంచేస్తూ, ఎక్కడ ఏమి జరిగిందో తనకు తెలియదని, అనకాపల్లిలో గతంలో ఎంపికచేసిన వారంతా పేదవర్గాలకు చెందినవారని కొంచెం స్వరం పెంచి చెప్పారు. దీంతో విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని ‘గొంతు చించుకుని అరిస్తే ఎవరూ భయపడరు.. చెప్పాల్సింది... సూటిగా ప్రజాస్వామ్య విధానంలో చెప్పాలి... అంతే తప్ప అవధులు దాటొద్దు’ అని హెచ్చరించారు. అయునా నాగజగదీష్‌ తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. 

Updated Date - 2020-06-02T14:42:55+05:30 IST