ఆ రూ.51 కోట్లు ఏమయ్యాయి..?

ABN , First Publish Date - 2021-05-05T17:58:46+05:30 IST

ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధుల నిర్వహణలో భారీ అవకతవకలు జరుగుతున్నాయి

ఆ రూ.51 కోట్లు ఏమయ్యాయి..?

ఎంఎన్‌జే ఆస్పత్రి ఆరోగ్యశ్రీ నిధుల్లో భారీ అక్రమాలు.. చూపని లెక్కలు

హైదరాబాద్‌ సిటీ: ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధుల నిర్వహణలో భారీ అవకతవకలు జరుగుతున్నాయి. 2014-18 మధ్య ఐదేళ్ల కాలంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.92కోట్లు విడుదల కాగా, ఎంఎన్‌జే ఆస్పత్రి యజమాన్యం రూ.41కోట్లు మాత్రమే వచ్చినట్లు సమాచార హక్కు చట్టం కింద తెలిపారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ప్రకటించిన నిధుల కంటే రూ.51కోట్లు తక్కువగా ఎంఎన్‌జే యాజమాన్యం చూపించింది.  ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన నిధుల్లో రూ.41కోట్లలో రూ.27కోట్లు ఖర్చయ్యాయని చెబుతున్న యాజమాన్యం మిగతా రూ.14కోట్లు దేనికి ఖర్చు చేశారో తెలుపడం లేదు. రోగుల కోసం కొనుగోలు చేసిన మందుల విలువనుకూడా అకస్మాత్తుగా పెంచేశారు. 2017-18లో రూ.కోటి ఖర్చయితే.. 2018-19లో రూ.3.2కోట్లు ఖర్చయినట్లు చూపించారు. ఏడాదిలో ఏకంగా మూడు రెట్లు పెంచడం విస్మయానికి గురిచేస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన నిధులను ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ఖర్చుచేస్తే..  రాష్ట్ర బడ్జెట్‌ ద్వారా ఏటా వచ్చే నిధులు కూడా ఖర్చు చేసినట్లు చూపుతున్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో పేద రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచిత వైద్యం అందించాలి. కానీ... ఎంఎన్‌జే యాజమాన్యం పేద రోగుల నుంచి రూ.300ల నుంచి రూ.3వేల వరకు యూజర్‌ చార్జీలను వసూళ్లు చేస్తోంది. యూజర్‌ చార్జీల వసూళ్లపై లెక్కా, పత్రం కూడా లేదు. 


ఏసీబీ విచారణ జరపాలి : సీపీఎం 

ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో జరుగుతున్న నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ విచారణ జరపాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ముషీరాబాద్‌ గోల్కొండ చౌరస్తాలోని సీపీఎం నగర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పలు విషయాలను సేకరించినట్లు తెలిపారు. ఆ వివరాలను, ఎంఎన్‌జే ఆస్పత్రిలోని అక్రమాలను ఈ సందర్భంగా ఆయన బయటపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ రోగుల నుంచి యూజర్‌ చార్జీలు వసూళ్లు చేస్తూ పేదలను దోచుకుంటున్నారని, మూడేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. యూజర్‌ చార్జీల వసూళ్లకు సంబంధించి డైరెక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ప్రకటించిన నిధుల కంటే తక్కువగా చూపించిన రూ.51కోట్ల లెక్కలను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.దశరథ్‌, కమిటీ సభ్యులు సి.మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-05T17:58:46+05:30 IST