బస్సులో మాజీ సైనికుడి ఫోన్ చోరీ.. పోతే పోయిందిలే అనుకున్నాడు కానీ.. అసలేం జరిగిందో ఆలస్యంగా తెలిసి..

ABN , First Publish Date - 2022-01-25T22:00:07+05:30 IST

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పనిచేసి రిటైర్ అయిన సైనికుడు బస్సు ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు.

బస్సులో మాజీ సైనికుడి ఫోన్ చోరీ.. పోతే పోయిందిలే అనుకున్నాడు కానీ.. అసలేం జరిగిందో ఆలస్యంగా తెలిసి..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పనిచేసి రిటైర్ అయిన సైనికుడు బస్సు ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు.. పోతే పోయిందిలే.. కొత్త మొబైల్, సిమ్‌ కార్డు తీసుకుందామనుకున్నాడు.. రెండ్రోజుల తర్వాత పాత నెంబర్‌తో కొత్త సిమ్ తీసుకున్నాడు.. దానిని భార్య మొబైల్‌లో వేశాడు.. సిమ్ యాక్టివేట్ కాగానే వచ్చిన మెసేజ్‌లు చూసి షాకయ్యాడు.. తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.2.50 లక్షలు విత్ డ్రా అయినట్టు మెసేజ్ రావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. 


మాజీ సైనికుడు రామ్ సింగ్ షెకావత్ ఈ నెల 19న అజ్మీర్ వెళ్లేందుకు జైపూర్‌లో బస్ ఎక్కాడు. అజ్మీర్‌లో దిగిన తర్వాత తన ఫోన్ పోయినట్టు గుర్తించాడు. పాత మొబైలే కదా అని వదిలేశాడు. తర్వాతి రోజు జియో ఆఫీస్‌కు వెళ్లి పాత నెంబర్‌తో కొత్త సిమ్ తీసుకున్నాడు. ఆ కొత్త సిమ్ కార్డును భార్య మొబైల్‌లో వేశాడు. సిమ్ యాక్టివేట్ కాగానే బ్యాంక్ ఖాతా నుంచి రూ.2.50 లక్షలు విత్ డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. 


మొబైల్‌లో ఉన్న నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, గూగుల్ పే యాప్‌లను ఉపయోగించి నిందితుడు డబ్బులు కొట్టేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఫోన్‌లో ఏటీఎమ్ కార్డు డిటైల్స్, పిన్ నెంబర్ సేవ్ చేసి ఉండడం కూడా నిందితుడికి కలిసి వచ్చింది. వాటిన్నింటినీ ఉపయోగించి అతను రెండ్రోజుల్లో ఏకంగా రూ.2.50 లక్షల రూపాయలు విత్ డ్రా చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2022-01-25T22:00:07+05:30 IST