మొబైల్‌ టాయిలెట్స్‌ బస్‌.. అదుర్స్‌

ABN , First Publish Date - 2021-06-18T04:23:33+05:30 IST

సిద్దిపేటకు షాపింగ్‌కు వచ్చేవారికి టాయిలెట్లను ఏర్పాటు చేయాలనుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిద్దిపేట మున్సిపల్‌ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో మొబైల్‌ బెంజ్‌ టాయిలెట్‌ బస్సును కొనుగోలు చేశారు. దీనిని త్వరలోనే మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.

మొబైల్‌ టాయిలెట్స్‌ బస్‌.. అదుర్స్‌
సిద్దిపేటకు చేరుకున్న మొబైల్‌ బెంజ్‌ టాయిలెట్‌ బస్సు

 మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలో రూ.20 లక్షలతో బెంజ్‌ బస్సుకు శ్రీకారం

 బస్సులో 4 టాయిలెట్లు, మదర్‌ఫీడ్‌, ప్యాంట్రీలు

 త్వరలోనే ప్రారంభించనున్న మంత్రి 


సిద్దిపేట టౌన్‌, జూన్‌ 17: జనసంచార ప్రాంతాల్లో టాయిలెట్‌కు వెళ్లాలంటే వసతులు లేక మహిళలు, పురుషులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా ఏదైనా పండుగలు వస్తే సిద్దిపేట పట్టణంలో షాపింగ్‌కు వేలాది సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. దీంతో టాయిలెట్లకు ఇబ్బందులు పడుతుండేవారు. కొన్ని చోట్ల సులభ్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసినా షాపింగ్‌ మాల్స్‌కు, కొన్ని దుకాణాలకు దూరంగా ఉంటాయి. దీంతో సిద్దిపేటకు షాపింగ్‌కు వచ్చేవారికి టాయిలెట్లను ఏర్పాటు చేయాలనుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిద్దిపేట మున్సిపల్‌ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో మొబైల్‌ బెంజ్‌ టాయిలెట్‌ బస్సును కొనుగోలు చేశారు. దీనిని త్వరలోనే మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే దీన్ని తిప్పుతారు. ఈ బస్సు ప్రారంభానికి ముందే ట్రయల్‌ రన్‌ను కూడా నిర్వహించారు.


మొబైల్‌ బస్సులో సౌకర్యాలు


మొబైల్‌ బస్సులో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా 4 టాయిలెట్లను ఏర్పాటు చేశారు. రెండు దారులు పురుషులకు, ఒకటి మహిళలకు ఉండగా, రెండు టాయిలెట్లు మహిళలకు, రెండు పురుషులకు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇండియన్‌, మరొకటి వెస్ట్రన్‌ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్యాడ్‌ చేంజింగ్‌ గది, ప్యాడ్‌ డిస్పోజల్‌కు, బిడ్డకు తల్లి పట్టడానికి, భోజనం చేసేందుకు చిన్న గది ఉన్నాయి. నాలుగు కుర్చీలతో వెయిటింగ్‌ గది, ఫేస్‌ వాష్‌ చేసుకునేందుకు వాష్‌ రూంను బస్సులో ఏర్పాటు చేశారు.



మొట్టమొదటగా సిద్దిపేటలోనే


రాష్ట్రంలోని పలు మున్సిపాటీల్లో ఇలాంటి మొబైల్‌ బస్సును ఏర్పాటు చేయాలని నిర్ణయించినా మంత్రి హరీశ్‌రావు చొరవతో మొట్టమొదటగా సిద్దిపేటలోనే శ్రీకారానికి నోచుకోనుంది. 


ఉచితంగానే అందుబాటులోకి


ఈ మొబైల్‌ బస్సు నిర్వహణ మొత్తం మున్సిపల్‌దే. బస్సు సిబ్బందితో పాటు వ్యయభారమంతా మున్సిపల్‌ భరించనుంది. ఈ బస్సు ఏర్పాటుకు టెండర్లను పిలిచి రూపొందించారు. ప్రస్తుతం ఈ బస్సులో టాయిలెట్లను వినియోగించేందుకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. 


 

Updated Date - 2021-06-18T04:23:33+05:30 IST