రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2021-06-18T09:57:33+05:30 IST

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురియగా, నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా నార్నూర్‌లో 40.5 మి.మీల వర్షపాతం కురవగా.. అత్యల్పంగా సిరికొండలో 20.5మి.మీల వర్షం పడింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. జైనూరు మండలంలోని చింతకర్రవాగులో 30 మంది రైతులు చిక్కుకోగా, వారి అరుపులు విన్న స్థానికులు తాడు సాయంతో రక్షించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు దుంకుతూ కనువిందు చేస్తున్నాయి. కాగా, శ్రీరామసాగర్‌లోకి 15360 క్యూసెక్కుల వరద చేరింది. ప్రస్తుత నీటిమట్టం 1065.40 అడుగుల మేర ఉంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు 656 క్యూసెక్కుల నీరు వచ్చింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం ఐదు రోజులుగా నిలకడగా ఉంది. గురువారం సాయంత్రానికి 532.80 అడుగులు (173.6640టీఎంసీలు) ఉంది. 


రెండు రోజులపాటు వానలు

రాష్ట్రంలో పలుచోట్ల మరో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షా లు అక్కడక్కడా కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ, నైరుతి, మధ్య తెలంగాణలో వర్షా లు పడతాయని తెలిపింది.

Updated Date - 2021-06-18T09:57:33+05:30 IST