నిరాడంబరంగా రంజాన్‌

ABN , First Publish Date - 2021-05-15T05:41:06+05:30 IST

కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతి, లాక్‌డౌన్‌ కారణంగా శుక్రవారం రంజాన్‌ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.

నిరాడంబరంగా రంజాన్‌
స్రార్థనలు చేస్తున్న ముస్లింలు

 కరోనా ఉధృతి కారణంగా బయటకు రాని జనం

 మసీదుల్లో ఐదుగురే హాజరు

 ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకున్న ముస్లింలు

కరీంనగర్‌ కల్చరల్‌, మే14: కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతి, లాక్‌డౌన్‌ కారణంగా శుక్రవారం రంజాన్‌ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. జనం బయట కనిపించక పోగా జిల్లా వ్యాప్తంగా ఏ ఈద్గాలోనూ ప్రార్థనలు జరుగలేదు. లాక్‌డౌన్‌ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు మసీద్‌లలో మౌజమ్‌, ఇమామ్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే ప్రార్థనలు చేశారు. దాదాపు అందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థనలు జరుపుకున్నారు. కరోనా వైరస్‌ నుంచి మానవాళిని త్వరగా బయట పడేయాలని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు పలువురు ముస్లింలు చెప్పారు. గత ఏడు, ఈ ఏడు మాదిరి రంజాన్‌ను తామెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. బంధువులు, మిత్రులకు, తమ ఇళ్ళ సమీపంలోని ఇరుగు పొరుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. కొందరు ఖబ్రాస్థాన్‌కు వెళ్లి గతించిన తమ పెద్దల సమాధుల వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. మంత్రి గంగుల కమలాకర్‌ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. మేయర్‌ క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ముస్లింలకు మేయర్‌ యాదగిరి సునీల్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.


పోలీసుల బందోబస్తు...


రంజాన్‌ సందర్భంగా సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అంతటా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మసీద్‌లు, ఖబ్రాస్థాన్‌ల వద్ద పోలీసులను నియమించారు. మాంసాహార షాపులు, మార్కెట్‌లు, షాపింగ్‌ మాల్‌లు, ఇతర దుకాణాల వద్ద రద్దీని నియంత్రించారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఉదయం 10 గంటల తర్వాత లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుపరిచారు. 

Updated Date - 2021-05-15T05:41:06+05:30 IST