వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి.. విదేశాలతో మోడెర్నా చర్చలు

ABN , First Publish Date - 2020-08-06T03:49:54+05:30 IST

కరోనా వ్యాక్సిన్ సరఫరా ఒప్పందాల కోసం అనేక దేశాలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్టు

వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి.. విదేశాలతో మోడెర్నా చర్చలు

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ సరఫరా ఒప్పందాల కోసం అనేక దేశాలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్టు అమెరికా బయోటెక్ సంస్థ మోడర్నా బుధవారం వెల్లడించింది. ఇప్పటికే సరఫరా ఒప్పందం కింద 400 మిలియన్ డాలర్లు(రూ. 2,994 కోట్లు) అందుకున్నట్టు పేర్కొంది. మరోపక్క కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి బాధ్యతాయుతమైన ధరల అవసరాన్ని కూడా తాము గుర్తించామని సంస్థ సీఈఓ స్టెఫనీ బాన్సెల్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ధర 32 డాలర్ల(రూ.2,395) నుంచి 37 డాలర్ల(రూ.2,769) మధ్య ఉంటుందని చెప్పారు. కాగా.. మోడర్నా సంస్థ, అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ ‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ తుది దశ ట్రయల్స్‌ను గత వారం భారీ ఎత్తున ప్రారంభించాయి. కోవె స్టడీ(కరోనావైరస్‌ ఎఫికసీ స్టడీ)’ పేరుతో అమెరికాలోని 70కి పైగా ప్రాంతాల్లో 30వేల మంది వలంటీర్లపై ఈ ట్రయల్స్ జరిగాయి. కరోనా వ్యాక్సిన్లకు ప్రపంచంలో ఇదే అతి పెద్ద ట్రయల్‌. ఇది బ్లైండ్‌ తరహా ట్రయల్‌. అంటే 30 వేల మందిలో కొందరికి నిజంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌(ఎంఆర్‌ఎన్‌ఏ-1273) ఇస్తారు. మరికొందరికి ప్లసీబో (సెలైన్‌ ద్రావణం లేదా సురక్షితమైన మరోవ్యాక్సిన్‌) ఇస్తారు. తమకు ఇచ్చిన వ్యాక్సిన్‌ నిజమైనదా కాదా అనే విషయం వారికి తెలియదు. 


ప్రతి వలంటీర్‌కూ 2 మోతాదుల వ్యాక్సిన్‌ ఇచ్చి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు. ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఆస్పత్రిలో ఉండాల్సిన పని లేదు. సాధారణ జీవితాన్ని గడపొచ్చు. మోడెర్నా సంస్థ వ్యాక్సిన్‌ తయారీని మొదలుపెట్టిన 2 నెలల్లోనే మానవ ప్రయోగాల దశకు చేరింది. తొలి దశ ప్రయోగాల్లో కొన్ని దుష్ప్రభావాలు(కొద్దిపాటి జ్వరం, చలి-వణుకు, ఇంజెక్షన్‌ చేసిన చోట నొప్పి వంటివి) కనిపించినప్పటికీ, మొత్తంగా ప్రోత్సాహకర ఫలితాలనే చూపింది. అయితే, వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని, అది సురక్షితమనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి భారీ ప్రయోగాలు అవసరమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. మోడెర్నా కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ డిసెంబరు కల్లా అందుబాటులోకి వస్తుందని అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌) డైరెక్టర్‌ ఫ్రన్సిస్‌ కాలిన్స్‌ తెలిపారు. కాగా.. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో మోడెర్నా ముందు వరుసలో ఉంది. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. 

Updated Date - 2020-08-06T03:49:54+05:30 IST