మోదీ ఇక ఫకీరని చెప్పుకోలేరు: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2022-01-02T22:58:34+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ఇంకెంతమాత్రం తాను ఫకీరునని చెప్పుకోలేరని శివసేన ఎంపీ..

మోదీ ఇక ఫకీరని చెప్పుకోలేరు: సంజయ్ రౌత్

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ఇంకెంతమాత్రం తాను ఫకీరునని చెప్పుకోలేరని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఇప్పుడు ఆయన కాన్వాయ్‌లోకి రూ.12 కోట్ల కారు వచ్చిచేరిందని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో దివంగత మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను ప్రశంసించారు. జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడూ ఇండియాలో తయారైన కారునే వాడేవారని, ఇందిరాగాంధీ తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా సెక్యూరిటీ గార్డులను మార్చలేదని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ సైతం జనంతో మమేకపై ఎల్‌టీటీఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని అన్నారు.


''ప్రధాని నరేంద్ర మోదీ కోసం రూ.12 కోట్ల కారు వచ్చిచేరినట్టు డిసెంబర్ 28న మీడియాలో ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. తనను తాను ప్రధాన సేవకుడిగా చెప్పుకునే వ్యక్తి విదేశీ కారును వాడుతున్నారు'' అని రౌత్ తన సంపాదకీయంలో మోదీని ఉద్దేశించి అన్నారు. ప్రధాని భద్రత, సదుపాయాలు ముఖ్యమే కానీ, ఇప్పటి నుంచి ఆయన ప్రధాన సేవక్‌గా మాత్రం చెప్పుకోరాదని పేర్కొన్నారు.


ప్రధాని భద్రత కోసం ఆయన కాన్వాయ్‌లోకి మెర్సిడెజ్‌ మేబ్యాచ్‌ ఎస్‌-650 గార్డ్‌ కారు తాజాగా వచ్చి చేరింది. ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఈ కారును ఎంపిక చేసింది. ఎలాంటి ప్రమాదం జరిగినా ఇందులో ప్రయాణించే వారికి హాని జరగని విధంగా కారును డిజైన్‌ ఉంటుంది. దీని ధర రూ.12 కోట్లు ఉంటుందని మీడియా వార్తలు పేర్కొన్నాయి. అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం ప్రధాని వాడే జర్మనీ బీఎండబ్ల్యూ స్థానంలో కొత్త కారు వచ్చి చేరిందని, జర్మనీ వాహనాల ఉత్పత్తిని సదరు సంస్థ నిలిపేసిందని చెబుతున్నాయి. మెర్సిడెజ్ కారు ధర మీడియా చెబుతున్న ధరలో మూడోవంతు మాత్రమే ఉంటుందని అంటున్నాయి.


స్వదేశీ ప్రచారం..విదేశీ కారు

'మేక్ ఇన్ ఇండియా', 'స్టార్టప్ ఇండియా' పేరుతో స్వదేశీ ప్రచారం చేపట్టిన మోదీ విదేశీ కారును వాడుతున్నారని సంజయ్ రౌత్ 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొన్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో రాత్రికి రాత్రి కేంద్రం ఆంక్షలు విధించడంపైనా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. రాత్రుల్లో విధిస్తున్న ఆంక్షల వల్ల ఆర్థిక నష్టాలు ఎదుర్కోవలసి వస్తోందన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమత్రి కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లక్షల మంది హాజరయ్యే ర్యాలీల్లో పాల్గొంటారని, అయితే ఆంక్షలు మాత్రం సామాన్య ప్రజానీకం పైనే విధిస్తున్నారని అన్నారు.

Updated Date - 2022-01-02T22:58:34+05:30 IST