మోదీ ‘వైద్యం’తో కోలుకున్న ఆర్థికం

ABN , First Publish Date - 2021-01-06T05:47:53+05:30 IST

ఏ దేశ ఆర్థికాభివృద్ధికి అయినా ఆ దేశ స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఒక ప్రాథమిక సూచిక. సాధారణ పరిస్థితులలో ఈ వృద్ధిరేటుతో పాటు...

మోదీ ‘వైద్యం’తో కోలుకున్న ఆర్థికం

ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం సకాలంలో చేపట్టిన చర్యల వల్లే కోవిడ్‌తో కుదేలయిన మన ఆర్థికవ్యవస్థ శీఘ్రగతిన పునరుజ్జీవితమయింది. మోదీ సర్కార్‌పై అసంబద్ధ విమర్శలు చేసినవారు తమ అవివేకాన్ని అంగీకరిస్తారా? మోదీ నాయ కత్వంలో రాబోయే ఐదేళ్ళల్లో దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ముందంజ వేస్తుందనడంలో సందేహం లేదు.


ఏ దేశ ఆర్థికాభివృద్ధికి అయినా ఆ దేశ స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఒక ప్రాథమిక సూచిక. సాధారణ పరిస్థితులలో ఈ వృద్ధిరేటుతో పాటు, అప్పుతో జీడీపీ నిష్పత్తి, విదేశీ మారక నిల్వలు, ఆర్థికలోటు, మిగులు కరెంట్ అకౌంట్ లోటు, మిగులు, పన్ను వసూలు తదితర అంశాలు కూడా దేశ ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు చాలా కీలకమైనవి. కరోనా మహమ్మారి వల్ల దేశ ఆర్థికవ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఇలాంటి అసాధారణ పరిస్థితిలో దేశ ఆర్థికవ్యవస్థపై అంచనాలను సాధారణ పరిస్థితులలోని గణాంకాలతో పోల్చలేము. పోల్చకూడదు కూడా. ఆర్థిక ఆపత్కాలంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిష్పాక్షికంగా, విశాల దృక్పథంతో పరిశీలించవలసి ఉంది. 


ఆర్థికవ్యవస్థ పరిమాణాన్ని పన్ను వసూళ్ల పరిమాణంతో అంచనా వేయడం అత్యవసరం. ప్రస్తుతం మనం అన్‌లాక్ దశలో ఉన్నాము. ఈ పరిస్థితిలో జిడిపి వృద్ధితో పాటు జీఎస్టీ వసూళ్లలో వృద్ధి ఆర్థికవ్యవస్థ పనితీరుపై అంచనాకు కీలకం. చాలా జాగ్రత్తగా అంచనా వేయవలసి ఉంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలువురు విమర్శలు చేస్తున్నారు. అదృష్టవశాత్తు పలువురు మేధావులు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ రూపకల్పనకు తోడ్పడ్డారు. 


2020–21 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక ఫలితాలను, గత ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికం ఫలితాలతో పోల్చిచూస్తే జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నట్టు స్పష్టమయింది. అలాగే 23.9శాతం తక్కువ జీడీపీ వృద్ధిరేటు -23.9 శాతంగా నమోదయింది. దీంతో పలువురు ఆర్థికవేత్తలు ముఖ్యంగా మోదీ సర్కార్‌ను వ్యతిరేకిస్తున్నవారు దేశ ఆర్థిక ఆరోగ్యం మరింతగా విషమించనున్నదని శకునాలు పలికారు. అయితే మోదీ ప్రభుత్వం దేశ అవసరాలకు అనుగుణంగా వివిధ వర్గాలకు తగిన ద్రవ్యలభ్యత కల్పించి తద్వారా వస్తు, సేవల వినియోగాన్ని పెంపొందించేందుకు అత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించింది, దీనిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నేరుగా అందించేందుకు 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. జీడీపీలో 30శాతంగా ఉన్న ఈ రంగం వాటాను గణనీయంగా మెరుగుపరిచేందుకై మరో 75 వేల కోట్లు కేటాయించారు. లాక్‌డౌన్ మొదటిదశలోనే సకాలంలో రుణ సదుపాయం కల్పించడం ద్వారా వ్యవసాయరంగానికి విశేషంగా మేలు చేశారు. అదే సమయంలో కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులను సేకరించేందుకు కేంద్రం రూ.75 వేల కోట్లు కేటాయించింది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సదుపాయాల అభివృద్ధికి రూ.1 లక్ష కోట్లు కేటాయించారు. నెలకు ప్రత్యక్ష నగదు బదిలీ రూ.500 చొప్పున 6 నెలలు 80 కోట్ల మంది దారిద్యరేఖ దిగువ కుటుంబాలకు వారి వినియోగ అవసరాలకు ఆహార ధాన్యాలతో పాటు అందించారు. పి.ఎం స్వానిధి ద్వారా వీధి వ్యాపారం చేసుకునే వారికి రుణసౌకర్యం కోసం రూ.10,000- చొప్పున 7 శాతం వడ్డీ రాయితీ కల్పించింది. మహమ్మారి కాలంలో ఇలా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ద్వారా దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. ఆయన కృషి ఫలించింది. అవును, మళ్ళీ చెబుతున్నాను, ఆత్మనిర్భర్ ప్యాకేజీతో మన ఆర్థిక వ్యవస్థ కోలుకున్నది. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలోనే ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన పెరుగుదలే అందుకు ఒక తిరుగులేని రుజువు. రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిలో తగ్గుదల (–) 9.5 శాతంగా ఉండగలదని అంచనా వేసినప్పటికీ ఆ తగ్గుదల (–) 7.5 శాతానికి పరిమితమయింది. కేంద్రప్రభుత్వం. ఆర్బీఐ చేపట్టిన చర్యలతో జీఎస్టీ వసూళ్ళు గణనీయంగా మెరుగుపడ్డాయి. రికవరీ నమోదు చేయబడింది. సాధారణ పరిస్థితులతో పోల్చినప్పుడు జీఎస్టీ వసూళ్ళలో కొరత ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ఫలితాలతో పోల్చినప్పుడు, రెండవ త్రైమాసికంలో వస్తుతయారీ సూచిక లేదా కొనుగోలు నిర్వాహకుల సూచిక (పిఎంఐ) మెరుగుపడింది, ఇవి ఆర్థికవ్యవస్థ పనితీరుకు కీలక సూచికలు. 


గత ఆర్థిక సంవత్సరంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవే నెలల్లో జిఎస్టీ వసూళ్ళ వృద్ధి -14, -8, 5, 10, 1శాతాలుగా నమోదు అయ్యింది. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల మన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ పథానికి చేరిందనడంలో ఎటువంటి సందేహం లేదు. లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రధాని మోదీ అగ్ర ప్రాధాన్యమిచ్చారు. వలసకార్మికులకు ఉపాధి కల్పించేందుకై గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులతో పాటు అదనంగా మరో రూ.50,000 కోట్లు కేటాయించారు. ఆర్థిక పాలనలో మానవతా కోణానికి ఇది ఉత్తమ ఉదాహరణ– ఎందుకంటే వలస కార్మికులు మన ఆర్థికవ్యవస్థలో కీలకమైన మానవ వనరులు.


ప్రస్తుతం మన విదేశీ మారక నిల్వలు 575 బిలియన్ అమెరికన్‌ డాలర్లకు పైగా ఉన్నాయి. కొవిడ్-–-19 అనిశ్చితి సమయంలో మనకు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులలో 13.5 బిలియన్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 39.90 బిలియన్ డాలర్లు సమకూరాయి. తత్ఫలితంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో 16శాతం మేరకు వృద్ధి నమోదయింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ వల్లే ఈ ఆర్థిక పునరుత్థానం సాధ్యపడిందనేది స్పష్టం. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే. కరోనా మహమ్మారి లాంటి ఆపత్కర పరిస్థితులలో ప్రభుత్వంపై నిర్హేతుక విమర్శలు చేయకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనే సహజ వివేకం కాంగ్రెస్ నాయకులలో ఎప్పుడు ఉదయిస్తుంది? చెప్పవచ్చినదేమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సకాలంలో చేపట్టిన చర్యల వల్లే కొవిడ్‌తో కుదేలయిన మన ఆర్థికవ్యవస్థ శీఘ్రగతిన పునరుజ్జీవితమయింది. మోదీ సర్కార్‌పై అసంబద్ధ విమర్శలు చేసినవారు తమ అవివేకాన్ని అంగీకరిస్తారా? నరేంద్ర మోదీ నాయకత్వంలో రాబోయే ఐదు సంవత్సరాలలో మనదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ముందంజ వేస్తుందనడంలో సందేహం లేదు.

దినకర్ లంకా

Updated Date - 2021-01-06T05:47:53+05:30 IST