Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంధి దశలో మోదీ

ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అవసరమైన కాలం నుంచీ, ఎన్నికల్లో గెలిచేందుకు తానే ప్రధాన కారకుడైన కాలం వరకూ మోదీ పరిణామ క్రమం గురించి ఆర్‌ఎస్‌ఎస్‌కు తెలియనిది కాదు. గుజరాత్‌ను పాలించడం వేరు, భారతదేశాన్ని పాలించడం వేరు అన్న విషయాన్ని మోదీకి చెప్పాల్సిన అవసరం వస్తుందని సంఘ్ పెద్దలు ఇన్నాళ్లూ భావించినట్లు లేదు. ‘‘మీకు ప్రజాస్వామిక విలువలు కావాలా, సంపద, అధికారం, కీర్తి కావాలా అని నన్ను వ్యక్తిగతంగా ఎవరైనా అడిగితే నేను ఎటువంటి ఆలోచన లేకుండా ప్రజాస్వామిక విలువలే కావాలని జవాబు చెబుతాను’’ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మాటలకు చేతలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉన్నదో సమీక్షించుకోవాల్సిన సమయమిది.


నిన్నటివరకూ నేల నిండా పరుచుకున్న ఎండుటాకులు ఇప్పుడు కనపడటం లేదు. ఎండాకాలం మధ్య వానపడితే దాహార్తితో ఉన్న నేల కొత్త వాసనలు విరజిమ్ముతోంది. చెట్లు కొత్త చిగుళ్లు వేస్తున్నట్లు, కోయిలలు కొత్త రాగాలు వినిపిస్తున్నట్లు కనపడుతోంది. దేశ రాజధానిలో ఒక శ్మశాన ప్రశాంతత నెలకొన్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మళ్లీ ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని జరిగిన దారుణాలపై పునరావలోకనం చేస్తున్నట్లు కనపడుతోంది. ప్రజల్లో తన పట్ల కోల్పోయిన నమ్మకాన్ని ఏ విధంగా తిరిగి సంపాదించుకోగలనా అన్న అంతర్మథనం ఆయనలో మొదలైందా?


నిజానికి ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పుడూ జంకలేదు. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేలా చేయడంలో ఆయనను మించిన వారు లేరు. పార్టీలో తనను ఎవరైనా విమర్శిస్తారన్న సంకోచం కూడా ఆయనకు లేదు.  ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం కూడా ఆయన ముఖంలో ఏనాడూ కనపడలేదు. గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారాన్ని ఆయన ఒక్కరే ముందుండి నిర్వహించారు. ఢిల్లీ నుంచి ఏ నేతా పెద్దగా రానక్కర్లేదని ఆయన స్పష్టం చేసేవారు. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ప్రచారం విషయంలో మరే నేతా తనకు దరిదాపుల్లో రాకుండా చూసుకున్నారు. అలాంటి మోదీ ఇప్పుడు ఒక పరిణామ దశలో తన భావి పాత్ర గురించి తానే సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


గడచిన ఏడేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏమైనా బృహత్తర విజయాలు సాధించారా లేదా అన్నది ప్రశ్న కాదు. కాని ఈ ఏడేళ్లుగా పెద్దగా ఏమీ సాధించకపోయినా తొలగిపోని భ్రమలు ఇప్పుడు ఉన్నట్లుండి చెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన చూసి, అత్యధిక మెజారిటీతో బిజెపిని ఎన్నుకున్న వారిలో ఒక పునరాలోచన జరుగుతున్న సంకేతాలు పసికట్టినందువల్లే మోదీ ఎందుకో చెదరిపోయినట్లు కనిపిస్తున్నారు. స్వాభావికమైన హుందాతనం, ఎవర్నైనా పట్టించుకోని లెక్కలేనితనం, తెచ్చి పెట్టుకున్న సాత్వికత, తానేదో చేస్తున్నానని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడం ఆయన మాటల్లో, హావభావాల్లో కనిపిస్తున్నాయి.


భారతీయ జనతా పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించిన ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక గ్రామాలు శ్మశానాలుగా మారిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రామాల నుంచి పట్టణాలకు చేరుకునే లోపే అనేకమంది శవాలుగా మారుతున్నారు. పట్టణాలకు చేరిన తర్వాత ఆక్సిజన్ సౌకర్యం లభించక మృత్యుఒడిలోకి జారిపోతోన్న వారు ఎంతమందో. వారెవరూ తమ మరణాల గురించి ఫేస్‌బుక్‌లో చెప్పుకోలేరు, ట్విట్టర్ లను ఆశ్రయించలేరు. తెలిసిన మరణాలకంటే లెక్కతెలియని మరణాలసంఖ్య ఎంతో ఎక్కువ. గంగానదిలో శవాలు తేలి వస్తున్న దృశ్యం ఒక్కటే  దేశంలో కరోనా మరణాలు, అధికారికంగా రోజూ విడుదలయ్యే గణాంక వివరాలకు అతీతమైనవని చెబుతుంది.  ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఆర్తనాదాల గురించి కేంద్రమంత్రులు, బిజెపి ఎంపీలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌కు రాసిన లేఖలే అక్కడి పరిస్థితికి తార్కాణం.


ఉత్తరప్రదేశ్‌లో శవాల మధ్య స్థానిక ఎన్నికల కోలాహలం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఏదో రకంగా విజయం సాధించి ఒక వికారమైన ఆనందాన్ని ప్రకటించాలనుకున్నది. కాని రామమందిరం నిర్మించిన అయోధ్యలోనూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేసిన వారణాసిలోను, యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్ పూర్ లోనూ, యుపి రాజధాని లక్నోలోను బిజెపికి ప్రజలు గట్టి జవాబు చెప్పారు. అయోధ్యలోని 40 జిల్లా పంచాయతీసీట్లలో బిజెపికి కేవలం 8 సీట్లే దక్కాయి. ఈ మృత్యువాతావరణం మధ్య బిజెపికి ఏమి మిగిలింది? వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే యుపి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కడం సాధ్యమా అన్న ప్రశ్న బిజెపి ముందు తచ్చాడుతోంది.


ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్  భాగవత్ ప్రజలు, పరిపాలనతో పాటు పరిపాలనా యంత్రాంగాన్ని సమిష్టిగా తప్పుపడుతూ విమర్శించడం బిజెపి వర్గాలను సైతం విస్మయపరిచింది. కరోనా మొదటి ప్రభంజనం తర్వాత ప్రభుత్వం కాడి పడేయలేదని కేంద్రమంత్రులతో సహా అనేకమంది సమర్థించుకుంటున్న తరుణంలో మోహన్ భాగవత్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడం సామాన్యమైన విషయంకాదు. 2020లో కొవిడ్ కేసులు పెరగడం ప్రారంభించిన తర్వాత మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. ప్రభుత్వ కార్యదర్శులతో 11 సాధికారిక బృందాలను ఏర్పర్చింది. ఆసుపత్రి పడకలు,  వైద్య ఉపకరణాలు, నిత్యావసర సేవలు, ప్రజారవాణా వంటి అనేక విషయాలపై ఈ బృందాలు రోజూ సమావేశమయ్యేవి. మోదీ, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నిరంతరం ముఖ్యమంత్రులు, ఛీఫ్ సెక్రటరీలతో సమావేశమయ్యేవారు.


మంత్రులకు కూడా కీలక రాష్ట్రాలకు సంబంధించి బాధ్యతలు అప్పజెప్పారు. కాని కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినతర్వాత మళ్లీ ఉదాసీనత ప్రారంభమైంది. 2020 సెప్టెంబర్‌లోనే  కార్యదర్శుల బృందాలను ఆరింటికి తగ్గించారు. అవి కూడా తరుచూ సమావేశమయ్యేవి కావు.  ఈ ఏడాది జనవరి, మార్చి మధ్య ఆరోగ్యంపై ఏర్పర్చిన మంత్రుల బృందం ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. రెండో ప్రభంజనం గురించి శాస్త్రవేత్తల హెచ్చరికలను పట్టించుకోదగ్గ తీరిక రాజకీయ నాయకులకు లేకుండా పోయింది.  సంపన్న దేశాలు తమ జనాభాకు అవసరమైన దానికంటే 200 శాతం ఎక్కువగా వాక్సిన్లను సమకూర్చుకోగా,  భారత ప్రభుత్వం ఈ విషయంలో కేవలం ఆరంభ శూరత్వం మాత్రమే ప్రదర్శించిందన్న విషయం స్పష్టం. వాక్సిన్ సర్టిఫికెట్‌పై తన చిత్రాన్ని ముద్రించుకునేందుకు చూపిన ఆరాటం మొత్తం దేశ ప్రజలందరికీ సరిపోయే వాక్సిన్లు అతివేగంగా సమకూర్చుకోవడంలోను, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలోనూ చూపలేదు. ఇలాంటి విషయాలను అధ్యయనం చేయకుండా మోహన్ భాగవత్ వ్యాఖ్యానించే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు. కుంభమేళాలో పాల్గొన్న అనేకమంది మరణించడం, సంఘ్ సేవలో తమ జీవితాలను త్యాగం చేసిన పలువురు అసువులు బాయడం కూడా ఆయనను కలిచివేసి ఉంటుంది. 


ఈ పరిణామాల మధ్య భారతీయ జనతా పార్టీ నేతల్లో అంతర్మథనం ప్రారంభం కాలేదని చెప్పలేం. ఒక రాజకీయ పార్టీ పూర్తిగా తమ నేత ప్రచారంపై ఆధారపడినప్పుడు కొంత అలసత్వం బయలుదేరుతుంది. ఎలాగూ తమ నాయకుడే తమను గెలిపిస్తాడు కదా అన్న ధీమాలో  క్రిందిస్థాయి ప్రజలతో సంబంధాలు కోల్పోవడం ప్రారంభమవుతుంది. కాని నాయకుడి ప్రతిష్ఠే ప్రశ్నార్థకమైనప్పుడు ఏం జరుగుతుందో వారికిప్పుడు అర్థమవుతోంది. పార్టీలో అధికారం పూర్తిగా కేంద్రీకృతమైనప్పుడు, కీలక అంశాలపై ఒకరిద్దరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు బిజెపిలో ఇతర నేతలెవరూ ప్రశ్నించలేదు. వ్యూహరచన, గెలిపించే బాధ్యత వారే తీసుకుంటారు కదా అన్న ఉదాసీనత వారిలో ఏర్పడింది మోహన్ భాగవత్ మాత్రమే కాదు, ఇటీవల బిజెపి నుంచి ఆర్‌ఎస్ఎస్‌కు మళ్లీ వెళ్లిపోవాల్సివచ్చిన రాంమాధవ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.


ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ అవసరమైన కాలం నుంచీ, తానే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన కారకుడైన కాలం వరకూ మోదీ పరిణామ క్రమం గురించి ఆర్‌ఎస్‌ఎస్‌కు తెలియనిది కాదు. సంఘ్‌తో నిమిత్తం లేని మోదీ సేన ఏర్పడిన విషయం ఆ సంస్థ నేతలు గమనించనిది కాదు. కాని గుజరాత్‌ను పాలించడం వేరు, భారతదేశాన్ని పాలించడం వేరు అన్న విషయాన్ని మోదీకి చెప్పాల్సిన అవసరం వస్తుందని వారు ఇన్నాళ్లూ భావించినట్లు లేదు.


‘‘భారతదేశాన్ని పాలించేందుకు నియంతృత్వం అవసరమా అని మీరడిగితే, అవసరం లేదు అని నేను చెబుతాను. నియంతృత్వ ఆలోచనా విధానం మనకు తగింది కాదు. ఒకే చోట అధికారాన్ని కేంద్రీకృతం చేయడంలో విశ్వసించే శక్తిమంతమైన వ్యక్తి మనకు అవసరమని కూడా నేను భావించడం లేదు. భారత దేశం పురోగతి చెందాలంటే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక విలువల పట్ల బలీయమైన విశ్వాసం ఉండడం అవసరం. ఇదే అవసరమని, ఇదే మన దేశంలో కొనసాగుతున్నదని నా అభిప్రాయం. మీకు ప్రజాస్వామిక విలువలు కావాలా, సంపద, అధికారం, కీర్తి కావాలా అని నన్ను వ్యక్తిగతంగా ఎవరైనా అడిగితే నేను ఎటువంటి ఆలోచన లేకుండా ప్రజాస్వామిక విలువలే కావాలని వెంటనే జవాబు చెబుతాను..’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ద టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తన మాటలకు, చేతలకు ఎంత వ్యత్యాసం ఉన్నదో సమీక్షించుకుంటే చాలు ఈ చరిత్ర సంధి దశలో తన స్థానమేమిటో మోదీకి అర్థమవుతుంది.ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Advertisement
Advertisement