మార్పుపై చర్చకు సిద్ధమా?

ABN , First Publish Date - 2021-03-08T07:40:39+05:30 IST

బెంగాల్‌లో సిసలైన మార్పు తీసుకొస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను మమత తిప్పికొట్టారు. ఆ మార్పు ఢిల్లీలో (కేంద్రంలో) వస్తుందని ఆమె సిలిగురిలో జరిగిన ఓ భారీ ర్యాలీలో అన్నారు...

మార్పుపై చర్చకు సిద్ధమా?

  • ప్రధాని మోదీకి దీదీ సవాల్‌.. మార్పు వచ్చేది ఢిల్లీలో..!
  • మోదీ-షా ఓ సిండికేట్‌గా మారారు.. ప్రధాని ఓ అబద్ధాలకోరు: మమత

సిలిగురి, మార్చి 7: బెంగాల్‌లో సిసలైన మార్పు తీసుకొస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను మమత తిప్పికొట్టారు. ఆ మార్పు ఢిల్లీలో (కేంద్రంలో) వస్తుందని ఆమె సిలిగురిలో జరిగిన ఓ భారీ ర్యాలీలో అన్నారు. పెరిగిన చమురు, గ్యాస్‌ ధరలకు నిరసనగా ఆమె ఓ సిలిండర్‌ను పట్టుకుని డార్జిలింగ్‌లో ఊరేగింపులో పాల్గొన్నారు. ‘దేశమంతా ఇంధన ధరలు పెరిగాయి. బ్యాంకులను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. తన కలలను అమ్ముకోడానికి మోదీ బెంగాల్‌ వచ్చారు. ఎవరో రాసిచ్చిన స్ర్కిప్టు చదువుతున్నారు. ఎన్నటికీ బెంగాల్‌కు ఆయన అనుసంధానం కాలేరు. మోదీ చెప్పేవన్నీ అబద్ధాలు. ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారు’ అని మమత రోడ్‌షో అనంతరం జరిగిన సభ లో దుయ్యబట్టారు. తనను బువా-భతీజా అని హేళనకు కౌంటర్‌ ఇస్తూ దేశమంతటికీ మోదీ- షా ఓ సిండికేట్‌లా మారారని ఎదురుదాడి చేశారు. ‘‘మార్పు గురించి చర్చకు సిద్ధమేనా? మోదీ మీరు, నేను చర్చిద్దాం.. తేదీ, వేదిక చెప్పండి.. ఆట మొదలైంది (ఖేలా హొబె). మేం పోరాడతాం, గెలుస్తాం, మోదీ, బీజేపీలను దేశం నుంచి వెళ్లగొడతాం. మాతో పెట్టుకున్నవారెవరైనా నాశనం కాక తప్పదు’ అని ఆమె కార్యకర్తలు హర్షధ్వానాల మధ్య అన్నారు.


Updated Date - 2021-03-08T07:40:39+05:30 IST