కరోనా యుద్ధంలో ‘ఫీల్డ్‌మార్షల్‌’

ABN , First Publish Date - 2021-06-08T05:58:42+05:30 IST

తెలంగాణలో మంత్రులు బానిసలకన్నా ఘోరం..’ అని అన్నది ఎవరో కాదు, 18 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర సమితిలో సభ్యులుగా, 17 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఏడు సంవత్సరాలుగా రాష్ట్ర మంత్రిగా ఉన్న, కీలకమైన శాఖలు నిర్వహించిన సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్...

కరోనా యుద్ధంలో ‘ఫీల్డ్‌మార్షల్‌’

వ్యాక్సినేషన్ బాధ్యతలను అప్పగించిన కొద్ది రోజుల్లోనే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు గందరగోళం సృష్టించడం, రకరకాల స్వరాలతో మాట్లాడడంతో పాటు మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని కల్పించే ప్రయత్నాలు చేశాయి. ఈ సంకుచిత రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు నిర్ణయించడం శుభపరిణామం. మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియను మళ్లీ కేంద్రం చేతుల్లోకి తీసుకుని జూన్ 21 నుంచి దేశంలో అందరికీ ఉచితంగా టీకాలు పంపిణీ చేసేందుకు ఆయన నిర్ణయించారు.

తెలంగాణలో మంత్రులు బానిసలకన్నా ఘోరం..’ అని అన్నది ఎవరో కాదు, 18 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర సమితిలో సభ్యులుగా, 17 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఏడు సంవత్సరాలుగా రాష్ట్ర మంత్రిగా ఉన్న, కీలకమైన శాఖలు నిర్వహించిన సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్. బానిసత్వంపై, గులాంగిరీపై, రాచరికంపై, దొరతనంపై పోరాడిన చరిత్ర ఉన్న తెలంగాణలో ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి తపించే ప్రతి ఒక్కరికీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఒక నియంతలా, ఒక దొరలా కనిపిస్తున్నారు.ఎంతో మంది త్యాగాల ఫలితంగా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇచ్చిన మద్దతు ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఇవాళ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూసే పరిస్థితి ఏర్పడిదంటే అందుకు కారణాలు తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతాపార్టీ ఎదిగిందన్న విషయమూ ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే ఈటల రాజేందర్ వంటి ఒక వ్యక్తిత్వం ఉన్ననాయకుడు బిజెపిని ఎంచుకునే వారే కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి బీటలు వారుతున్నదని చెప్పేందుకు ఇది ఒక సంకేతం మాత్రమేనని అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ కుప్పకూలిపోయేందుకే కాదు, కాంగ్రెస్, ఇతర శక్తులు చరిత్రలో అంతర్ధానమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయన్న విషయం కూడా స్పష్టమవుతోంది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు బిజెపికి అనుకూలంగా ఉన్నాయని, కేసిఆర్ నిరంకుశ, అవినీతి భూయిష్టపాలనను వదిలించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని స్పష్టమవుతోంది.

అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌కు రాష్ట్రంలో కరోనా మూలంగా ఏర్పడిన దుర్భర పరిస్థితులు చక్కదిద్దడం కన్నా ఒక ఆరోగ్య, వైద్య శాఖను నిర్వహిస్తున్న మంత్రిని తొలగించడం, ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ప్రాధాన్యత అయింది. ఈ దేశంలో ఉన్న నికృష్ట వారసత్వరాజకీయాల్లో భాగంగా భవిష్యత్‌లో తన కుమారుడికి పట్టం కట్టాలన్న ఉద్దేశంతోనే ఈటల రాజేందర్‌ను వదుల్చుకున్నారని టిఆర్ ఎస్ నేతలే అంటున్నారు. పట్టణ, మునిసిపల్ మంత్రిగా ఉన్న కె.తారక రామారావు కేంద్రం వాక్సిన్ విధానాన్ని విమర్శించిన తీరు ఆయన అవగాహనా లేమికి నిదర్శనం.. నిజానికి కేంద్రం ఉచితంగా సరఫరా చేసిన 69.23 లక్షల డోసులలో జూన్ 1 నాటికి దాదాపు 61 లక్షల డోసులు పంపిణీ చేయగా, 2.25 లక్షల డోసులు వృధా చేశారు. పరిపాలనలో ఇది తెలంగాణ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది. వాక్సిన్ విధానంపై కేంద్రానికి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్రం ఉచితంగా పంపిణీ చేసిన టీకాల్లో సగం కూడా ప్రజలకు పంపిణీ చేయలేదు. జనవరి నుంచి మార్చి వరకు 65 లక్షల డోసుల వాక్సిన్ పంపిణీ చేస్తే అందులో కేవలం 26 లక్షల డోసులే ప్రజలకు ఇచ్చారని ఎంతమందికి తెలుసు? 

కరోనా రెండో ప్రభంజనం తీవ్రతరమవుతున్న సమయంలో జనవరి- మార్చి మధ్య కేంద్రం ఉచితంగా సరఫరా చేసిన టీకాలనే పూర్తిగా ప్రజలకు అందించ లేకపోయిన రాష్ట్రాలు వాక్సిన్ విషయంలో తమకు స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేశాయి. వాక్సిన్ సేకరణలో రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలివ్వాలని రాహుల్ గాంధీ ఏప్రిల్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. జైరాంరమేశ్, శశిథరూర్ వంటి కాంగ్రెస్ నేతలైతే వాక్సిన్ ప్రమాణాలపైనే సందేహాలను వ్యక్తం చేసి ప్రజల్లో తప్పుడు భయాందోళనలను కల్పించారు. ఆ తర్వాత ఆక్సిజన్ కొరతకు కేంద్రమే కారణమంటూ మోదీ పై నిందలు వేశారు. ఆరోగ్యం, వైద్యం రాష్ట్రాలకు సంబంధించినవి కనుక రాష్ట్రాలు కోరిన విధంగా వాక్సినేషన్ సేకరణలో వాటికే భాగస్వామ్యం కల్పించాలని కేంద్రం నిర్ణయిస్తే కొద్ది రోజుల్లోనే రాష్ట్రాలు చేతులెత్తేశాయి. ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాల విషయంలో ఘోరమైన వైఫల్యం ప్రదర్శించిన రాష్ట్రాలు కేంద్రాన్ని నిందించడం, లేఖలు రాయడానికే పరిమితమయ్యాయి.

అయినా కేంద్రం చెక్కుచెదరలేదు. ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీల నేతలు నోటికి పనిచెబుతుండగా, మోదీ ప్రభుత్వం ఆరోగ్య వైద్య సదుపాయాల కల్పనలో పూర్తి దృష్టి సారించింది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. కరోనాకు అవసరమైన మందులను సేకరించేందుకు రంగంలోకి దిగింది. 2 డీజీ వంటి వినూత్న పరిష్కారాలపై దృష్టి కేంద్రీకరించింది. అన్నిటికన్నా ఎక్కువగా వాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు, విదేశాలనుంచి సేకరించేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేసింది.ఇలాంటి అనేక చర్యల వల్ల కరోనా మొదటి ప్రభంజనాన్ని అరికట్టేందుకు పట్టినంత కాలం కూడా రెండో ప్రభంజనాన్ని అరికట్టేందుకు పట్టలేదని తగ్గిపోతున్న కరోనా వ్యాప్తి, మరణాల సంఖ్యను బట్టి అర్థమవుతుంది.

టీకాలకు సంబంధించి తమకు బాధ్యతలను అప్పగించిన కొద్ది రోజుల్లోనే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు గందరగోళం సృష్టించడం, రకరకాల స్వరాలతో మాట్లాడడంతో పాటు మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని, వ్యతిరేకతను కల్పించే ప్రయత్నం చేయడంతో వాటికి అడ్డుకట్ట వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు నిర్ణయించడం శుభపరిణామం. మళ్లీ మొత్తం వాక్సినేషన్ ప్రక్రియను మళ్లీ కేంద్రం చేతుల్లోకి తీసుకుని జూన్ 21 నుంచి దేశంలో అందరికీ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తుందని ఆయన ప్రకటించారు. 

అధికార వికేంద్రీకరణ అన్నది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన పరిణామం. అందుకే ప్రధానమంత్రి అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరేలా చేశారు. కాని రాష్ట్ర ప్రభుత్వాలు అధికార వికేంద్రీకరణ అంటే అవినీతి, అరాచకత్వం, ఆశ్రిత పక్షపాతం, వారసత్వంకు తోడు అసమర్థ పాలన అన్న లక్షణాలను ప్రతిఫలించాయి. ప్రజల పట్ల కనీస జవాబుదారీ తనాన్ని కూడా ప్రదర్శించలేకపోయాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యతలనుంచి ఏనాడూ తప్పుకోలేదు. కరోనాపై తొలి పోరులో ఆయన దేశప్రజలందరినీ, రాష్ట్రాలను తానే ముందుంచి నడిపించి ఆత్మవిశ్వాసం అందించారు. ఇప్పుడు మలి పోరులో కూడా ఆయన వెనుకడుగు వేయదలుచుకోలేదు. మొత్తం టీకా కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టడమే ఇందుకు నిదర్శనం. రానున్న కొద్దినెలల్లోనే 18–-45 మధ్య వయసున్న వారికే కాక మొత్తం ప్రజలందరికీ టీకాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. అందుకు తగ్గ ఖర్చును పూర్తిగా కేంద్రం భరిస్తుంది. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు, అంతర్గత, బహిర్గత సమస్యలు ఏర్పడ్డప్పుడు ఒక బలమైన నాయకుడుగా తాను ఉన్నానని నరేంద్రమోదీ ఎప్పటికప్పుడూ గత ఏడేళ్లలో నిరూపిస్తూ వచ్చారు. అటువంటి సమర్థ నాయకత్వ లక్షణలు లేనందువల్లే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అస్తిత్వ సమస్యలో పడి మోదీని దుమ్మెత్తి పోయడం తప్ప మరే ఎజెండా లేనట్లు ప్రవర్తించాయి. మోదీ తాజా నిర్ణయంతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల అసమర్థ పాలన స్పష్టంగా బహిర్గతమైంది. మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీని దెబ్బతీయడం అంత సులభం కాదని అవి తెలుసుకోవాలి.

-వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-06-08T05:58:42+05:30 IST