మోదీ ఈ దేశానికి రాజేమీ కాదు : సుబ్రహ్మణ్యం స్వామి

ABN , First Publish Date - 2021-08-15T00:10:47+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ

మోదీ ఈ దేశానికి రాజేమీ కాదు : సుబ్రహ్మణ్యం స్వామి

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, విదేశాంగ విధానాలకు తాను బద్ధ వ్యతిరేకినని చెప్పారు. ఓ ట్విటరాటీ ఇచ్చిన ట్వీట్‌కు స్వామి బదులిస్తూ, తాను విభిన్నమైన కారణంతో మోదీని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 


ఓ యూజర్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘సార్, నేను మీకు గొప్ప అభిమానిని. ఏదైనా తప్పు జరిగినపుడు మోదీని, ఆయన ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తే, నేను మీకు మద్దతిస్తాను. కానీ మీరు చేసే ప్రతి ట్వీట్ ఆయనకు వ్యతిరేకంగానే ఉంటోంది. దీనినిబట్టి మీరు మోదీని వ్యతిరేకించడానికి కారణం ఆయన మీకు మీరు కోరుకున్న మంత్రి పదవి ఇవ్వకపోవడం అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. దీనికి సుబ్రహ్మణ్యం స్వామి బదులిచ్చారు.



‘‘మోదీ ఆర్థిక, విదేశాంగ విధానాలకు నేను వ్యతిరేకం. బాధ్యతాయుతంగా వ్యవహరించేవారితో దీనిపై చర్చించడానికి నేను సిద్ధం. భాగస్వామ్య ప్రజాస్వామ్యం గురించి మీరు విన్నారా? మోదీ ఈ దేశానికి రాజు కాదు’’ అని స్వామి పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా ఆయన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లపై కూడా విరుచుకుపడ్డారు. వీరిద్దరూ అధికారగణానికి చెందినవారని, వీరు భారత దేశాన్ని అంతర్జాతీయంగా ఇబ్బందుల్లోకి నెట్టారని, అందుకు వీరు క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. మోదీ రాజకీయ నాయకులను నమ్ముతారు కానీ, తనకు సమాన స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులను నమ్మరని, అందుకే ఈ ఇద్దరికీ స్వేచ్ఛను ఇచ్చారని అన్నారు. ఇప్పుడు మనం మన పొరుగు దేశాలన్నిటితోనూ చిక్కుల్లో ఉన్నామన్నారు. 


సుబ్రహ్మణ్యం స్వామి రెండుసార్లు కేంద్ర మంత్రిగా చేశారు. ఇటీవలి మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు.


Updated Date - 2021-08-15T00:10:47+05:30 IST