Abn logo
Apr 7 2020 @ 03:10AM

మోదీ సారథ్యమే శ్రీరామరక్ష

ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే విధంగా తబ్లిగీ జమాత్ ప్రవర్తించింది. ఇది దేశ వ్యతిరేకమైన వైఖరి కాదా? కొన్ని సంస్థలు, వ్యక్తుల చర్యల వల్ల మొత్తం దేశంలో సామాజిక సామరస్య వాతావరణం దెబ్బతింటే ఎవరికి నష్టం?


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొత్తం ప్రపంచంలోనే అత్యధిక మంది సభ్యులున్న సామాజిక సంస్థ. ఆ సంస్థకు సంబంధించి అత్యున్నత స్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అఖిల భారతీయ ప్రతినిధి సభ ప్రతి ఏడాదీ మార్చిలో సమావేశాలు నిర్వహిస్తుంది. అయితే కొవిడ్ -19 మూలంగా మార్చి 16, 17, 18 తేదీల్లో ఆ సంస్థ బెంగళూరులో జరపాల్సిన అఖిల భారతీయ ప్రతినిధి సభను రద్దు చేసుకుంది. ఈ సమావేశాలకు హాజరు కావాల్సిన 1600 మంది ప్రతినిధులు వెనక్కు వెళ్లి తమ తమ ప్రాంతాల్లో ప్రజల్లో కరోనా వైరస్ వల్ల ఏర్పడే ప్రమాదాలను వివరించాలని సంఘ్ పెద్దలు కోరారు. చాలా చోట్ల సంఘ్ కార్యకలాపాలు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా, సోషల్ మీడియా సహకారంతో జరుగుతున్నాయి. లాక్‌డౌన్ మూలంగా వలస కార్మికులకు, పేదలకు ఆకలి బాధలు లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది సంఘ్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. మరో వైపు భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను రంగంలోకి దించి పేద ప్రజలను ఆదుకుంటోంది.


మరి తబ్లీగీ జమాత్ సంస్థ ఏమి చేసింది? కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదాలున్న రీత్యా సమావేశాలను నిలిపివేయాలని ప్రపంచ వ్యాప్తంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పెడచెవిన పెట్టింది. అప్పటికే ప్రధానమంత్రి ప్రతి ఏడాదీ అట్టహాసంగా జరుపుకనే హోలీ మిలన్‌ను రద్దు చేశారు. సార్క్ సమావేశాలను వీడియో ద్వారా నిర్వహించి సార్క్ నిధి ఏర్పాటుకు పిలుపునిచ్చారు. తబ్లీగీ జమాత్ నిర్వాహకులు మాత్రం బాధ్యతారహితంగా వైరస్ తీవ్రంగా ఉన్న దేశాలనుంచి వందలాది విదేశీ ప్రతినిధులను అక్రమ వీసాలతో పిలిపించి ఢిల్లీలో సమావేశాలు నిర్వహించి దేశంలో లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్వవహరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల మూలంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య పెరగడంలేదని దేశ ప్రజలంతా సంతృప్తి చెందుతున్న సమయంలో ఉన్నట్లుండి వైరస్ సోకిన వారు బయటపడడం, వారు తబ్లీగీ జమాత్ సమావేశాల్లో పాల్గొన్నవారేనని తేలడంతో భయాందోళనలు తీవ్రమయ్యాయి. వివిధ రాష్ట్రాలనుంచి ఈ సమాచారం వస్తున్నప్పటికీ ఢిల్లీలో తబ్లీగీ జమాత్ నిర్వాహకులు నిర్లక్ష్యపూరితంగా నిజామూద్దీన్‌లోని మర్కజ్‌లో వందలాది మందితో ప్రార్థనలు నిర్వహిస్తూనే ఉన్నారు. బాధ్యతాయుతంగా తమంతట తాము ముందుకు వచ్చి వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వానికి సహకరించే బదులు ప్రార్థనా సమావేశాలు నిలిపివేసేందుకు నిరాకరించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వచ్చి వారికి నయానో, భయానో నచ్చజెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా కొంతమంది తబ్లీగీ జమాత్ కార్యకర్తలు డాక్టర్లకు సహకరించకుండా వారిపై దాడులు చేసినట్లు సమాచారం లభించింది. వారెందుకలా వ్యవహరించారు? మన దేశంలో చట్టాల పట్ల, ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల వారికి నమ్మకం లేదా?


మన దేశంలో ప్రతి రోజూ వివిధ మతాల వారు తమ తమ రీతిలో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ప్రజాస్వామ్య విలువలు ఉన్నత స్థాయిలో పాటిస్తున్న మన దేశంలో వీటన్నిటిపై ఆంక్షలు ఉండవు. కాని ఇవాళ కరోనా వైరస్ మూలంగా ఏర్పడిన ప్రమాదం ఏ మతాన్నీ, వర్గాన్నీ వదిలిపెట్టదు. ఎవరూ ఈ వైరస్ ప్రమాదానికి అతీతం కారు. అందువల్లే కోట్లాది ప్రజలు దేశ పరిస్థితిని అర్థం చేసుకుని లాక్‌డౌన్‌కు స్వచ్ఛందంగా సహకరిస్తూ వచ్చారు. నిజానికి సంక్షోభ సమయాల్లో ప్రజలకు అన్ని మత సంస్థలూ, సామాజిక సంస్థలూ అండగా నిలవాలి. కరోనా వైరస్ గురించి ప్రజలను అవి చైతన్యపరిచి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సక్రమంగా అమలు అవుతాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసింది అదే. కాని తబ్లిగీ జమాత్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో వైరస్ వ్యాప్తి చెందే విధంగా ప్రవర్తించింది. ఇది దేశ వ్యతిరేకమైన వైఖరి కాదా? కొన్ని సంస్థలు, వ్యక్తుల చర్యల వల్ల మొత్తం దేశంలో సామాజిక సామరస్య వాతావరణం దెబ్బతింటే ఎవరికి నష్టం?


దారుణమేమంటే ఈ దేశంలో ముస్లింలకు తానొక్కడినే ప్రజాప్రతినిధిని అన్నట్లు వ్యవహరిస్తున్న మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా తబ్లీగీ జమాత్ చేసిన బాధ్యతారహితమైన పనిని సమర్థించడం. తబ్లీగీ జమాత్ సమావేశాలకు మతం రంగం పులమవద్దని ఆయన అన్నారు. ఎవరు మతం రంగు పులిమారు? తబ్లీగీ జమాత్ సమావేశాల మూలంగా వైరస్ సోకిన వారి సంఖ్య ఉన్నట్లుండి రెట్టింపు కావడం నిజం కాదా? ఆయన ఎందుకు ఆ సంస్థ బాధ్యతారాహిత్యాన్ని ఖండించలేదు? అక్రమ వీసాలు ప్రోత్సహించడాన్ని ఎందుకు విమర్శించలేదు?


ఇవాళ ఒవైసీకి, వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకీ పెద్ద వ్యత్యాసం కనిపించలేదు. ప్రభుత్వం చేసిన ప్రతిదాన్నీ ద్వేషభావంతో తప్పు పట్టడాన్ని వారు అలవాటు చేసుకున్నారు. జనతా కర్ఫ్యూ రోజు వైద్య సిబ్బందిని, మానవ సేవలో ఉన్నవారిని అభినందిస్తూ కరతాళ ధ్వనులు చేయవలిసిందిగా ప్రధాని పిలుపునిస్తే దాన్నీ వారు వేళా కోళం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలన్న పట్టుదలను వ్యక్తం చేసేందుకు దీపాలు వెలిగించవలిసిందిగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును కూడా ఒవైసీ అపహాస్యం చేసి గిమ్మిక్కు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ అంటూ విమర్శించారు. మన దేశంలో ఏ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలన్నా దీపాలను వెలిగించడం సంప్రదాయం. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్న వాక్యంలో చీకట్లను తరిమివేసి జీవితంలో వెలుగురేఖల్ని ఆహ్వానించాలన్న సందేశం ఉన్నది. దీపం వెలిగించడం అనేది ఒక స్ఫూర్తికి సంకేతం. ప్రజల్లో ఈ స్ఫూర్తిని రగిలించడం కోసమే ప్రధానమంత్రి ఆ పిలుపునిచ్చారు. కానీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నేతలు ఆ స్ఫూర్తిని అపహాస్యం చేశారు. ప్రధాని పిలుపును బహిష్కరించమని ఒవైసీ పిలుపునిస్తే దీపాలు వెలిగించడం వల్ల ఎలెక్ట్రిక్ గ్రిడ్ పేలిపోతుందని కాంగ్రెస్ నేత శశిథరూర్ బూటకపు భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారు. లిఫ్ట్ లేకపోతే ఎలా వెళతామని ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితిలో కీలక బాధ్యతలు నిర్వర్తించి, సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన వ్యక్తి ఈ రకమైన విపరీత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న భావదారిద్ర్యానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ప్రధానమంత్రి కొద్ది నిమిషాలు లైట్లు ఆపి దీపాలు వెలిగించమని చెప్పారు కాని లిఫ్‌్టలు ఆపాలని, ట్రాన్స్‌ఫార్మర్లను కట్టేయాలని ఎక్కడైనా చెప్పారా? ప్రధాని చేసిన ప్రతి ప్రకటననూ వ్యతిరేకించడం కన్నా, వలస కూలీలకు, పేదలకు ప్రతిపక్షాలు చేసిందేమిటి, మొసలి కన్నీళ్లు కార్చడం తప్ప?


విచిత్రమేమంటే రాజకీయ కారణాల రీత్యా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రతను గుర్తించడానికి నిరాకరించిన జగన్మోహన్ రెడ్డి కూడా తబ్లిగీ జమాత్ చేసిన దుష్కార్యాల్ని పరోక్షంగా సమర్థించడం. వైరస్ పెరగడానికి మతం రంగు పులమకూడదని వ్యాఖ్యానించడం ఆయన వైఖరికి అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తబ్లీగీ జమాత్ మూలంగా వైరస్ సోకిన వారి సంఖ్య పెరిగిందని, తన స్వంత జిల్లా కడప నుంచే అనేకమంది ఈ సమావేశానికి వెళ్ళారనీ ఆయనకు తెలియదా? తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, కొందరు ఎమ్మెల్యేలు తబ్లీగీ సమావేశాల్లో పాల్గొన్నారని వస్తున్న ఆరోపణలపై ఆయన ఎందుకు జవాబివ్వడం లేదు? వారిలో ఎంతమంది క్వారంటైన్‌లో ఉన్నారు? వీటన్నిటిపై స్పష్టత ఇవ్వకుండా ఒక మతం సానుభూతిని పొంది రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ఎందుకు ప్రయత్నించారు? అంతేకాక, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాల ద్వారా వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం విడుదల అయిన నిధులను వైసీపీ సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంటిటీసీల ద్వారా ప్రజలకు పంచిపెట్టడంలో ఔచిత్యం ఉన్నదా? ప్రధాని పిలుపునకు ప్రజలు అఖండ మద్దతును ప్రకటించిన తర్వాతనైనా మన రాజకీయ నేతలకు జ్ఞానోదయం కలిగి రాజకీయాలకు అతీతంగా వివేకవంతంగా వ్యవహరిస్తే మంచిది. లేకపోతే ప్రజల దృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదు. వారికి నచ్చినా నచ్చకపోయినా ఇవాళ మోదీ సారథ్యమే దేశానికి శ్రీరామరక్ష.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Advertisement
Advertisement
Advertisement