రూ.5,555 కోట్లతో గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-11-22T22:57:32+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వింధ్యాచల్‌ ప్రాంతంలోని మీర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాల్లో రూ.5,555.38 కోట్లతో చేపడుతున్న గ్రామీణ తాగునీటి..

రూ.5,555 కోట్లతో గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వింధ్యాచల్‌ ప్రాంతంలోని మీర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాల్లో రూ.5,555.38 కోట్లతో చేపడుతున్న గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజక్టులను ప్రారంభించిన ప్రధాని, గ్రామీణ-పారిశుద్ధ్య కమిటీ సభ్యులతో సంభాషించారు. తాజా ప్రాజెక్టుతో 2,995 గ్రామాల్లో ఇంటింటికి ట్యాప్‌ల ద్వారా నీటి కనెక్షన్ కల్పిస్తారు. రెండు జిల్లాల్లోని 42 లక్షల మంది జనాభా ఇందువల్ల లబ్ధి పొందుతారు. 24 నెలల్లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు.


ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, జలజీవన్ మిషన్ ప్రారంభించిన గత ఏడాదిన్నర కాలంలో ఉత్తరప్రదేశ్‌‌లోని లక్షలాది కుటుంబాలతో సహా 2 కోట్ల 60 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ పైపుల ద్వారా తాగునీటి కనెక్షన్లు కల్పించినట్టు చెప్పారు. జలజీవన్ మిషన్‌తో మన తల్లులు, సోదరీమణులు ఇళ్లలోనే నీటిని సులువుగా పొందగలిగే సౌకర్యం కలుగుతుందన్నారు. ప్రధానంగా పేద కుటుంబావారు కలుషిత నీటితో కలరా, టైఫాయిడ్, ఎన్సిఫాలిటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా జలజీవన్ మిషన్‌తో లబ్ధి పొందుతారని చెప్పారు.


పుష్కలంగా వనరులున్నప్పటికీ వింధ్యాచల్ ప్రాంత ఎలాంటి ప్రయోజనాలు పొందడం లేదని, తాజా ప్రాజెక్టులతో నీటి కొరత, నీటిపారుదల సమస్యలు పరిష్కారమై, ఈ ప్రాంతం శీఘ్రుగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. పైపుల ద్వారా వేలాది గ్రామాలకు నీరు అందడం వల్ల పిల్లలు కూడా శారీరక, మానసిక ఎదుగుదల గణనీయంగా ఉంటుందని చెప్పారు. గ్రామాల స్వయం సమృద్ధితోనే స్వయం సమృద్ధ భారతం సాధ్యమని ప్రధాని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T22:57:32+05:30 IST