మోదీ, మీడియా, ‘పౌర’ పోరు

ABN , First Publish Date - 2020-02-04T00:06:14+05:30 IST

అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వమూ తాను తీసుకున్న నిర్ణయాలే సరైనవని, వాటి వల్ల సత్ఫలితాలు వస్తాయని భావిస్తుంది. ప్రభుత్వ విజయాల గురించి మీడియా...

మోదీ, మీడియా, ‘పౌర’ పోరు

పౌరసత్వ చట్టవ్యతిరేక ప్రదర్శనలకే ప్రాధాన్యమిస్తూ, ఆ చట్టానికి మద్దతుగా నిర్వహిస్తున్న సభలను మీడియా ఉపేక్షిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్షేపించారు. పౌరసత్వ చట్టం బిజెపికి ఆయుధంగా మారుతుందా లేదా అని చెప్పడానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు దోహదం చేయవచ్చు. ప్రజల్లోనే తేల్చుకొంటామని మోదీ అన్నందువల్ల ముందుగా ఢిల్లీ ప్రజలకే బిజెపి భవిష్యత్తును నిర్ణయించే అవకాశం లభించింది.
 
అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వమూ తాను తీసుకున్న నిర్ణయాలే సరైనవని, వాటి వల్ల సత్ఫలితాలు వస్తాయని భావిస్తుంది. ప్రభుత్వ విజయాల గురించి మీడియా సరైన విధంగా ప్రజలకు తెలియజేయడం లేదని ప్రభుత్వాధినేతలు అభిప్రాయపడడం కద్దు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. బిజెపి అధ్యక్షుడుగా జగత్ ప్రకాశ్ నడ్డా ఎంపికైన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో మోదీ మాట్లాడుతూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘మాధ్యమాల్లో వచ్చే వార్తల్ని విస్మరించి ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవాల’ని ఆయన కార్యకర్తలకు సూచించారు.
 
అసలు మాధ్యమాల నుంచి మనం సహాయం ఎందుకు ఆశించాలి? అవన్నీ కాంగ్రెస్‌ను అంటిపెట్టుకున్నవి. ప్రతి రోజూ డజనుకు పైగా ప్రభుత్వ వ్యతిరేక సంఘటనల గురించి అవి చెబుతాయి. కాని మన ప్రభుత్వానికి అనుకూలంగా జరిగిన సభలకు లక్ష మంది దాకా జనం వచ్చినా సరే వారు ప్రజలకు తెలియజేయడం లేదు.. కనుక ఈ మాధ్యమాల గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోకండి..’ అని ఆయన అన్నారు.
 
దేశంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల గురించే మీడియాలో ప్రసారం చేస్తూ, ఆ చట్టానికి అనుకూలంగా పార్టీ, ప్రభుత్వం నిర్వహిస్తున్న సభలకు వస్తున్న ప్రతిస్పందనల గురించి మాత్రం ప్రజలకు తెలియజేయడం లేదనేది ప్రధాని చేసిన ఫిర్యాదు. అంతేకాదు, సైద్ధాంతికంగా కూడా ఆయన మీడియా, ప్రతిపక్షాలపై దాడి చేశారు. ప్రతిపక్షాలు బిజెపి సిద్ధాంతాన్ని వ్యతిరేకించినా ప్రజలు ఆదరించలేదని, అయినా అవి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, పైగా మీడియాతో కుమ్మక్కయ్యాయని కూడా ఆరోపించారు. అయినా జరిగేది ఏమీ లేదని ప్రజలు మనతోనే ఉన్నారని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రధాని మోదీ ప్రకటించారు.
 
ఒక రకంగా మోదీ చేసిన ప్రకటన మీడియా పట్ల ఆయన వెలిబుచ్చిన నిరసన. పరోక్షంగా మీడియా బహిష్కారానికి ఇచ్చిన పిలుపు. మీడియా ప్రజలకు శత్రువుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అభివర్ణనకు సమానంగా ప్రధాని మోదీ అభిప్రాయం ఉన్నదని వేరే చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ మీడియాను పట్టించుకోవద్దని ఒక దేశ ప్రధానే తన పార్టీ కార్యకర్తలకు చెప్పారంటే దాని గురించి తీవ్రంగా ఆలోచించవలిసి ఉంటుంది. మీడియాను, ప్రతిపక్షాలను ఒకే గాటన కట్టి ఆయన ఇరువర్గాలపై దాడి చేయడం కూడా సాధారణ విషయం కాదు. ప్రధాని చేసిన విమర్శల ఆధారంగా మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాలా, లేక మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలా అన్నది చర్చనీయాంశమే.
 
అయితే మీడియా ఎప్పుడూ ఇటువంటి విమర్శలకు గురి కాలేదు? ప్రజాస్వామ్యంలో మీడియా ఎప్పుడూ తటస్థ పరిశీలక పాత్ర పోషించవలిసి ఉంటుంది. కాని ఎప్పుడూ అపోహలకు గురికాక తప్పని పరిస్థితి కూడా జర్నలిస్టులకు ఎదురవుతుంది. జవహర్ లాల్ నెహ్రూ మరణించిన తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి మొరార్జీ దేశాయ్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తూ ఎంపీలను తన శిబిరంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలపై సీనియర్ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ ఒక వార్త రాశారు. దీనితో మొరార్జీ దేశాయ్ ప్రయత్నాలు బెడిసి కొట్టి నేతలంతా లాల్ బహదూర్ శాస్త్రికి అనుకూలంగా మారారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రికి కుల్దీప్ నయ్యర్ పార్లమెంట్ మెట్ల వద్ద ఎదురయ్యారు. తనను చూడగానే సంతోషం పట్టలేక శాస్త్రి కౌగిలించుకుని నీ వార్త నాకు అద్భుతంగా మేలు చేసిందని కృతజ్ఞతలు చెప్పడంతో కుల్దీప్ నయ్యర్ నివ్వెరపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకు నయ్యర్‌ను సమాచార సలహాదారుగా కూడా శాస్త్రి నియమించుకున్నారు. అది వేరే సంగతి.
 
ఏ మీడియా అయినా రోజు వారీ సంఘటనల తీవ్రతను, అది కూడా ప్రజలు నేరుగా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలపడాన్ని చిత్రిస్తే ఏ అధికార పార్టీ కూడా హర్షించదు. అధికార పార్టీ, ప్రభుత్వం తాము చేసిన నిర్ణయాలను సమర్థించుకుంటూ పెద్ద ఎత్తున సభలను నిర్వహించి ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోస్తే కూడా మీడియా దాన్ని ఉద్దేశపూర్వకంగా కప్పిపెట్టే ప్రయత్నం చేయదు. అధికార పార్టీ ఏర్పాటు చేసిన సభలు విజయవంతం కావడానికి తెర వెనుక ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వివిధ సంస్థలు, అధికార పార్టీనుంచి ప్రయోజనాలను ఆశించే పెద్దలు తోడ్పడతారని తెలిసినప్పటికీ మీడియా ఆ సభల గురించి ప్రజలకు తెలియజేస్తూనే ఉంటుంది. నిజానికి గత ఆరు సంవత్సరాలుగా మీడియాలో మోదీ, అమిత్ షాలు మాట్లాడిన మాటలే పత్రికల్లో పతాక శీర్షికలు గానో, లేక లోపలి పేజీల్లో ప్రముఖంగానో ప్రచురితమవుతున్నాయి.
 
మోదీ, అమిత్ షాల ప్రసంగాలు లేని పేపర్లు, ప్రసారం చేయని మీడియా సాధనాలూ ఈ దేశంలో లేవనే చెప్పాలి. అయినప్పటికీ ఇవాళ వారితో సమానంగా కాకపోయినా, అందులో సగభాగమైనా లేక పావు భాగమైనా ప్రజల నిరసన ప్రదర్శనల గురించి పత్రికలు రాస్తే అధికార పక్షానికి అసహనం కలగడం, పత్రికలనూ ప్రతిపక్షాలనూ ఒకే గాటన కట్టడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి మోదీ అన్నట్లు పత్రికలు నిజంగా ప్రతిపక్ష పాత్ర వహిస్తే ప్రజాస్వామ్యంలో అంతకంటే ఆరోగ్యకరమైన పరిణామం వేరే ఉండదు.
 
అయినప్పటికీ మీడియాలో వచ్చిన దాన్ని పట్టించుకోకూడదని, ప్రజల నిరసన ప్రదర్శనలను పూర్తిగా విస్మరించాలని, మితిమీరితే వాటిని అణిచివేయాలని ప్రభుత్వం ఎలాగూ నిర్ణయించింది కనుక చర్చకు తావు లేదు. ‘మీరెన్ని నిరసన ప్రదర్శనలు చేసినా పౌరసత్వ చట్టాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు..’ అని హోంమంత్రి అమిత్ షా మంగళవారం లక్నోలో నిర్వహించిన బహిరంగ సభలో స్పష్టం చేశారు.
 
నిజానికి మోదీ చెప్పకముందే అధికార పక్షమే ప్రతిపక్షాలకు, మీడియాకు తానే ప్రతిపక్షంగా వ్యవహరించాలని ఎప్పుడో నిర్ణయించింది. ఎదురు దాడి చేయడం ద్వారా విమర్శలకు జవాబు చెప్పడమే వ్యూహమని బిజెపి ఎప్పుడో నిర్ణయించుకుంది. దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పౌరసత్వ చట్టానికి అనుకూలంగా పెద్దఎత్తున బహిరంగ సభలను నిర్వహించాలని, వందలాది విలేఖరుల సమావేశాలు జరపాలని నిర్ణయించింది. ఇందులో తప్పేమీ లేదు. సభలు, సమావేశాలు నిర్వహించే హక్కు ప్రతిపక్షాలకే కాదు, అధికార పార్టీకి కూడా ఉంటుంది. కాని ప్రజలు ఎవరి వాదనను ఆమోదిస్తున్నారు అని చెప్పడానికి కొలమానం ఎన్నికలు మాత్రమే.
 
ఇంతకీ పౌరసత్వ చట్టాన్ని బిజెపి ఎందుకు ఆగమేఘాలపై తెచ్చిందన్న ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ఆ పార్టీకే తెలుసు. తొలుత అస్సాం, పశ్చిమబెంగాల్, మరికొన్ని రాష్ట్రాల్లోనే బిజెపికి దీని వల్ల రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయని విశ్లేషకులు భావించారు. కాని బిజెపి ఊహించని విధంగా ఈ చట్టంపై ప్రజల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరగడం, దేశంలో అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరగడంతో ఆ పార్టీ కూడా ఆశ్చర్యపోయింది. తొలుత కొంత ఖంగు తిన్నా, తర్వాత స్థిమితపడి, ఎదురు దాడి చేయడానికే నిర్ణయించింది. ఎందుకంటే ఈ పరిణామాల వల్ల దేశ వ్యాప్తంగా ఈ చట్టం ప్రజల్లో మతపరంగా విభజన రేకెత్తే అవకాశాలు వారికి కనపడ్డాయి. ఇప్పుడు పౌరసత్వ చట్టం, 2021లో ఎన్నికలు జరిగే కేవలం రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదు, మొత్తం దేశానికి సంబంధించిన విషయం. మంచికో చెడుకో బిజెపి రణరంగంలోకి దిగింది. ప్రజల్లోకి వెళ్లి తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. అందుకే ప్రధాని, హోంమంత్రి మాటల్లో అంత స్పష్టత కనిపిస్తోంది. ఇదీ ఒకందుకు మంచిదే. దేశం ఎటువైపు వెళుతుందో పరిశీలకులకు స్పష్టంగా తెలుస్తుంది.
 
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం తాను అనుకున్నది నెగ్గించుకోగలదా అన్నది తేలాలంటే ఎన్నికలు జరగాలి. మరో నాలుగేళ్ల వరకు సార్వత్రక ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ అక్కడ ప్రధానంగా స్థానిక అంశాలకు ప్రాధాన్యత లభిస్తుంది. గత నెలలో జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలు పెద్ద ఎత్తున పౌరసత్వ చట్టం గురించి మాట్లాడారు. అయినప్పటికీ అక్కడ స్థానిక అంశాలు ప్రధానం కావడం, గిరిజనులు, గిరిజనేతరుల అంశం ఎజెండాలోకి రావడంతో బిజెపి విజయం సాధించలేకపోయింది. ఫిబ్రవరి 8న జరుగుతున్న ఢిల్లీ ఎన్నికల్లో జాతీయ అంశాల కన్నా కేజ్రీవాల్ పాలన, ఆయన అమలు చేసిన పథకాలే ప్రధానంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించవచ్చని అత్యధికులు భావిస్తున్నారు.
 
కాని ఢిల్లీ దేశ రాజధాని కావడం, జాతీయ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండడం, దాదాపు 20 శాతం ముస్లింలు ఉండడం, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వివిధ ముస్లిం ప్రాంతాల్లో తీవ్ర నిరసన ప్రదర్శనలు జరగడం వల్ల ఓటర్లు మత ప్రాతిపదికగా విడిపోతే బిజెపి అనుకున్న లక్ష్యం నెరవేరినట్లే అవుతుంది. అంతే కాదు, మత ప్రాతిపదికగా ప్రజలను భావోద్వేగాలకు, భద్రతా రాహిత్యానికి గురిచేసి ప్రయోజనాలు పొందడం సులభం. అందుకే పౌరసత్వ చట్టం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఆప్ హాజరు కాలేదు. తాము నిరసన ప్రదర్శనలకు మద్దతునిస్తే ప్రజలు మత ప్రాతిపదికగా విడిపోయే అవకాశాలున్నాయని ఆప్ నేతలు కూడా చెబుతున్నారు. ముస్లింలు 40 శాతం ఉన్న అయిదు నియోజకవర్గాల్లో ఎప్పుడూ బిజెపి విజయం సాధించలేదు. కాని ఈ సారి హిందూ, ముస్లిం ప్రాతిపదికన ఓటింగ్ జరిగితే పరిస్థితి తారు మారుకావచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు అన్నారు.
 
బిజెపికి సంబంధించినంతవరకు ఢిల్లీ ఎన్నికలు రాబోయే జాతీయ పరిణామాలకు సూచికగా ఉపయోగపడవచ్చు. పౌరసత్వ చట్టానికి సంబంధించి బిజెపిని దాని మిత్రపక్షాలన్నీ సమర్థించడం లేదు. బీజేపీ మైనారిటీల విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేయనందువల్ల తాము ఢిల్లీలో ఆ పార్టీతో కలిసి పోటీ చేయడం లేదని దాని దీర్ఘకాలిక మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. ఢిల్లీలో ఉన్న పది లక్షలమంది సిక్కు ఓటర్లు కనీసం పది స్థానాల్లో ప్రభావం చూపగలుగుతారు. ఒకప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇవాళ స్థానికంగానూ నాయకత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నందువల్ల ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపిల మధ్యే నడుస్తోంది. బిజెపికి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ లేకపోవడంతో పోటీ మోదీ, కేజ్రీవాల్‌ల మధ్యే కేంద్రీకృతమైంది. పౌరసత్వ చట్టం బిజెపికి ఆయుధంగా మారుతుందా లేదా అని చెప్పడానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు దోహదం చేయవచ్చు. ప్రజల్లోనే తేల్చుకొంటామని మోదీయే అన్నందువల్ల ముందుగా ఢిల్లీ ప్రజలకే బిజెపి భవిష్యత్తును నిర్ణయించే అవకాశం లభించింది.
ఎ. కృష్ణారావు 
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-02-04T00:06:14+05:30 IST