మోదీని పవార్ ఎందుకు కలిసారో చెప్పిన సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2021-07-18T00:50:46+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కలుసుకోవడంపై శివసేన..

మోదీని పవార్ ఎందుకు కలిసారో చెప్పిన సంజయ్ రౌత్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కలుసుకోవడంపై శివసేన నేత సంజయ్‌ రౌత్ స్పందించారు. ఉభయులూ కలుసుకోవడం వెనుక రాజకీయ సంబంధాలేవీ లేవని, పాత మైత్రీబంధంతోనే కలిసారని, రాజకీయ కోణం లోంచి ఈ విషయాన్ని చూడకూడదని అన్నారు.


''ప్రధానిని పవార్ కలిస్తే అందులో ఆశ్చర్యపడాల్సినదేమీ లేదు. వారి మధ్య చిరకాల మైత్రీబంధం ఉంది. ఒకరినొకరు సంప్రందించుకుంటూ ఉంటారు. పవార్ తనతో ఒక ఫైలును తీసుకువెళ్లినట్టు ఒక ఫోటోలో చూశాను. బహుశా అది వ్యవసాయం, కో-ఆపరేషన్‌కు సంబంధించినది కావచ్చు'' అని మీడియాతో మాట్లాడుతూ సంజయ్ రౌత్ చెప్పారు. పవార్‌ను తాను కలిసినప్పుడు ఆ విషయం అడిగి తెలుసుకుంటానని అన్నారు. ఈనెల 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉన్న తరుణంలో మోదీ, పవార్ కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి పదవిని పవార్ ఆశిస్తున్నట్టు కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తుండగా, ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని పవార్ సూటిగా ఖండించారు.

Updated Date - 2021-07-18T00:50:46+05:30 IST