తీవ్ర ఒత్తిడిలో ప్రధాని మోదీ!

ABN , First Publish Date - 2021-05-05T07:23:46+05:30 IST

కరోనా రెండో ప్రభంజనంలో వైరస్‌ వ్యాప్తికి సమర్థంగా అడ్డుకట్ట వేయలేకపోవడంతో.. ప్రజల్లో అసంతృప్తి! మరోవైపు బెంగాల్‌లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీలో...

తీవ్ర ఒత్తిడిలో ప్రధాని మోదీ!

  • లాక్‌డౌన్‌తోనే కరోనా కట్టడి సాధ్యమని వైద్యనిపుణుల సూచన

న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): కరోనా రెండో ప్రభంజనంలో వైరస్‌ వ్యాప్తికి సమర్థంగా అడ్డుకట్ట వేయలేకపోవడంతో.. ప్రజల్లో అసంతృప్తి! మరోవైపు బెంగాల్‌లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీలో అసంతృప్తి. కరెన్సీ విలువలో ఆసియా దేశాలన్నింటిలోనూ మన రూపాయి పరిస్థితే ఘోరంగా ఉంది. దీంతో ప్రధాని మోదీపై అన్ని వైపుల నుంచీ తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా.. కరోనా కట్టడికి లాక్‌డౌనేపరిష్కారమంటూ దేశ, విదేశీ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు సైతం లాక్‌డౌన్‌ పెట్టే అంశాన్ని పరిశీలించాలంటున్నాయి. ప్రధానమంత్రి నియమించిన కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కూడా లాక్‌డౌన్‌ విధించడమే మంచిదని ప్రధానికి సూచించింది. అయితే లాక్‌ డౌన్‌ విధించినా, విధించకపోయినా కూడా దేశం తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఏర్పడిన సంక్షోభం, విమర్శల నేపథ్యంలో.. మోదీ ఈసారి లాక్‌డౌన్‌పై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మళ్లీ అలాంటి విమర్శలను ఎదుర్కోవాలని ఆయన భావించట్లేదు. అందుకే.. లాక్‌డౌన్‌ను రాష్ట్రాలు చివరి అస్త్రంగా వాడాలంటూ రెండు వారాల క్రితం సూచించారు. లాక్‌డౌన్‌ విధించాలని అందరూ అంటున్నప్పటికీ.. దానివల్ల ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంటుంది. విధించకపోతే ప్రజారోగ్య సంక్షోభం తప్పేలా లేదు. అలాగని ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తే.. ప్రజలంతా వైరస్‌ బారిన పడి అప్పుడు కూడా ఆర్థిక సంక్షోభం వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో, మోదీకి నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారింది.


పార్టీ ప్రతిష్ఠ కూడా..

కరోనా మూలంగా రాజకీయంగా బీజేపీ ప్రతిష్ఠ దిగజారిపోవడంపై కూడా భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఆరోగ్య, ఆర్థిక విషయాలను ప్రధానమంత్రి అత్యంత సమర్థులైన వృత్తినిపుణులకు అప్పజెప్పి.. నిర్ణయాలుతీసుకునే స్వేచ్ఛ వారికి ఇవ్వాలనే చర్చ కూడా కమలదళంలో జరుగుతోంది. త్వరలో కేంద్ర కేబినెట్‌ను విస్తరించి సమర్థులైన వారిని మంత్రివర్గంలో చేర్చుకోవాలన్న ఒత్తిడి ఆయనపై పెరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితి పట్ల ఆర్‌ఎ్‌సఎస్‌ మనస్తాపంతో ఉన్నదని.. ఈ పరిస్థితుల్లో మోదీని విమర్శించేందుకు సిద్ధంగా లేమని సంఘ్‌ నేత ఒకరు చెప్పారు. కేంద్రానికి తక్షణ మార్గదర్శకత్వం అందించడమే తమ పని అన్నారు. సంఘ్‌ చెప్పిన విధంగా మోదీ నడుచుకుంటారా అని ప్రశ్నించగా.. నడుచుకోవాలనే ఆశిస్తామని ఆయన చెప్పారు.



పలు రాష్ట్రాల్లో ఆంక్షలు

దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై మోదీపై ఒత్తిడి పెరుగుతున్న మాట నిజమే. కానీ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కఠిన లాక్‌డౌన్‌, మరికొన్ని చోట్ల ఆ తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. వాటిని పరిశీలిస్తే..


ఢిల్లీ: ఏప్రిల్‌ 19 నుంచి ఢిల్లీలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. మే 10 దాకా అమల్లో ఉంటుంది.

బిహార్‌: మే 4 నుంచి మే 15 దాకా బిహార్‌లో లాక్‌డౌన్‌ విధించారు.

ఉత్తరప్రదేశ్‌: ఉత్తర ప్రదేశ్‌లో విధించిన వారాంతపు లాక్‌డౌన్‌ను మరో రెండు రోజులు పొడిగించారు. 

హరియాణా: హరియాణాలో మే 3 నుంచి వారం రోజుల లాక్‌డౌన్‌ విధించారు. అంతకుముందు 9 జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూ విధించారు.

ఒడిశా: మే 5 నుంచి 19 దాకా రెండు వారాల లాక్‌డౌన్‌ విధించారు.

రాజస్థాన్‌: అక్కడ కూడా మే 17 దాకా లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించారు.

కర్ణాటక: ఏప్రిల్‌ 27 నుంచి మే 12 దాకా కర్ణాటకలో లాక్‌డౌన్‌ విధించారు.

ఝార్ఖండ్‌: ఏప్రిల్‌ 22 నుంచి మే 6 దాకా ఝార్ఖండ్‌లో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించారు.

ఛత్తీ్‌సగఢ్‌: ఛత్తీ్‌సగఢ్‌లో మే 5తో లాక్‌డౌన్‌ ముగియనుంది. అయితే.. జిల్లాల్లో పరిస్థితులను బట్టి మే 15 దాకా పొడిగించుకునే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు.

పంజాబ్‌: పంజాబ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూతోపాటు ప్రజల రాకపోకలపై తీవ్రస్థాయి ఆంక్షలు మే 15 దాకా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా కర్ఫ్యూ అమల్లో ఉంది. మే 7 దాకా అక్కడ కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

గుజరాత్‌: ప్రధాని మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో 29 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడడంపై ఆంక్షలున్నాయి.

మహారాష్ట్ర: కేసులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు ఏప్రిల్‌ 5 నుంచి అమల్లో ఉన్నాయి. మే 15 దాకా ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

గోవా: గోవాలో నాలుగు రోజుల లాక్‌డౌన్‌ సోమవారంతో (మే 3) ముగిసింది. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో మాత్రం మే 10 దాకా ఆంక్షలు అమల్లో ఉంటాయని గోవా సర్కారు స్పష్టం చేసింది.

తమిళనాడు: తమిళనాడులో మే 20 దాకా రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాలన్నింటిపై తీవ్ర ఆంక్షలున్నాయి.

కేరళ: కేరళలో మే 4 నుంచి 9 దాకా కఠిన లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది.

పుదుచ్చేరి: పుదుచ్చేరి సర్కారు లాక్‌డౌన్‌ను మే 10 దాకా పొడిగించింది.

తెలంగాణ: తెలంగాణలో మే 8 దాకా నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంది. మే 5వ తేదీ నుంచి రెండు వారాపాటు.. మధ్యాహ్నం 12 నుంచి మర్నాడు ఉదయం 6 గంటల దాకా పాక్షిక కర్ఫ్యూ అమలు కానుంది.

అసోం: అసోంలో ఏప్రిల్‌ 27 నుంచి మే 7 దాకా నైట్‌ కర్ఫ్యూ విధించారు. అయితే, ఇన్నాళ్లుగా నైట్‌ కర్ఫ్యూ రాత్రి 8 గంటల నుంచి అమల్లో ఉండేది. దాన్ని సాయంత్రం 6 గంటలకు మార్చారు.

నాగాలాండ్‌: నాగాలాండ్‌లో ఏప్రిల్‌ 30 నుంచి మే 14 దాకా కఠిన ఆంక్షలతో పాక్షిక లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు.

మిజోరం: మిజోరంలో మే 3 నుంచి రాజధాని ఐజ్‌వాల్‌లో, మరికొన్ని జిల్లా కేంద్రాల్లో ఎనిమిది రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించారు.

జమ్ము, కశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో నాలుగు జిల్లాల్లో మే 6 దాకా లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. 20 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. అలాగే.. ఉత్తరాఖండ్‌లో, హిమాచల్‌ ప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది.

Updated Date - 2021-05-05T07:23:46+05:30 IST