ట్రంప్‌తో తాజ్‌మహల్‌ సందర్శనకు మోదీ దూరం..!

ABN , First Publish Date - 2020-02-22T22:07:44+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భారత్ పర్యటనలో భాగంగా ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్‌ను సందర్శించబోతున్నారు. తాజ్ సందర్శన సమయంలో ఆయన వెంట ..

ట్రంప్‌తో తాజ్‌మహల్‌ సందర్శనకు మోదీ దూరం..!

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భారత్ పర్యటనలో భాగంగా ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్‌ను సందర్శించబోతున్నారు. తాజ్ సందర్శన సమయంలో ఆయన వెంట ప్రధాని మోదీ ఉండటం లేదని తాజా సమాచారం. ట్రంప్‌తో కలిసి తాజ్‌మహల్‌ను మోదీ సందర్శించే ప్లాన్ ఏదీ లేదని, ఆగ్రాలో ట్రంప్‌కు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలుకుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించనుండగా, ఆ పర్యటనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఆహ్వానం లభించలేదని ఇప్పటికే అప్ వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై అటు ఢిల్లీ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్రం నుంచి కానీ ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.


షెడ్యూల్ ప్రకారం మెలానియా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి హ్యాపీనెస్ తరగతుల నిర్వహణను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటిస్తారు. ట్రంప్, మెలానియా ఈనెల 24 నుంచి 25వ తేదీ వరకూ భారత్‌లో పర్యటిస్తారు. అహ్మదాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'నమస్తే ట్రంప్' ఈవెంట్‌లో ట్రంప్‌తో పాటు మోదీ పాల్గొంటారు. అమెరికాలో 'హౌదీ-మోదీ' తరహాలోనే ఈ 'నమస్తే ట్రంప్'లో ఇద్దరు అగ్రనేతలు పాల్గొంటుండటం విశేషం.

Updated Date - 2020-02-22T22:07:44+05:30 IST