దశాదిశాలేని మోదీ విదేశాంగ విధానం

ABN , First Publish Date - 2020-06-25T06:23:22+05:30 IST

తెలుగుబిడ్డ కల్నల్‌ సంతోష్‌బాబుతోసహా 20మంది భారత వీర జవానులు దేశ సరిహద్దు ప్రాంతం గాల్వన్‌ లోయ వద్ద వీరమరణం పొందిన సంఘటనలకు ప్రధాని మోదీ చెబుతున్న భాష్యం భారతసైనికుల ప్రాణత్యాగాన్ని అపహాస్యం చేసింది...

దశాదిశాలేని మోదీ విదేశాంగ విధానం

గల్వాన్‌ లోయ విషయమై మోదీ వాస్తవాలను దాచిపెట్టడం వల్ల చైనా వాదనకు బలం చేకూరింది. అంతర్జాతీయ సమాజం ముందు తాము నిర్దోషులం అని వాదించుకోగల హక్కును మోదీ వారికి అయాచితంగా అందించారు. సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు కచ్చితమైన సమాచారంతో నిజాయితీతో స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని నిర్వహించేవారికి ఉండాలి. మోదీకి అటువంటి పట్టింపులు ఉన్నట్లు కనపడదు.


తెలుగుబిడ్డ కల్నల్‌ సంతోష్‌బాబుతోసహా 20మంది భారత వీర జవానులు దేశ సరిహద్దు ప్రాంతం గాల్వన్‌ లోయ వద్ద వీరమరణం పొందిన సంఘటనలకు ప్రధాని మోదీ చెబుతున్న భాష్యం భారతసైనికుల ప్రాణత్యాగాన్ని అపహాస్యం చేసింది. భారత సరిహద్దుల్లోకి ఎవ్వరూ జొరబడలేదని, భారత సైనిక శిబిరాలను ఎవ్వరూ స్వాధీనపర్చుకోలేదని, వాటిని నాశనం చేయలేదని ప్రధాని చేసిన ప్రకటన దేశాన్నేకాక అంతర్జాతీయ సమాజాన్నీ నివ్వెరపర్చింది. మరోపక్క మోదీ ప్రకటనలతో గొప్ప ఆయుధాన్ని సమకూర్చుకొన్నామని చైనా ఆనందిస్తోంది.


భారత భూభాగంలోకి ఎవ్వరూ జొరబడకపోతే, భారత జవాన్లే వాస్తవాధీనరేఖ దాటి చైనా భూభాగంలోకి వెళ్లి చైనా సైన్యంతో కలబడ్డారా? దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీర జవానుల రుధిరం చిందింది ఏ భూభాగంలో? మోదీ ప్రకటనే నిజమైతే రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌లు గాల్వన్‌ సంఘటన జరగగానే చైనాకు చేసిన హెచ్చరికల్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ఒకవైపు గాల్వన్‌ లోయ మొత్తం తమదేనని ఇప్పటికే చైనా ప్రకటించుకొంది. భారత్‌ భూభాగంలోని లద్దాఖ్‌లో, ప్యాంగాంగ్‌ సరస్సు ఉత్తర భాగంలో ఛాయాచిత్రాలు చైనా సైనికుల శిబిరాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. జూన్‌ 15 రాత్రి వాస్తవాధీన రేఖను దాటి చైనా ముష్కరులు జొరబడుతుంటే, భారత జవాన్లు వారిని నిలుపుదల చేయడానికి ఏవిధంగా అడ్డుకొంటున్నదీ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా దేశ ప్రజలందరూ చూశారు. యావత్‌ ప్రపంచం కూడా వీక్షించింది. కానీ, ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవ్వరూ జొరబడలేదని చెప్పడం సమాచార లోపమా, లేక ప్రజలను కావాలని తప్పుదోవ పట్టించడమా?


మోదీ వాస్తవాలను దాచిపెట్టడం వల్ల చైనా వాదనకు బలం చేకూరింది. అంతర్జాతీయ సమాజం ముందు తాము నిర్దోషులం అని వాదించుకోగల హక్కును మోదీ వారికి ఆయాచితంగా అందించారు. చైనా ప్రభుత్వ అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్’లో మోదీ వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఉటంకించారు. మోదీ నిజాలను వెల్లడించి.. తమ దేశంలోని జాతీయవాదులకు గట్టిగా బుద్ధి చెప్పారని పేర్కొంది. అంటే, వారి దృష్టిలో కాంగ్రెస్‌ పార్టీ, ఇంకా గాల్వన్‌ సంఘటనలో కేంద్రం తీరును తప్పుపడుతున్న పార్టీల వైఖరిని మోదీ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లన్నమాట. చైనా జాతీయ మీడియాలో, సోషల్‌ మీడియాలో విస్తృతంగా ఇవే కథనాలు చెలామణి అవుతున్నాయి. అవి ఒక అడుగు ముందుకువేసి ‘‘సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యం మొహరించడం.. దేశ ప్రజలను సంతృప్తి పర్చేందుకే’’ అని కూడా ప్రచారం చేస్తున్నాయి.


సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు కచ్చితమైన సమాచారంతో నిజాయితీతో స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని నిర్వహించేవారికి ఉండాలి. మోదీకి అటువంటి పట్టింపులు ఉన్నట్లు కనపడదు. ప్రతిపక్ష నాయకులే తన మాటల్ని వక్రీకరిస్తున్నారని ఆయన, తోడుగా బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గాల్వన్‌ సంఘటనను అంతర్జాతీయ సమాజం ఏవిధంగా అర్థం చేసుకొన్నదో చెప్పుకోవాలి. తూర్పు దక్షిణాసియా ప్రాంత దేశాలైన జపాన్‌, తైవాన్‌, టిబెట్‌, భూటాన్‌, మయన్మార్‌, ఫిలీప్పీన్స్ వంటి దేశాలు ఇప్పటికే చైనా దూకుడు విధానాన్నీ, అంతర్జాతీయ ఒప్పందాల్ని ఉల్లంఘిస్తున్న తీరునూ తీవ్రంగా ఎండగడుతున్నాయి. జపాన్‌ దేశపు ప్రముఖ పత్రిక జపాన్‌ టైమ్స్ గాల్వన్‌ లోయ ఉదంతంలో చైనా దుండుడుకు చర్యలను భారత్‌ తిప్పికొట్టలేకపోయిందని, పైగా చైనా చర్యలను సమర్థించే తీరులో ప్రభుత్వ వాదన ఉందని పేర్కొంది. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నోళ్లను మోదీ మూయించగలరేమోగానీ, అంతర్జాతీయ సమాజం నుండి ఎదురవుతున్న ఈ విమర్శలను ఖండించగలరా? అరుణాచల్‌ ప్రదేశ్‌లో, నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న కాలాపానీ ప్రాంతంలో చైనా సైనికులు చొచ్చుకొని వస్తున్నారన్న వార్తలొచ్చినపుడు కూడా..


ఆ అంశాలపై దేశంలోని రాజకీయ పక్షాలతో మాట్లాడి.. దేశ భద్రతపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలన్న; ప్రతిపక్షాలు అందించే సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రజాస్వామిక వైఖరి ఎన్టీఏకు లోపించింది. నిజానికి, పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగానే 1993లోనే భారత్‌-చైనా మధ్య సరిహద్దు శాంతి ఒప్పందం (బోర్డర్‌ పీస్‌ అండ్‌ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్‌) కుదిరింది. అప్పటి నుంచి నేటివరకు భారత్‌ చైనాతో ఇంత స్థాయిలో ఘర్షణ ఎన్నడూ జరగలేదు. చైనా సైన్యం వాస్తవాధీన రేఖ దాటి అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో దాదాపు 440 కి.మీ. భారత్‌ భూభాగంలోకి ప్రవేశించిన అంశాన్ని చైనా ప్రధాని జిన్‌పింగ్‌ భారత దేశ సందర్శనకు వచ్చిన సందర్భంలో ప్రధానమంత్రి మోదీ లేవనెత్తలేదు. సరిహద్దుల్లో రెచ్చగొట్టే వైఖరిని మార్చుకోకుంటే, చైనా నుంచి పెద్దఎత్తున చేసుకొంటున్న దిగుమతులపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించి ఉంటే లాభం ఉండేది. ఇపుడు తీరిగ్గా.. చైనా వస్తువుల్ని బహిష్కరించండి అంటూ ఒకరిద్దరు కేంద్ర మంత్రులు ప్రకటనలు ఇచ్చి గాయపడిన దేశ ప్రజల మనస్సులపై లేపనం పూయడానికి ప్రయత్నిస్తున్నారు.


దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాల దార్శనికమైన విదేశాంగ విధానానికి ఎన్డీఏ తిలోదకాలు ఇచ్చిన ఫలితంగానే నేడు భారత్‌ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. గత ఆరేళ్ళ ఎన్డీఏ పరిపాలనలో విదేశీ విధానపరమైన కార్యక్రమాలు, ప్రధాని విదేశీ పర్యటనలు కేవలం ఇచ్చిపుచ్చుకొనే వ్యక్తిగత వ్యవహారాల స్థాయికి దిగిపోయాయి. మన విదేశీ విధానంలో ఉపఖండంలోని ఇరుగుపొరుగు దేశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ‘‘మీరు కావాలంటే స్నేహితుల్ని మార్చుకోగలరు. కానీ, ఇరుగుపొరుగు వారిని మార్చుకోలేరు’’ అని అన్నారు. పాకిస్థాన్‌తో ఉన్న వైరం కొత్తది కాకపోయినా చారిత్రాత్మకమైన సాంస్కృతిక, దౌత్య సంబంధాలు కలిగివున్న నేపాల్‌, మయన్మార్‌, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలతో గత ఐదేళ్ళలో ఎందుకు దూరం పెరిగిందో ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంది.


ఇండియా, చైనాల మధ్య సంబంధాలు సున్నితమైనవి అనడంలో సందేహం లేదు. ఇరు దేశాలు ప్రపంచంలో ప్రబల ఆర్థిక శక్తులుగా అవతరించడానికి పోటీ పడుతున్నాయి. చైనా ఇప్పటికే ప్రధాన ఆర్థిక శక్తిగా ఉంది. భారత్‌ ఎదుగుదలను చైనా సహించలేకపోవచ్చు. కానీ, భారత్‌ తీసుకొన్న ‘లుక్‌ఈస్ట్‌’ (తూర్పున చూద్దాం) విధానం ద్వారా తూర్పు ఆసియా దేశాలతో పరస్పర అవగాహన, వాణిజ్య వ్యాపార సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం వల్ల చైనాను ఒంటరి చేయగలమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే జపాన్‌తో ఏర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపర్చుకోవాలి. చైనా దిగుమతులను ఒక క్రమ పద్ధతితో తగ్గించుకొంటూ వెళ్లాలి. ఒకప్పటిలా ప్రపంచం రెండు ధృవాలుగా కాక, అనేక ధృవాలుగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సంప్రదాయ భాగస్వాములను దౌత్యపరంగా పోగొట్టుకోకుండా వాటితో సంబంధాలు పటిష్టపర్చుకొని మిగతా దేశాలతో అర్థవంతమైన సంబంధాలు ఏర్పరచుకొంటేనే దేశ భద్రత, రక్షణ, ఆర్థిక ప్రయోజనాలు ఒనగూడుతాయి.

గిడుగు రుద్రరాజు

మాజీ ఎమ్మెల్సీ, ఏఐసిసి కార్యదర్శి

Updated Date - 2020-06-25T06:23:22+05:30 IST