స్వయంసమృద్ధి మోదీ లక్ష్యం

ABN , First Publish Date - 2020-05-27T06:08:48+05:30 IST

కరోనా మహమ్మారితో అతలాకుతలమైన భారతదేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ఉద్దేశంతో భారత ప్రధాని ఆత్మ నిర్భర అభియాన్ పేరుతో 20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో..

స్వయంసమృద్ధి మోదీ లక్ష్యం

దేశీయ మార్కెట్‌ను బలమైన పునాదిగా వాడుకొని అంతర్జాతీయంగా పోటీని తట్టుకొని ఎగుమతులు చేయగలిగే విధంగా భారతీయ వస్తు ఉత్పాదన పరిశ్రమలు అభివృద్ధి చెందిన నాడే ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవటానికి వీలుంటుంది. మోదీ ఆత్మ నిర్భర అభియాన్ ఆర్థిక వ్యవస్థను ఈ దిశగా నడిపిస్తే ఫలితాలు దేశ అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి.


కరోనా మహమ్మారితో అతలాకుతలమైన భారతదేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ఉద్దేశంతో భారత ప్రధాని ఆత్మ నిర్భర అభియాన్ పేరుతో 20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో ఆర్థికంగా పుంజుకోవటానికి దేశ స్వయం సమృద్ధికి కృషి చేయాలని, దానిలో భాగంగా దేశీయ వస్తువులకు గిరాకీ పెరిగే విధంగా ప్రజలు దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులను ఎక్కువగా కొనాలని అన్నారు. ఆర్థిక రంగం, మౌలిక సదుపాయాలు, సాంకేతికతతో ముందుకు నడిచే విధి విధానాలు, పనిచేసే వయసులో ఉండే జనాభా, వస్తువులకు డిమాండ్... ఇవన్నీ ఆత్మనిర్భర్ అభియాన్‌కు ఐదు మూల స్తంభాలు అని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేయడం ఈ అయిదవ మూల స్తంభమైన స్థానిక డిమాండ్ పెరగడానికి తోడ్పడుతుంది. కేవలం స్థానిక ఉత్పత్తుల కొనుగోలు గురించి ప్రస్తావించకుండా ప్రధానమంత్రి ఈ సందర్భంలో మరి రెండు ముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు. ఒకటి: స్థానిక వస్తువుల కొనుగోలు ద్వారా జాతీయ పరిశ్రమకు తోడ్పడటం. ఈ చర్య అంతర్జాతీయ పారిశ్రామిక రంగాల్లో మన వంతు వాటా పొందే విధంగా పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. రెండు: వస్తువుల నాణ్యతపై శ్రద్ధ చూపటం.


ఆత్మనిర్భర అభియాన్ పేరుతో స్వయం సమృద్ధ దేశంగా భారతదేశం అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి పేర్కొనడానికి, కరోనా మహమ్మారి ప్రస్థానానికి సంబంధం లేదు. ఈ విధమైన అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించడానికి గత ఐదు సంవత్సరాలలో ప్రపంచ వాణిజ్య రంగంలో జరుగుతున్న మార్పులే ప్రధానమైన కారణం. 1995వ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచ వాణిజ్యం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందింది. ప్రపంచ వాణిజ్య సంస్థ కనుసన్నలలో కొన్ని విధి విధానాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్యం అభివృద్ధి చెందింది. మొదటిలో ఈ సంస్థలో సభ్యత్వానికి మోజు చూపని చైనా దేశం 2001 నాటికి తాము చేసిన తప్పును గ్రహించి ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం కోసం కృషి చేసి పొందింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రపంచానికి ప్రధాన వస్తు ఉత్పత్తి కేంద్రంగా రూపొందింది.


దీనితో అమెరికా దేశంలో వస్తు ఉత్పాదక రంగంలో ఉద్యోగావకాశాలు బాగా క్షీణించాయి. చైనాలో తయారైన చౌక వస్తువులకు అమెరికా పెద్ద మార్కెట్‍గా తయారైంది. ఆ దేశ ప్రజలలో ఈ పరిణామాలపై ఉన్న వ్యతిరేకతను డోనాల్డ్ ట్రంప్ తనకు పూర్తిగా అనుకూలంగా మలుచుకుని ఉద్యోగ అవకాశాలను దేశంలో పెంచుతానని, పరిశ్రమలు మరలా అమెరికాకు రప్పిస్తానని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు. గత నాలుగు సంవత్సరాలలో ఇదే ధ్యేయంగా కేవలం చైనా వస్తువుల మీదనే కాకుండా, భారతదేశపు వస్తువులపై కూడా సుంకాలను విపరీతంగా పెంచాడు. ప్రపంచ వాణిజ్య సంస్థను నిర్వీర్యం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తి చేయటం ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం సాధ్యం కాకపోవచ్చు. రాను రాను అన్ని దేశాలు దేశీయ పరిశ్రమల రక్షణకు సుంకాలు పెంచే అవకాశాలు జాస్తిగా ఉన్నాయి.


ఈ నేపథ్యంలో నిర్భర భారత్ అభియాన్‍లో భాగంగా ప్రధానమంత్రి స్వయం సమృద్ధి పునాదిగా, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ, ప్రపంచీకరణలో భాగంగా భారతదేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్వీర్యమైనా, ప్రాంతీయ ఆర్థిక సముదాయాల్లో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగే అవకాశం ఉంది. RCEP అనే పేరుతో ఏర్పడిన ఆగ్నేయాసియా దేశాలు, చైనా, జపాన్, ఆస్ట్రేలియా న్యూజిలాండ్‍తో కూడిన ఆర్థిక కూటమిలో చేరవలసిందిగా భారతదేశంపై చాలా ఒత్తిడి ఉన్నది. ఎగుమతులకు అనువైన నాణ్యమైన వస్తువులను తయారుచేసే సామర్థ్యంలేని నాడు ఇటువంటి ఆర్థిక కూటములలో చేరటం వల్ల సరైన ప్రయోజనాలు పొందలేము. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి ఆత్మనిర్భర భారత్ అభియాన్‍లో నాణ్యత యొక్క ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ, అంతర్జాతీయ వాణిజ్యానికి అనువుగా ఉండే స్వయంసమృద్ధి విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.


ఈనాడు మోదీ ప్రతిపాదించిన స్వయం సమృద్ధి విధానం నాటి జవహర్లాల్ నెహ్రూ స్వయం పోషకత (self-sufficiency) విధానానికి భిన్నంగా ఏమీ లేదని కాంగ్రెస్‍ వారు ప్రస్తావించారు. కానీ మౌలికంగా ఈ ఈ రెండు విధానాలు పూర్తిగా భిన్నం. నెహ్రూ స్వయం సమృద్ధి విధానానికి మౌలిక రంగాల్లో ప్రభుత్వ సంస్థలు, వనరుల కేటాయింపుకు కేంద్రీకృత ప్రణాళికా సంఘం రెండూ మూల స్తంభాలు. కమ్యూనిస్టు భావజాలం, సోవియట్ రష్యా విధానాల ద్వారా ప్రభావితమైన నెహ్రూ ఈ రెండు అంశాలకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. మౌలిక రంగాల్లో ఏర్పడిన ప్రభుత్వ సంస్థలు 1990 దశకం నాటికి సరళీకృత ఆర్థిక విధానాన్ని అమలు చేయడం మొదలుపెట్టడంతో పోటీకి తట్టుకోలేక నష్టాల బాటపట్టాయి. ఏకస్వామ్య విధానంలో ఎటువంటి పోటీ లేకుండా ఉన్న వాతావరణంలో మాత్రమే ఈ సంస్థలు పని చేయగలిగాయి. నష్టాలు పెరగటంతో ప్రజాధనాన్ని వీటిపై వెచ్చించడానికి వెనుకాడిన ప్రభుత్వాలు ఈ సంస్థల నుండి ఒక్కొక్కటిగా పెట్టుబడులను ఉపసంహరించడం మొదలెట్టాయి. ఈ ప్రభుత్వ విధానం పార్టీలకతీతంగా ప్రభుత్వ విధానంగా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది.


ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి విధానం చివరకు కోటా లైసెన్స్ పర్మిట్ రాజ్‍గా దిగజారింది. ఆనాడు ప్రభుత్వ విధానాల మూలంగా మౌలిక సంస్థలలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేని ప్రైవేట్ రంగం ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని రక్షిత దేశీయ మార్కెట్‍లో లైసెన్సులు సాధించటం ద్వారా నాణ్యత ప్రాధాన్యం లేని వస్తువుల తయారీ అమ్మకానికి అలవాటు పడిపోయింది. 1990 దశకంలో సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం తయారైనప్పుడు ప్రధానమైన వ్యతిరేకత బాంబే క్లబ్ అనే పేరుతో ఏర్పడిన ఈ దేశీయ పారిశ్రామికవేత్తల నుంచి వచ్చింది. ఈ విధంగా మొదటి అర్ధ శతాబ్దిలోని భారత ఆర్థిక విధానాలు పోటీని సమర్థవంతంగా తట్టుకోలేని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను దేశంలో తయారు చేసాయి. అదే సమయంలో ఎగుమతుల ద్వారా దేశ ప్రగతికి పునాదులు వేసిన జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ లాంటి దేశాలు అనూహ్యమైన ఆర్థిక విజయాలను సాధించాయి. నెహ్రూ ఆరోజు ఆవిష్కరించిన స్వయం సమృద్ధి విధానం పైరెండు కారణాలవల్ల పూర్తిగా విఫలమై 1990 దశకానికి దేశాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వేసింది.


ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ స్వయంసమృద్ధిని ప్రస్తావిస్తూనే, నాణ్యత ప్రాధాన్యాన్ని, అంతర్జాతీయ వాణిజ్యంలో పోటీని తట్టుకునే విధంగా స్వయంసమృద్ధి రూపొందాలని పేర్కొన్నారు. దేశీయ మార్కెట్‌ను బలమైన పునాదిగా వాడుకొని అంతర్జాతీయంగా పోటీని తట్టుకొని ఎగుమతులు చేయగలిగే విధంగా భారతీయ వస్తు ఉత్పాదన పరిశ్రమలు అభివృద్ధి చెందిన నాడే ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవటానికి వీలుంటుంది. మోదీ ఆత్మ నిర్భర అభియాన్ ఆర్థిక వ్యవస్థను ఈ దిశగా నడిపిస్తే ఫలితాలు దేశ అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి.

ఐ.వై.ఆర్. కృష్ణారావు

Updated Date - 2020-05-27T06:08:48+05:30 IST