ప్రజలకు అధికారమే మోదీ లక్ష్యం

ABN , First Publish Date - 2020-11-24T05:48:26+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మౌలికస్థాయి ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఎక్కువ. గ్రామస్థాయి నుంచి అధికార వికేంద్రీకరణ జరిగితేనే...

ప్రజలకు అధికారమే మోదీ లక్ష్యం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలలు కంటున్న అధికార వికేంద్రీకరణ అంటే అవినీతిపరులైన కుటుంబాల చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం కాదు. అభివృద్ధిఫలాలు నేరుగా ప్రజలకు అందాలన్నదే ఆయన స్వప్నం.


ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మౌలికస్థాయి ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఎక్కువ. గ్రామస్థాయి నుంచి అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకుంటాయని, ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉంటుందని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా మౌలికస్థాయి నుంచి బలోపేతం కావడానికి స్థానిక ఎన్నికలు విశేషంగా దోహదం చేస్తాయి. అదే సమయంలో ప్రభుత్వాలు తమ జవాబుదారీతనాన్ని నిరూపించుకోవడానికి కూడా ఈ ఎన్నికలు కారణమవుతాయన్నది విస్మరించలేని వాస్తవం. సుపరిపాలనకు అధికార వికేంద్రీకరణే మూలమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో ప్రకటించారు. మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ నిధుల పంపిణీలో రాష్ట్రాల వాటా పెరుగుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా, వాటిని విజయవంతంగా అమలు చేయాల్సింది రాష్ట్రాలే. కింది స్థాయిలో ప్రజలకు అడుగడుగునా కనిపించేది రాష్ట్రప్రభుత్వాధికారులే. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించి ప్రజలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తే ఆ సంస్థలకు అధిక నిధులు లభిస్తాయి. 15వ ఆర్థికసంఘం స్థానిక సంస్థలకు రూ.90 వేల కోట్లను కేటాయించింది. వీటిలో రూ.60,750 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు, రూ.29,250 కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు చెందుతాయి. రోజురోజుకూ నగరాలకు తరలివస్తున్న జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో వసతులను పెంచేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టణాభివృద్ధిలో మేయర్లకు సాధికారిత కల్పించడం ద్వారా ఆ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉన్నది. కానీ రాష్ట్రాల అధినేతలకు సంకుచిత ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి.


నిజానికి నరేంద్రమోదీ రాజకీయ ప్రయాణమే స్థానిక ఎన్నికల నిర్వహణతో ప్రారంభమైంది. 1995లో బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా ఆయన స్థానిక ఎన్నికల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన కృషి వల్ల గుజరాత్‌లో బిజెపి మొట్టమొదటి సారి ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లను, 193 తాలూకా పంచాయితీలను గెలుచుకుంది. ఆ తర్వాత ఏ రాష్ట్ర బాధ్యతలను అప్పగించినా నరేంద్ర మోదీ అక్కడ కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో బిజెపి ఓటు శాతాన్ని పెంచుతూ వచ్చారు. ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కశ్మీర్‌లో కూడా అధికారాల పంపిణీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా అక్కడ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవచ్చునని భావించి ఆయన అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల్లో కరోనా నేపథ్యంలో స్థానిక పరిస్థితులను బట్టి స్థానిక ఎన్నికల తేదీలను నిర్ణయిస్తున్నారు. రాజస్థాన్‌లో తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్‌కు బిజెపి గట్టి పోటీ ఇచ్చి జైపూర్, జోధ్‌పూర్, కోటా వంటి కీలక ప్రాంతాల్లో ఆధిక్యతను సంపాదించుకుంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బిజెపి ప్రభంజనం వీచింది. మొత్తం 9 మునిసిపల్ కార్పొరేషన్లు పార్టీ కైవసం కాగా కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. దేశంలో ఎక్కడ స్థానిక ఎన్నికలు జరిగినా బిజెపి తన బలమైన ముద్ర వేయగలుగుతోంది.


దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం కిందిస్థాయి అధికార వికేంద్రీకరణ, పరిపాలనలో భాగస్వామ్యం అనేది ఒక స్వప్నంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్థానిక ఎన్నికలను కేవలం ఒకేసారి నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన అయిదేళ్ల పాలనలో కేవలం ఒక్కసారే ఎన్నికలు జరిపించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మూలంగానే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి 2013లో ఎన్నికలు జరిపారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయినా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గత ఆరేళ్లుగా మౌలికస్థాయిలో అధికారం అందుబాటులోకి రాలేదు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 2016లో ఎన్నికల కమిషనర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించినప్పటికీ, అప్పట్లో స్థానిక ఎన్నికల కోసం ఆయన ఎందుకు ఆతురత ప్రదర్శించలేదన్నది అంతుబట్టని విషయం. మరోవైపు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలంటూ హడావిడి మొదలుపెట్టిన జగన్ ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఎన్నికలు జరిపిస్తానంటే ఎందుకు మోకాలడ్డుతున్నారో మరో అంతుబట్టని విషయం. అసలు తన హయాంలో స్థానిక ఎన్నికలు జరిపించకుండా, ఇప్పుడు ఎన్నికలు కావాలని చంద్రబాబు కోరడం విడ్డూరాతి విడ్డూరం. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఒకే ఆలోచనా విధానంతో ఉంటేనే ప్రజలకు ప్రయోజనకరమైన అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. అలా లేనందువల్లే ఆంధ్రప్రదేశ్‌లో సమీప భవిష్యత్‌లో ఎన్నికలు జరిగేలా లేవు. రెండింటి మధ్య ఉన్న అనారోగ్యకరమైన సంఘర్షణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అందకుండా చేస్తోందనేది నిర్వివాదాంశం. అధికార వికేంద్రీకరణ జరగకపోవడం వల్ల అధికారం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడం, జవాబుదారీతనానికి ఆస్కారం లేకుండా పోవడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి అదే అవసరమేమో?! 


విచిత్రమేమంటే తెలంగాణలో ఉన్నట్లుండి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫార్మ్‌హౌజ్ నుంచి నిద్ర లేచి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. కెసిఆర్ కంచుకోట దుబ్బాకలో బిజెపి అఖండ విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతలకు కాషాయం చూస్తేనే వణుకు పుట్టుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఉన్నట్లుండి ఎన్నికల తేదీలను హడావిడిగా ప్రకటించి, నామినేషన్లకు పెద్దగా సమయం ఇవ్వకుండా నెలరోజుల వ్యవధిలోపే ఎన్నికల తతంగాన్ని ముగించాలని నిర్ణయించిన తీరు చూస్తే దుబ్బాక నిజంగానే షాక్ కలిగించినట్లు స్పష్టమవుతోంది. లేకపోతే ప్రత్యర్థులకు సమయం ఇవ్వకుండా ఎన్నికలను హడావిడిగా ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏముంటుంది? భారీ వర్షాలు, వరదలకు గురై జనజీవనం అస్తవ్యస్తమై ఉన్న సమయంలో ప్రజలను స్వయంగా కలుసుకోకుండా, వారి రోదనల్లో పాలు పంచుకోకుండా ఉన్న ముఖ్యమంత్రి అకస్మాత్తుగా ఇంటికి పదివేల రూపాయలిస్తానని ప్రకటించడం, ఆస్తిపన్నులో సగం రాయితీ కల్పించడం, ఆ తర్వాతే ఎన్నికలు ప్రకటించడం చూస్తే ప్రజలు అర్థం చేసుకోకుండా ఎలా ఉంటారు? అంతేకాదు, ఎన్నికల మధ్యలో మేనిఫెస్టో విడుదల పేరిట ఉచిత నీరు అందిస్తామని, కొన్ని వర్గాలకు ఉచిత విద్యుత్ కల్పిస్తామని కేసిఆర్ సోమవారం ప్రకటన చేసిన తీరు ఆయనకు బిజెపి పుట్టించిన చలిజ్వరానికి నిదర్శనం. తెలంగాణ ప్రజలకు కేసిఆర్ బూటకపు వాగ్దానాలు చేయడం, మాయమాటలతో నమ్మించడం ఇప్పటికే చాలాసార్లు అనుభవైకవేద్యమైంది. ఈ వాగ్దానాలను నమ్మి ప్రజలు ఆయనకు ఓటు వేసి కుటుంబానికి పాలన అప్పగిస్తారనుకోవడం అవివేకం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలలు కంటున్న అధికార వికేంద్రీకరణ అంటే అవినీతిపరులైన కుటుంబాల చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం కాదు. అభివృద్ధిఫలాలు నేరుగా ప్రజలకు అందాలన్నదే ఆయన స్వప్నం.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2020-11-24T05:48:26+05:30 IST