ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి సాయం

ABN , First Publish Date - 2021-08-03T08:27:28+05:30 IST

ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన మహ్మద్‌ షబ్బీర్‌ (26) కుటుంబానికి ..

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి సాయం

రూ.2 లక్షలు అందించిన బీజేపీ నేత ఈటల 

మృతుడు షబ్బీర్‌ భార్యకు ఎమ్మెల్సీ పల్లా, 

ఎమ్మెల్యే సుంకె రూ.3 లక్షల సాయం 

రూ.50 వేలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో165మంది నిరుద్యోగుల బలవన్మరణం

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి


హుజూరాబాద్‌, జమ్మికుంట, ఉప్పల్‌, ఆగస్టు 2: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడుకు  చెందిన మహ్మద్‌ షబ్బీర్‌ (26) కుటుంబానికి సోమవారం బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్థికసాయం అందజేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రూ.2లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ద్వారా అందించారు. టీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకెరవి శంకర్‌లు షబ్బీర్‌ భార్యకు రూ.3లక్షలు అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి.. రూ.50వేల సాయం చేశారు.  


కలలు కల్లలై...

ఐటీఐ, డిగ్రీ చదివిన షబ్బీర్‌ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని కలలు కన్నాడు. పది నెలల క్రితం జమ్మికుంటకు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది నెలలు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో పని చేశాడు. అయితే, చాలీచాలనీ వేతనంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ప్రస్తుతం జమ్మికుంటలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని, ఇక తనకు ఉద్యోగం వచ్చే పరిస్థితులు లేవని తరుచూ స్నేహితులతో చెప్పి బాధ పడేవాడు. ఈ తరుణంలో తీవ్ర మనస్తాపానికి గురైన షబ్బీర్‌ ఆదివారం ఉదయం జమ్మికుంట రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులకు షబ్బీర్‌ జేబులో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది.  అందులో తన బాధను షబ్బీర్‌ వెల్లడించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశపడ్డా. మా అమ్మ, నాన్న నన్ను ఎంతో కష్టపడి చదివించారు. కానీ, ఉద్యోగం రాలేదు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసీచూసీ నా వయస్సు కూడా మీరిపోయేలా ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా చావు ఒకటే మార్గం అనిపించింది. అందుకే చనిపోతున్నా. నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న నా భార్యకు సారీ’’ అని పేర్కొన్నాడు. 


హుజూరాబాద్‌లో రాస్తారోకో

షబ్బీర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని నిరుద్యోగ ఓయూ జేఏసీ చైర్మన్‌ మానవతరాయ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో షబ్బీర్‌ ఆత్మహత్యను నిరసిస్తూ  రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి రూ. 50లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 


ఓయూలో కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం 

మహ్మద్‌ షబ్బీర్‌ ఆత్మహత్యకు నిరసనగా ఓయూ బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఓయూలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.  ఇప్పటికైనా ప్రభుత్వం ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, షబ్బీర్‌ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని నాయకులు డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-08-03T08:27:28+05:30 IST