Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇద్దరిలో ఎవరు?

సిరాజ్‌ స్థానం కోసం 

ఇషాంత్‌ x ఉమేశ్‌ 

కేప్‌టౌన్‌: గాయంతో బాధపడుతున్న టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టులో ఆడేది సందేహమే.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యాఖ్యలను బట్టి అతడు కోలుకునేందుకు ఇంకా సమయం పడుతుందనే విషయం అర్థమవుతోంది. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న సిరాజ్‌ రెండో టెస్టులో 15.5 ఓవర్లు మాత్రమే వేశాడు. అయితే ఈనెల 11 నుంచి జరిగే సిరీస్‌ నిర్ణాయక చివరి టెస్టులో సిరాజ్‌ స్థానంలో ఎవరిని బరిలోకి దించుతారనేది చర్చనీయాంశమవుతోంది. అత్యంత అనుభవం కలిగిన ఇషాంత్‌ శర్మ.. అద్భుత అవుట్‌ స్వింగర్లతో బ్యాటర్స్‌ను బెంబేలెత్తించే ఉమేశ్‌ యాదవ్‌ ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. 33 ఏళ్ల ఇషాంత్‌ ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. కానీ, వందకు పైగా టెస్టులు ఆడిన అతడి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఇక.. 34 ఏళ్ల ఉమేశ్‌ 51 టెస్టులు ఆడగా.. ఇషాంత్‌తో పోలిస్తే గత మ్యాచుల్లో మెరుగ్గానే రాణించాడు. కానీ కోచ్‌ ద్రవిడ్‌తో పాటు కెప్టెన్‌ విరాట్‌ కూడా పలు కారణాలతో ఈ ఇద్దరిలో ఇషాంత్‌ వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.


ముఖ్యంగా ఆరు అడుగుల 3 అంగుళాల ఎత్తు కలిగిన ఈ ఢిల్లీ పేసర్‌ లెంగ్త్‌ బంతులు ప్రొటీస్‌ బ్యాటర్స్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే ఆతిథ్య జట్టులో ఆరు అడుగులకు మించి ఎత్తు కలిగిన జాన్సెన్‌, ఒలివియెర్‌ రెండో టెస్టులో వికెట్ల పండుగ చేసుకున్నారు. వారి బౌలింగ్‌లో బంతి అనూహ్యంగా బౌన్స్‌ అయి బ్యాటర్స్‌ కుదురుకునేందుకు కష్టమయ్యింది. అందుకే రెండో టెస్టులో భారత్‌ నుంచి పొడగరి పేసర్‌ లేకపోవడం నష్ట పరిచిందని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డాడు. అలాగే మూడో టెస్ట్‌ వేదికైన న్యూలాండ్స్‌ స్టేడియం సముద్రం పక్కనే ఉండడంతో అధిక గాలులు వీస్తుంటాయని, అప్పుడు బంతి గమనం మరింత ఎక్కువగా ఉంటుందని, ఇది ఇషాంత్‌లాంటి బౌలర్లకు లాభిసుందని మాజీ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా తెలిపాడు. ఏదిఏమైనా అటాకింగ్‌ బౌలింగ్‌కైనా.. డిఫెన్సివ్‌ బౌలింగ్‌కైనా ఇషాంత్‌ను తీసుకుంటేనే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement