సంక్లిష్ట జీవితానికి సంగీతం నేర్పే కవి మోహన్‌ రుషి

ABN , First Publish Date - 2020-11-02T06:24:15+05:30 IST

విచ్చుకున్న పూలని, రాలుతున్న ఆకుల్ని ఒకేలా చూడగలగడం తాత్వికునికి మాత్రమే వీలవుతుంది. అదే సమయంలో బతుకు మాధుర్యాన్ని...

సంక్లిష్ట జీవితానికి సంగీతం నేర్పే కవి మోహన్‌ రుషి

సంక్లిష్ట జీవితానికి సంగీతం నేర్పే కవి : మోహన్‌ రుషి

విచ్చుకున్న పూలని, రాలుతున్న ఆకుల్ని ఒకేలా చూడగలగడం తాత్వికునికి మాత్రమే వీలవుతుంది. అదే సమయంలో బతుకు మాధుర్యాన్ని నెమరు వేయడం భావుకుడైన కవికే వీలవుతుంది. మొత్తం మీద మోహన్‌ రుషి తాత్విక కవి లేదా కవి తాత్వికుడు. ఆయన సామాజికుడే కానీ సామాజిక కవి కాడు. సమాజాన్ని సమూలంగా మార్చి మరమ్మత్తు చేద్దామనే పట్టుదల లేని ఆరోగ్యవంతుడైన కవి. 


జీవితం ముందు వెనకల పేజీలు చింపిన పుస్తకం లాంటిది, అన్నాడో పర్షియన్‌ కవి. మోహన్‌ రుషి భావుకుడు, తాత్వికుడు. జీవితాన్ని, ప్రత్యేకించి నగర జీవితాన్ని గాఢంగా ప్రేమించి, పరిశీలించిన కవి అతను. జీవితానికి సంబంధించి తాత్విక దృష్టి ఆయనది. జీవితాన్ని ఆమోదించడం ఆయనకు తెలుసు. సంఘర్షించడం ఆయన తత్వం కాదు. సంక్లిష్ట జీవితాన్ని సరళంగా సందర్శించడం తెలిసినవాడు.


కవిత్వమంటే అలంకారాల, ఆడంబరాలతో నిండిందన్న భ్రమ చాలామందికి ఉంటుంది. ప్రాచీన ఆలంకారికుడైన ఆనంద వర్ధ నుడు ‘‘వాక్యం రసాత్మకమ్‌ కావ్యం’’ అన్నాడు. మోహన్‌ రుషి జీవితాన్ని... వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని అనాయాసంగా సరళమైన మాటలతో ఆవిష్కరించి మనల్ని ఆశ్చర్యానికి లోను చేస్తాడు. మామూలు మాటలు అతని చేతిలో మధుర పరిమళా లను, మంద్ర గానాన్ని ఆవిష్కరిస్తాయి. ఎక్కడా ఘర్షణ పడడం, నిరాశా ఉండదు. 


‘సెల్ఫీ’ అన్న కవితలో కవి మనముందు నిలుస్తాడు: ‘‘బాల్కనీలో ఉన్నా బతుకులోని మాధుర్యాన్ని నెమరేస్తున్నా/ గాలికి ఊగుతున్న పువ్వుల్నీ, రాలి పడుతున్న ఆకుల్నీ ఒకే ప్రేమతో చూస్తున్నా// చెప్పడానికి ఏమీలేదని స్పష్టమవు తున్నా... నన్ను నేను పిల్చుకుంటున్నా’’ విచ్చుకున్న పూలని, రాలుతున్న ఆకుల్ని ఒకేలా చూడగల గడం తాత్వికునికి మాత్రమే వీలవుతుంది. అదే సమయంలో బతుకు మాధుర్యాన్ని నెమరు వేయడం భావుకుడైన కవికే వీలవుతుంది. మొత్తం మీద మోహన్‌ రుషి తాత్విక కవి లేదా కవి తాత్వికుడు. ఆయన సామాజికుడే కానీ సామాజిక కవి కాడు. సమాజాన్ని సమూలంగా మార్చి మరమ్మత్తు చేద్దామనే పట్టుదలలేని ఆరోగ్యవంతుడైన కవి. ‘స్క్వేర్‌ వన్‌’ అన్న కవితలో: ‘‘ఎదురయ్యే వాళ్ళలో ఒక్కడూ నీ మనిషి కారు, ఎన్నిసార్లని వెనక్కి తిరిగి చూస్తావు?// ప్రతిరోజూ ముందు రోజే. తిరగ బెట్టడమే తప్ప చేయాల్సిందేమిటో నొప్పికీ తెలీదు.// చివరి నిశ్శబ్దం కూడా మలుపు మొదట్లోనే తెలిసి....’’


మోహన్‌ రుషి నగర కవి. సూర్యోదయాల, సూర్యాస్తమయాల జాడలు కనిపించని నగర జీవితంలోని కవి. యాంత్రికతలో వుంటూ కూడా తనకూ నగరానికి కుదరని లంకెతో అల్లాడే కవి. కావలసినంతమంది మనుషులు, కానీ వాళ్ళలో తన వాడంటూ ఎవరూ కనిపించరు. ప్రతిరోజూ తిరిగి తిరిగి వస్తుంది, తిరగబెడుతుంది. ఒకసారి ఓషో ఆనాటి తన గ్రామం గురించి చెబుతూ ‘‘in my village there is no school, no rail, no bus, no paper, no current... what a blessing'' అన్నాడు. అవిలేని జీవితం మనకు లేదు కదా! 


ఆనంద స్థితి గురించి మోహన్‌ రుషి అపూర్వ భావన చూడండి: ‘‘ఆనందంగా ఉన్నపుడు నువ్వు వేరుగా ఉంటావు. వేల వెలుగులు విరజిమ్ముతూ ఉంటావు// అపరిచితుడితోనూ మాట్లాడతావు// అకస్మాత్తుగా జీవితం అధీనంలోకి వచ్చిన ట్లుగా తుళ్ళిపడతావు// ఆనందంగా ఉన్నపుడు నువ్వు అమ్మకు చాలా దగ్గరగా కూర్చుంటావు.’’


మనసు అద్దం లాంటిది. అహంకారపు ధూళి తొలగిపోతే అంతా ఆనందమయమే. కవి సమస్త సృష్టి పట్ల అంతులేని ప్రేమతో కరిగిపోతున్నాడు. తనలో అన్నీ ఉన్నాయి, అన్నిటిలో తను వున్నాడు. అందుకే అపరిచితుడ్ని కూడా ఆత్మీయంగా పలకరిస్తున్నాడు. అనాది నించి మాలిన్యం అంటని వ్యక్తి అమ్మ మాత్రమే. ఇట్లాంటి ఆనంద స్థితి అమ్మకు దగ్గరగా ఉండడం లాంటిది.


మోహన్‌ రుషి తన ముందు పరచిన అనంత ప్రకృతిని ఆత్మీయంగా భావిస్తాడు. కానీ కుటుంబం, స్నేహం, చుట్టు పట్ల ఉన్న మనుషులు, వీళ్ళ మధ్య సంభవించే ఆనందాలు, కన్నీళ్లు... వీటికి ప్రాధాన్యమిస్తాడు. ఏదో సమస్య వస్తుంది, జీవితాన్ని నిలదీస్తుంది: ‘‘సామరస్యం కుదరదు, తన్కులాట ఆగదు. ఇక జీవితం ముందుకు సాగదేమోనన్న ఉక్కపోత// ఈ సమయాన్ని ఇలాగే వెళ్ళిపోనివ్వాలి’’ అవును. బతుకులో పరిష్కరించలేని సమస్యలు వచ్చిపడ తాయి, వాటిని పరిష్కరించలేం. మనం చేయాల్సిందల్లా సాక్షీ భూతంగా వుండడం ఒక్కటే అంటున్నాడు కవి. ఎంత నిల దొక్కుకుందామనుకున్నా, తాత్వికమార్గంలో సాగుదామనుకున్నా, జీవితం వదిలి పెట్టదు. మాడు పగలగొడుతుంది: ‘‘క్షణాలు నిప్పులు పోస్తాయి, సమయాలు శపిస్తాయి. నువ్వు నువ్వుగా ఉండడం నిన్ను ఈడ్చి తంతుంది. నీడకూ, నీకూ మధ్యన అనుబంధమేమీ లేదని తేటతెల్లమవుతుంది. హౌలా గాళ్లకు కూడా ఈ భూమి మీద చోటుందనే ఒకేఒక్క నిజం మాత్రమే రేపటికి నిన్ను నిలబెడుతుంది’’

చివరి వాక్యం చదివితే జర్మన్‌ మహాకవి గోతే బాల్యంలో పోర్చుగీసులోని లిస్బన్‌ నగరంలో భూకంపం వచ్చి ఎంతోమంది చనిపోతే, ఆయన ‘‘దయామయుడైన దేవుడు ఎందుకీ ఉత్పాతాలు సృష్టిస్తాడు’’ అనుకొన్నాడన్న సంగతి గుర్తుకొస్తుంది. నిజమే! పరి స్థితులు మనల్ని మనలా వుండనివ్వవు. ఆందోళన తప్పదు, ఆరాటం తప్పదు. శ్రీశ్రీలా ‘‘ఒక సకలాతీత శక్తి వున్నట్టా? లేనట్టా?’’ అనుకోవాల్సివుంటుంది. అనుభవాల్ని, అనుభూతుల్ని సున్నితంగా పరిశీలిస్తూ, సుకుమారంగా కవిత్వీకరిస్తూ కవి సాగుతాడు.


జీవితపు లోతులు తెలిసిన కవి ప్రచారాలకు ప్రలోభాలకు దూరంగా ఉంటాడు. ఆస్కార్‌ వైల్డ్‌ ‘‘ఎట్లాంటి ప్రచారమైనా పాపమే’’ అన్నాడు. గోతె మహాకవి ‘‘అజ్ఞాతంగా ఉండడంలో ఆనందముంది’’ అన్నాడు. పూలని, ముళ్లని పట్టించుకోకుండా ప్రశాంతంగా ముందుకు సాగుతున్న ప్రతిభావంతుడైన కవి మోహన్‌ రుషి.

సౌభాగ్య

98481 57909


Updated Date - 2020-11-02T06:24:15+05:30 IST