ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2020-05-13T06:31:54+05:30 IST

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కరోనా కారణంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులు

ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు

ఇప్పటికే 1,87,088 మెట్రిక్‌ టన్నుల సేకరణ 

రైతుల ఖాతాల్లో 146.21 కోట్ల రూపాయలు జమ


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కరోనా కారణంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులు ఎక్కడివారు అక్కడే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. గ్రామాలవారీగా రైతులకు మార్కెట్‌కు ధాన్యం తీసుకురావలసిన తేదీలను ముందుగానే సూచించడంతో ధాన్యం సేకరణ సాఫీగా సాగుతున్నది. గత యాసంగిలో జిల్లాలో 1.21 లక్షల ఎకరాలలో వరిసాగు జరుగగా, 2.27 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈసారి విస్తారంగా వర్షాలు కురవడం, కాళేశ్వరం ప్రాజెక్టు నీరు అన్ని చెరువులు, కుంటలతోపాటు ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు డ్యాంలకు చేరుకోవడంతో యాసంగిలో వరి సాగు పెరిగింది. జిల్లాలో 2.19,066 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా రికార్డు స్థాయిలో 5.30 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.  రైతులు తమ అవసరాలకు కొంత ధాన్యాన్ని ఉంచుకోగా సుమారు 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావించారు. 


జిల్లాలో 338 కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో 313 గ్రామపంచాయతీలు ఉండగా 338 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 216 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ద్వారా 79 కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా 41 కొనుగోలు కేంద్రాలు, మెప్మా, హాకా ద్వారా ఒక్కొక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఈనెల 10వ తేదీ వరకు 1,87,088 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారు. 31,658 మంది రైతులు 343 కోట్ల 22 లక్షల రూపాయల విలువ చేసే ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారు. ఇప్పటి వరకు ఆయా కొనుగోలు కేంద్రాల్లో 20,060 మందికి రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ ధాన్యం విలువ 250.43 కోట్లు అయితే 14,005 మంది రైతులకు 146 కోట్ల 21 లక్షల రూపాయలను ఇప్పటి వరకే వారివారి ఖాతాల్లో జమచేశారు.


డేటా నమోదు చేసిన 6,055 మంది రైతులకు 104.22 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు 1,15,894 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 52,383 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 41 డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా 16,106 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మెప్మా 1546 మెట్రిక్‌టన్నులు, 1158 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని హాకా కొనుగోలు చేసింది. మార్కెట్‌ యార్డుల్లో ఇబ్బంది కలుగకుండా చూసేందుకు, అకాల వర్షాలతో కొనుగోలు చేసిన ధాన్యం తడిచిపోకుండా చూసేందుకు వెంటవెంటనే రైసు మిల్లులకు రవాణా చేస్తున్నారు.


ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 1,87,088 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి గాను 1,83,620 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించారు. మరో 3,468 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తరలించాల్సి ఉన్నది. ధాన్యం అమ్మిన 48 గంటల్లో వాటి తాలూకూ డబ్బును ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆమేరకు వెంటవెంటనే డబ్బు ఖాతాల్లో జమచేస్తూ వర్షాకాలం సాగుకు పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.  తాలు పేరిట క్వింటాల్‌కు 5 కిలోల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో, రైసు మిల్లుల వద్ద కోత విధిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. తాలు పేరిట విధిస్తున్న కోతను ఆపేయాలని డిమాండ్‌ చేస్తూ పలు కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొనాలని రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2020-05-13T06:31:54+05:30 IST