మంజీర పరీవాహకంలో ఊపందుకున్న వరినాట్లు

ABN , First Publish Date - 2021-01-10T05:39:32+05:30 IST

మండలంలోని మంజీరా పరీవాహకంలో వరినాట్లు ఊపందుకున్నాయి. ఈ ప్రాంతం కింద దాదాపు పదివేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నట్టు సమాచారం.

మంజీర పరీవాహకంలో ఊపందుకున్న వరినాట్లు
కొల్చారంలో వరినాట్లు వేస్తున్న కూలీలు

ఎకరా కూలి ఖర్చు సుమారు రూ. 8వేలు 

ఇతర మండలాల నుంచి వస్తున్న కూలీలు 

ఆటోల్లో తరలింపు భారం రైతులపైనే

కొల్చారం, జనవరి 9: మండలంలోని మంజీరా పరీవాహకంలో వరినాట్లు ఊపందుకున్నాయి. ఈ ప్రాంతం కింద దాదాపు పదివేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నట్టు సమాచారం. ఖరీఫ్‌ సీజన్‌లో భారీ వర్షాలతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లగా, బోరుబావుల్లో నీటిమట్టం పెరిగింది. గతంలో  ఎన్నడూ లేనివిధంగా ఈసారి వరిసాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. కొల్చారం మండల పరిధిలోని యనగండ్ల, మాందాపూర్‌, పైతర, కోనాపూర్‌, తుక్కాపూర్‌, రంగంపేట, సంగయ్యపేట, చిన్నఘణపూర్‌ గ్రామాల్లో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వివిధ మండలాల నుంచి కూలీలు పెద్దఎత్తున వస్తున్నారు. గతంలో కన్నా కూలీల ధరలు రెండింతలు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా మంజీరా నుంచి సాగునీరు నిత్యం పంట పొలాల్లో చేరుతుంది. రైతులు వరినారు పనుల్లో బిజీగా ఉన్నారు. 


 కూలి ఖర్చులు తడిసిమోపెడు

మండలంలో అత్యధికంగా వరిసాగు చేయడంతో కౌడిపల్లి, చిల్‌పచెడ్‌, పెద్దశంకరంపేట మండలాల నుంచి భారీగా ఆటోల్లో కూలీలు వస్తున్నారు. ఆటో చార్జీలు కూడా చెల్లించాల్సిరావడంతో  ఎకరాకు రూ.8 వేల వరకు ఖర్చు అవుతున్నదని రైతులుపేర్కొంటున్నారు. 


సింగూరు జలాలు వచ్చాకే ఘణపురం ఆనకట్ట కింద నాట్లు

సింగూరు జలాలు వచ్చాకే ఘణపురం ఆనకట్ట కింద వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం చలి తీవ్రంగా ఉండడంతో నారుమళ్లు పెరగక రైతుల్లో కొద్దిమేర నిరాశను నింపింది. ప్రభుత్వం 10 దఫాలుగా నీరు  అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

 

Updated Date - 2021-01-10T05:39:32+05:30 IST