ఇంటి చిట్కాతో కుమార్తె తలలో చుండ్రు పోగొట్టి... ఇప్పుడు నెలకు రూ. 10 లక్షల ఆదాయం!

ABN , First Publish Date - 2021-03-09T15:38:51+05:30 IST

కేరళలోని తిరువనంతపురానికి చెందిన విద్యా ఎంఆర్(42) ఇప్పుడు...

ఇంటి చిట్కాతో కుమార్తె తలలో చుండ్రు పోగొట్టి... ఇప్పుడు నెలకు రూ. 10 లక్షల ఆదాయం!

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురానికి చెందిన విద్యా ఎంఆర్(42) ఇప్పుడు మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగి, పలువురికి స్ఫూర్తినిస్తున్నారు. కంప్యూటర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆమె రెండేళ్ల క్రితం హెయిర్ ఆయిల్ స్టార్టప్ ప్రారంభించారు. ఈ రోజు ఆమె పాతికకు పైగా ఉత్పత్తులు తయారుచేసే స్థాయికి ఎదిగారు. ఆమె తయారు చేసిన ఉత్పత్తులు అమెరికాతో పాటు మరో ఏడు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ వ్యాపారం చేపట్టిన విద్య ఇప్పుడు నెలకు రూ. 10 లక్షలకుపైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. 


 ఈ సందర్భంగా విద్య మీడియాతో మాట్లాడుతూ గతంలో నేనెప్పుడూ బిజినెస్ గురించి ఆలోచించనేలేదు. సాధారణ జీవితాన్నే గడిపేదాన్ని. అయితే నా కుమార్తె తన తలలో చండ్రు ఏర్పడటంతో తీవ్రంగా బాధపడేది. విపరీతమైన చుండ్రు కారణంగా నా కుమార్తెను స్కూలులోని పిల్లలు ఏడిపించేవారు. నా కుమార్తె చుండ్రు పోగొట్టేందుకు పలు రకాల షాంపూలు వాడినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఎంతకాలమైనా చుండ్రు తగ్గలేదు. ఈ సమస్య పరిష్కారం కోసం మా అమ్మను సంప్రదించాను. మా అమ్మ చుండ్రుకు పరిష్కారంగా ఒక సంప్రదాయ విధానాన్ని తెలిపారు. మా అమ్మ చెప్పిన విధంగా కొబ్బరి పాలు, అలోవెరా, గూస్ బెర్రీ, మందార మొదలైనవ్నీ కలిపి హెయిర్ ఆయిల్ తయారు చేశాను. దీనిని తయారు చేసేందుకు మూడు గంటల సమయం పట్టింది. దానిని నా కుమార్తె తలకు రాశాను. అది ఎంతో చక్కగా పనిచేసింది. కొద్దిరోజుల్లోనే నా కుమార్తె తలలోని చుండ్రు మాయమైపోయింది. నా కెంతో ఆశ్చర్యంగా అనిపించింది. నా కుమార్తెను గమనించినవారంతా ఆ హెయిర్ ఆయిల్ గురిచి అడగసాగారు. వారు కూడా ఈ హెయిర్ ఆయిల్ వాడి మంచి ఫలితాన్ని పొందారు. దీంతో 2018లో నా స్నేహితురాలి సాయంతో బ్యాంకు నుంచి రుణం తీసుకుని హెయిర్ ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించాను. సోషల్ మీడియా ద్వారా హెయిర్ ఆయిల్ గురించి ప్రచారం చేస్తూ, పలు రీతుల్లో విక్రయాలు సాగిస్తూ, మంచి ఆదాయాన్ని పొందుతున్నానని విద్య తెలిపారు.

Updated Date - 2021-03-09T15:38:51+05:30 IST