ఊపందుకున్న వైద్య కళాశాల పనులు

ABN , First Publish Date - 2021-12-07T03:49:23+05:30 IST

జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల పనులు వేగం పుంజుకున్నాయి. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో ఆర్‌అండ్‌బీ అధికారులు తాత్కాలిక తరగతి గదుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రూ.14 కోట్ల అంచనాతో మార్కెట్‌ యార్డు ఆవరణలోని ధాన్యం నిలువ చేసే గోదాములో తరగతి గదులకు అవసరమైన విధంగా మార్పులు చేర్పులు చేపడుతున్నారు.

ఊపందుకున్న వైద్య కళాశాల పనులు
నిర్మాణ దశలో ఉన్న వైద్య కళాశాల తరగతి గదులు

కొనసాగుతున్న తరగతి గదుల నిర్మాణం

వైస్‌ ప్రిన్సిపాల్‌ సహా అధ్యాపక నియామకాలు పూర్తి

ఎన్‌ఎంసీ తనిఖీలతో అప్రమత్తమైన ప్రభుత్వం

వచ్చే ఏడాది ప్రారంభంకానున్న తరగతులు

మంచిర్యాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల పనులు వేగం  పుంజుకున్నాయి. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో ఆర్‌అండ్‌బీ అధికారులు తాత్కాలిక తరగతి గదుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రూ.14 కోట్ల అంచనాతో మార్కెట్‌ యార్డు ఆవరణలోని ధాన్యం నిలువ చేసే గోదాములో తరగతి గదులకు అవసరమైన విధంగా మార్పులు చేర్పులు చేపడుతున్నారు. ల్యాబ్‌ సౌకర్యంతోపాటు గదుల్లో ఏసీ ఏర్పాటుకు సీలింగ్‌ పనులు చేపడు తున్నారు. నీటి సరఫరా, విద్యుత్‌ సౌకర్యంతోపాటు అవసరం మేరకు నూతన గదుల నిర్మాణానికి కందకాలు తవ్వుతున్నారు. ఆరు నెలల గడువులో కళాశాల నిర్వహణకు అవసరమైన పనులు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది తరగతులు ప్రారంభం అయ్యే నాటికి   అన్ని సౌకర్యాలు కల్పించాలని అదేశాలు జారీ కావడంతో ఆ దిశగా సంబంధిత అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. 

ఎన్‌ఎంసీ తనిఖీలతో అప్రమత్తం

వైద్య కఽళాశాలలో తరగతులు ప్రారంభించాలంటే జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మంచిర్యాలలో వైద్య కళాశాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ వైద్య మండలికి దరఖాస్తు చేసింది. వైద్య కళాశాల ఏర్పాటుకు అనువైన వసతులు, తరగతి గదులు, ఇతర నిర్మాణాలను తనిఖీ చేసేందుకు ఈ నెలలోనే ఎన్‌ఎంసీ బృందాలు ఆకస్మిక తనిఖీలకు రానుండటంతో రాష్ట్ర వైద్య విద్య విభాగం అప్రమత్తమైంది. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అధ్యాపకులు, సిబ్బంది నియామకం, ఇతర ఏర్పాట్లు పూర్తి కావాలి. అప్పుడే అడ్మిషన్ల స్వీకరణ, తరగతుల ప్రారంభానికి అనుమతులు లభిస్తాయి. లేని పక్షంలో లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌ఓపీ) జారీ చేయదు. దీంతో తాత్కాలికంగా వైస్‌ ప్రిన్సిపాల్‌, ఇతర సిబ్బందిని నియాకం చేపట్టినట్లు తెలుస్తోంది. 

పూర్తయిన నియామకాలు

వైద్య కళాశాల బోధన సిబ్బందిని వైద్య విద్య సంచాలకులు పూర్తి చేశారు. వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌గా అనాటమీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రసన్న వీరకుమార్‌ నియమితులయ్యారు. ఆయనతోపాటు బోఽధన కోసం మరో నలుగురిని నియమించారు. వీరిలో అసోసియేట్‌ అనాటమీ ప్రొఫెసర్‌ ఒకరు, అనాటమీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇద్దరు, బయోకెమిస్ట్రి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఒకరు నియమితులయ్యారు. వీరితోపాటు వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా ఉన్న 6గురు, మరో 23 మంది రెసిడెంట్‌ డాక్టర్లు నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య విద్య సంచాలకులు ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఇతర సిబ్బంది నియామకం త్వరలో చేపట్టనున్నట్లు సమాచారం. మొత్తంగా ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలు చేపట్టేలోపే వైద్య కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర వైద్య విద్య సన్నాహాలు చేస్తోంది. 

వచ్చే ఏడాదిలోనే తరగతులు...!

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటుకానున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జూన్‌, జూలైలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు స్వీకరించి, తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర వైద్య విద్య అధికారులు సన్నాహాలు చేస్తోంది. ఈ లోపు తరగతుల బోధనకు అవసరమైన వసతులు, పరికరాలు, ఇతర ఏర్పాట్లు చేపట్టనున్నారు.  

Updated Date - 2021-12-07T03:49:23+05:30 IST