వానాకాలం పంటలు.. గాల్లో దీపాలు

ABN , First Publish Date - 2020-09-24T09:27:22+05:30 IST

ఎడతెరిపిలేకుండా పడుతున్న వానలతో నష్టం జరుగుతున్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందా? లేదంటే పంటలకు పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసినట్లేనా? బాధిత రైతుల్లో ఇప్పుడిదే

వానాకాలం పంటలు.. గాల్లో దీపాలు

కాలగర్భంలో కలిసిన పంటల భీమా పథకాలు

2015 వరకు మూడు స్కీంలు

4ఏళ్ల నుంచి పీఎంఎ్‌ఫబీవై

ఆ పథకం నుంచి వైదొలగిన రాష్ట్రం

రైతుల కొంపముంచుతున్న అతివృష్టి   

ఈ సారి 5.5 లక్షల ఎకరాల్లో నష్టం

పరిహారంపై స్పందించని  ప్రభుత్వం


హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపిలేకుండా పడుతున్న వానలతో నష్టం జరుగుతున్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందా? లేదంటే పంటలకు పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసినట్లేనా? బాధిత రైతుల్లో ఇప్పుడిదే ఆలోచన.. ఆవేదన! రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం.. పంటల నష్టం, పరిహారం పంపిణీపై  ఏమాత్రం స్పందించడం లేదు. నాలుగేళ్లపాటు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం(పీఎంఎ్‌ఫబీవై) నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగటంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఈ పథకంపై ధ్యాసతో గతంలో 2015 వరకు అమలుచేసిన ’ఎన్‌ఏఐఎ్‌స’(నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌), ’ఎంఎన్‌ఏఐఎ్‌స’(మాడిఫైడ్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌), ’డబ్లూబీసీఐఎస్‌’ (వెదర్‌బే్‌సడ్‌ క్రాప్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌)లను 2016 నుంచి పక్కనబెట్టారు.


ఇప్పుడు ఏకంగా పీఎంఎ్‌ఫబీవై పథకానికి కూడా చరమగీతం పాడటంతో వానాకాలంలో సాగుచేసిన పంటలు కాస్తా గాలిలో దీపంలా తయారయ్యాయి. ఐదేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రధానంగా మూడు పంటల బీమా పథకాలను అప్పటి ప్రభుత్వాలు అమలుచేశాయి. ఉమ్మడి ఏపీలో అమలుచేసిన ’ఎన్‌ఏఐఎ్‌స’, ’ఎంఎన్‌ఏఐఎ్‌స’, ’డబ్లుబీసీఐఎస్‌’... పథకాలను 2015 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. వానాకాలం సీజన్‌లో రైతులు బ్యాంకుల్లో, సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకున్న సమయంలోనే  సంబంధిత ప్రీమియం మొత్తాన్ని మినహాయించుకొనేవారు. నాన్‌లోనింగ్‌ రైతులు ఉంటే వారిని కూడా ఏవోలు, ఏఈవోలు సమీకరించి ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకునేవారు. కొన్ని పంటలకు వానాకాలం సీజన్‌లో, మరికొన్ని పంటలకు రబీ సీజన్‌లో ఇన్సురెన్స్‌ చేసేవారు.


రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరిని గ్రామం యూనిట్‌గా తీసుకొని బీమా అమలు చేసేవారు. పత్తి పంటకు మాత్రం వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఇన్సురెన్స్‌ చేసేవారు. మొక్కజొన్న పంటకేమో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఇన్సురెన్స్‌ చేసే పద్ధతి ఉండేది.. పీఎంఎ్‌ఫబీవై పథకం 2016 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. మూడేళ్లపాటు అమలుచేసిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎంఎ్‌ఫబీవైని రైతుల ఐచ్ఛికానికి వదిలేశాయి. బీమా చేసిన మొత్తంపై వానాకాలం పంటకు 2 శాతం, యాసంగి పంటకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లిస్తే సరిపోయేది. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం చెల్లించేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించే 50 శాతాన్ని గత ఫిబ్రవరి నెలలో తగ్గించుకొంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 25 శాతం, నీటి వసతి లేని ప్రాంతాల్లో 30 శాతం మాత్రమే చెల్లిస్తామని పేర్కొంది. మిగిలిన వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పటంతో  రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రీమియం చెల్లింపును  భారంగా భావించి పథకం నుంచి ఈ ఏడాది వైదొలిగింది.  దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్టుబడి ఖర్చులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో సబ్సిడీ లేకుండా ప్రీమియం మొత్తాన్ని చెల్లించే పరిస్థితుల్లో రైతులు లేరు. ప్రభుత్వరంగ, ప్రైవేటు రంగ కంపెనీలేవీ ముందుకు రాకపోవటంతో రైతులు మిన్నకుండిపోయారు.


అధికవర్షాలతో విధ్వంసం

ఆగస్టులో, సెప్టెంబరులో ఇప్పటిదాకా వర్షాలతో పలుచోట్ల వివిధ పంటలకు నష్టం జరిగింది. గత నెలలో 3.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఈ నెలలో 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు వానాకాలం సీజన్‌లో అతివృష్టికి 5.5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పంట నష్టంపై ఏఈవోలు అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు. కానీ నష్ట పరిహారం ఇస్తామని గానీ, ఇవ్వబోమని గానీ ప్రభుత్వం ప్రకటన చేయటం లేదు. పలుజిల్లాల్లో రైతులు, వివిధ రాజకీయ పార్టీలు, రైతుసంఘాల ఆధ్వర్యంలో పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇటీవల ప్రగతి భవన్‌ ముట్టడి కూడా చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రైతులకు లభించలేదు. 

Updated Date - 2020-09-24T09:27:22+05:30 IST