మూడో ముప్పు

ABN , First Publish Date - 2021-08-04T06:02:56+05:30 IST

మూడో ముప్పు

మూడో ముప్పు

ఇప్పటికే కేరళ, మహారాష్ట్రల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌

అక్కడ వ్యాప్తిని థర్డ్‌ వేవ్‌కు సంకేతంగానే భావించాలి

మరో మూడు వారాలు కీలకం

వైరస్‌ వ్యాప్తికి ఆ నాలుగు అంశాలే దోహదం

జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

జిల్లాలో కరోనా కేసులు తగ్గడంతో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలోని కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘఢ్‌ వంటి రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. సెకండ్‌వేవ్‌ కేరళ, మహారాష్ట్రల్లో ప్రారంభమైన నాలుగు నుంచి ఆరు వారాల తరువాత జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి పెరిగిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలను ముందస్తు హెచ్చరికగా భావించాల్సిన అవసరం వున్నదని పేర్కొంటున్నారు. 

అదుపులోకి రానట్టే...

జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభమై సుమారు నాలుగున్నర నెలలు దాటుతోంది. కేసులు తగ్గడం మొదలై రెండున్నర నెలలు దాటింది. అయితే, ఇప్పటికీ పదుల సంఖ్యలో  కేసులు నమోదుకావడం...కొంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా వైరస్‌ డౌన్‌ ఫాల్‌ ప్రారంభమైన ఐదు నుంచి ఆరు వారాల్లో కేసులు పూర్తిగా తగ్గాలని, కానీ ఇప్పటికీ ప్రతిరోజూ 100-200 మధ్య కొత్త కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేస్తున్నారు. సెకండ్‌వేవ్‌లో భారీగా కేసులు పెరగడానికి కారణమైన కొత్త మ్యూటెంట్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడం...ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెకండ్‌వేవ్‌ పూర్తిగా అదుపులోకి రాకముందే మూడో వేవ్‌ ప్రారంభమయ్యే ప్రమాదముందని చెబుతున్నారు. 


నాలుగు అంశాలు దోహదం.. 

మూడో వేవ్‌ వ్యాప్తికి ప్రధానంగా నాలుగు అంశాలు దోహదం చేసే అవకాశముందని వైద్య నిపు ణులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సినేషన్‌ ఆశించిన స్థాయిలో కాకపోవడం, హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందకపోవడం, కొత్త వేరియెంట్స్‌ విజృంభిస్తుండడం, కొవిడ్‌ ఆంక్షలు సడలింపుతో ప్రజలు ఎక్కువగా బయటకు వస్తుండడం కారణంగా మూడో వేవ్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశమున్నట్టు నిపుణు లు అంచనా వేస్తున్నారు. అయితే, ముం దు నుంచి చెబుతున్నట్టు చిన్నారులకు మాత్రమే మూడో వేవ్‌ పరిమితం కాదని, ఏ వయస్సు వారైనా వైరస్‌ బారినపడేందుకు అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్నాళ్లు... మూడు నుంచి ఐదు వారాలు అప్రమత్తంగా వుండడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అవకాశముందని పేర్కొంటున్నారు.


మరో 72 కరోనా కేసులు నమోదు

విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 72 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు మంగళవారం నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,53,248కు చేరింది. ఇందులో 1,50,599 మంది కోలుకున్నారు. మరో 1,595 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా కొవిడ్‌ బారినపడిన మరొకరు మృతిచెందడంతో మొత్తం మరణాలు 1054కు చేరాయి.

Updated Date - 2021-08-04T06:02:56+05:30 IST